Slbc : ఎస్ ఎల్ బీసీ టన్నెల్ (Tunnel) లో చిక్కుకున్న 8 మందిపై బురద, రాళ్లు కూరుకుపోయినట్టు తెలుస్తోంది. ఎన్డీఆర్ ఎఫ్ (Ndrf) బృందాలు జీపీఆర్ మిషిన్ తో స్కాన్ చేయగా.. మట్టిలో మూడు మీటర్ల లోపల కార్మికులు కూరుకుపోయినట్టు సమాచారం. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన అయితే రాలేదు. కానీ ప్రమాదం జరిగిన చోట చుట్టూ బురద, రాళ్లు మాత్రమే పేరుకుపోయాయి. పేర్లు పెట్టి పిలిచినా సరే కార్మికుల నుంచి కనీస స్పందన లేదు. దాంతో ఆ బురదలో జీపీఆర్ మిషిన్ తో స్కాన్ చేశారు అధికారులు.
ఈ మిషిన్ ద్వారా మట్టిలో కూరుకుపోయిన మృతదేహాలను కనిపెట్టొచ్చు. కార్మికుల ప్రాణాలపై ఆశ లేకపోవడంతో చివరకు ఈ మిషిన్ ద్వారా వారి మృతదేహాలను వెలికి తీసేందుకు ప్రయత్నిస్తున్నారు అధికారులు. పెద్ద ఎత్తున పేరుకుపోయిన బురద, రాళ్లను తొలగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరికొద్ది సేపట్లోనే దీనిపై ప్రకటన వచ్చే అవకాశం కూడా ఉంది. రెండు రోజుల్లో టన్నెల్ ఆపరేషన్ పూర్తి చేస్తామని ఇప్పటికే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ఆయన చెప్పిన ప్రకారం రేపటితో ఆపరేషన్ పూర్తి అయిపోతుంది. రేపు సాయంత్రం వరకు వారి మృతదేహాలను బయటకు తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వార్తలు బయటకు రావడంతో తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఆ ఎనిమిది మంది కుటుంబాలను ఆదుకోవాలంటూ కోరుతున్నారు.