CM Revanth: బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేసుకోడానికి శతవిధాలా ప్రయత్నాలు జరుగుతున్నాయని, అందుకు కల్వకుంట్ల ఫ్యామిలీపై వస్తున్న ఆరోపణలు, నమోదైన కేసుల్ని వాడుకోవాలని చూస్తున్నదని సీఎం రేవంత్ ఆరోపించారు. బుధవారం ఢిల్లీలో ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. వేర్వేరు కేసుల్లో కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు తదితరులు నిందితులుగా ఉన్నారని, వాటి దర్యాప్తు వేర్వేరు దశల్లో ఉన్నదని గుర్తుచేశారు. ఈ కేసులలో అరెస్టులు ఎందుకు చేయడం లేదని కిషన్‌రెడ్డి, బండి సంజయ్ సహా పలువురు బీజేపీ నేతలు ప్రశ్నిస్తుండటాన్ని ఆయన ప్రస్తావించారు. ఈ కేసులను సీబీఐ దర్యాప్తుకు అప్పజెప్పాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని బీజేపీ నేతలు డిమాండ్ చేయడం వెనుక పెద్ద కుట్ర ఉన్నదని సీఎం అన్నారు. కల్వకుంట్ల ఫ్యామిలీపై కేసుల్ని కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సీబీఐకి బదిలీ చేస్తే వాటిని అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్‌ను బీజేపీలో విలీనం చేయాలంటూ ఒత్తిడి చేసేందుకు వాడుకోవాలన్నదే అసలు ఉద్దేశమన్నారు. ఈ కేసులు సీబీఐ పరిధిలోకి రాగానే విలీనం కోసం ఒత్తిడి పెరుగుతుందని, బీజేపీ రాజకీయ లక్ష్యం నెరవేరుతుందన్నారు.
కేసీఆర్ కోసమే కిషన్‌రెడ్డి
కేసీఆర్ కోసమే కిషన్‌రెడ్డి పనిచేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. వీరిద్దరూ పార్టనర్లుగా ఉన్నారని సంచలన ప్రకటన చేశారు. ఈ కారణంగానే గత బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణ పనులు జరగలేదని చెప్పారు. ఇప్పుడు దీన్ని టేకప్ చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి క్రెడిట్, మంచి పేరు రావొద్దనే ఉద్దేశంతో కేంద్ర క్యాబినెట్‌కు వెళ్ళకుండా కిషన్‌రెడ్డి అడ్డుకుంటున్నారని ఆరోపించారు. గడచిన పదేండ్లలో మెట్రో రైల్ విస్తరణకు నోచుకోకపోవడానికి, ఆలస్యం కావడానికి వీరిద్దరే కారణమని సీఎం తేల్చి చెప్పారు. ప్రధాని మోదీకి ఇప్పుడు ఇచ్చిన ఐదు విజ్ఞప్తుల్లో మెట్రో రైల్ విస్తరణ అంశం కూడా ఉన్నదని, దాన్ని సాధించుకొని తీసుకురావాల్సిన బాధ్యత కేంద్ర మంత్రులుగా ఉన్న కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లదేనని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా తన వంతు బాధ్యతగా రాష్ట్రానికి చేయాల్సింది చేస్తున్నానని, కానీ కేంద్ర ప్రభుత్వంలో సంబంధం ఉన్న అంశాల్లో వాటికి అవసరమై అనుమతులు, సహకారం, ఆర్థిక సాయం తదితరాలను తీసుకొచ్చి వాళ్లే క్రెడిట్ తీసుకోవచ్చన్నారు. ఈ ప్రాజెక్టులకు కేంద్రం నుంచి అన్నీ సమకూరితే తానే స్వయంగా ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి కిషన్‌రెడ్డికి గండపెండేరం తొడిగి సన్మానం చేస్తానని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు. హైదరాబాద్ నగరానికి గతంలో మెట్రో రైల్‌ను తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ, అప్పటి పట్టణాభివృద్ది శాఖ మంత్రి జైపాల్ రెడ్డి అని గుర్తుచేశారు.