Krmb Meeting : కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు మీటింగ్ కు ఏపీ అధికారులు మరోసారి రాకపోవడంపై రాహుల్ బొజ్జా తీవ్ర విమర్శలు గుప్పించారు. కృష్ణా నీటి పంపకాలపై కేఆర్ ఎంబీ చైర్మన్ అతుల్ జైన్ ఆధ్వర్యంలో నేడు జలసౌధలో సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్ కు తెలంగాణ నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా (Rahul Bojja), ఎన్ ఈసీ హాజరయ్యారు. కానీ ఏపీ అధికారులు హాజరు కాలేదు. దీంతో సమావేశాన్ని గురువారంకు వాయిదా వేశారు. ఏపీ అధికారులు రాకపోవడంపై రాహుల్ బొజ్జా అసంతృప్తి తెలిపారు.
ఉద్దేశ పూర్వకంగానే ఏపీ అధికారులు సమావేశానికి రాలేదని.. ఇప్పటికే రెండు సార్లు సమావేశం వాయిదా వేసినట్టు గుర్తు చేశారు. శ్రీశైలం, సాగర్ నీటి వాటాపై తన వాయిస్ రికార్డు చేసి కేంద్రానికి ప్రతిపాదనలు పంపాలని చెప్పుకొచ్చారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల నుంచి మే నెల వరకు 63 టీఎంసీల నీళ్లు కావాలని తెలంగాణ కోరగా.. అదే మే నెల వరకు తమకు 55 టీఎంసీల నీరు కావాలని ఏపీ ప్రతిపాదనలు పంపింది. ఈ రెండు ప్రతిపాదనలపై చర్చించేందుకు సమావేశం నిర్వహించగా ఏపీ అధికారులు రెండుసార్లు హాజరు కాలేకపోయారు.