dharani
తెలంగాణ

Farmer Death: ప్రాణం తీసిన ధరణి; ఐదేళ్లు తిరిగిన పని కాకపోవడంతో…

Farmer Death: ధరణి దారుణానికి ఓ నిండు ప్రాణం బలైంది. పట్టా భూమి భూ రికార్డుల్లో సీలింగ్ కింద ఎంట్రీ అయిందని, ఈ తప్పును సరి చేసి తమకు న్యాయం చేయాలని ఐదేండ్ల పాటు అధికారుల చుట్టూ తిరిగి విసిగిపోయిన ఆ రైతు గుండె ఆగిపోయింది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కాజీపేట్ మండలం సోమిడి సర్వే నం.174 లో సుంచు రాంచందర్‌కు 23 గుంటలు, క్రాంతి అనసూయ సర్వే నం. 172 లో ఒక ఎకరం 19 గుంటల భూమిని 1997లో కొనుగోలు చేశారు. అప్పటి నుంచి వారు సాగు చేసుకుని జీవనం కొనసాగిస్తున్నారు. వీరికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాస్‌బుక్, తెలంగాణ ప్రభుత్వ పాస్‌బుక్ కూడా వచ్చింది. అయితే ధరణి వచ్చాక భూ రికార్డులో సర్వే నంబర్‌లో ఉన్న భూమి కనపడటం లేదని స్థానిక తహసీల్దార్‌ను కలిస్తే మీ భూమి సీలింగ్‌లోకి వెళ్లిందని చెప్పారు. దీంతో ఏం చేయాలో తెలియక ఐదేండ్ల నుంచి ఎక్కని ప్రభుత్వ కార్యాలయం మెట్టు లేదు, అడగని అధికారి లేడు అన్నట్టు కాళ్లరిగేలా తిరిగినా వారి సమస్య పరిష్కారానికి నోచుకోలేదు.

బాధితుల భూమిలో వెలిసిన వెంచర్
ఒక వైపు ధరణి‌ సమస్య కారణంగా రాంచందర్‌కు ఉన్న 23 గుంటల భూమికి గాను ఒక గుంట భూమి మాత్రమే రికార్డుల్లో కనిపిస్తున్నది. రాంచందర్ సోదరి అనసూయకు ఒక ఎకరం19 గుంటల భూమి ఉండగా రికార్డుల్లో 18 గుంటల భూమి మాత్రమే నమోదైంది. రికార్డుల్లో జరిగిన తప్పులను అదునుగా చేసుకొని కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు భూమి హద్దులు చెరిపేసి వెంచర్ ఏర్పాటు చేస్తున్నారని, ఇదేంటని అడిగితే మీ దిక్కున్న చోట చెప్పుకోండంటూ దురుసుగా మాట్లాడారని బాధితులు ఆరోపిస్తున్నారు.

ఎవరిదీ కుట్ర ..

పద్ధతి ప్రకారం కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్న భూమికి పట్టాదారు పాసు పుస్తకం ఉండగా మాకు తెలియకుండానే మా భూమి సీలింగ్‌లోకి వెళ్లింది. ఎలా వెళ్తుందని అధికారుల చుట్టూ 5 ఏళ్లుగా తిరుగుతున్నాం. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఈ భూమిలో నా కూతురికి కట్నం కింద 5 గుంటల భూమి ఇచ్చాం. ఇప్పుడు భూమి సీలింగ్ కింద పడటంతో అత్తింటి వారు కూతురిని ఇంటి నుంచి వెళ్లగొట్టారు. దీంతో కొన్ని రోజులుగా మనస్తాపానికి గురైన నా భర్త రాంచందర్ గుండెపోటుతో ఈ నెల 10వ తేదీన మృతి చెందాడు. ఉద్యోగం చేసే భర్త పోయాడు. ఇప్పుడు ఉన్న ఏకైక ఆధారం ఈ భూమే. ఈ భూమి కూడా పోతే మాకు ఆధారం లేకుండా పోతుంది. ప్రభుత్వం స్పందించి మా భూమి మాకు ఇప్పించాలి.     – శ్రీలత, రాంచందర్ భార్య

మాకు న్యాయం చేయాలి..
ఆంధ్రప్రదేశ్ పాసు పుస్తకం, తెలంగాణ వచ్చిన తరువాత తెలంగాణ పాసు పుస్తకం వచ్చాయి. ధరణి వచ్చిన తరువాత మాకు ఒక ఎకరం 19 గుంటల భూమికి గాను కేవలం 18 గుంటలు మాత్రమే రికార్డుల్లో కనిపిస్తున్నది. అధికారుల నిర్లక్ష్యం వల్లే మా భూములు రికార్డుల్లో కనిపించకుండా పోయాయి. నా సోదరుడు మృతి చెందడానికి ఈ సమస్యే కారణం. అధికారుల చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయి నా సోదరుడి గుండె ఆగిపోయింది. ఇప్పటికైనా ప్రజా ప్రభుత్వం స్పందించి మాకు న్యాయం చేయాలి.
                                                                                                                                                                – అనసూయ, బాధితురాలు

 

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు