Mahashivaratri: మహా శివరాత్రి సందర్భంగా ఆలయాలకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే ఆయా ఆలయాల్లో భక్తుల తాకిడి ఎక్కువైంది. పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాలు శివనామ స్మరణతో మార్మొగుతున్నాయి. ముఖ్యంగా వేములవాడ, కీసర, శ్రీశైలం, శ్రీకాళహస్తీ తదితర క్షేత్రాలకు విశేషంగా భక్తులు తరలివస్తున్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రజలకు ‘ఎక్స్’ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ఆ మహదేవుడి అనుగ్రహం అందరిపై ఉండాలని ప్రార్థిస్తున్నా’’ అంటూ సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఆ మహదేవుడి అనుగ్రహం అందరిపై ఉండాలని ప్రార్థిస్తూ మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలు అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. #Mahashivratri2025 pic.twitter.com/mznE0Z73y2
— Telangana CMO (@TelanganaCMO) February 26, 2025
ఇక, పలు ఆలయాల్లో నాయకులు పూజలు నిర్వహించారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని ఎల్ఎండీ కాలనీలో ఉన్న శ్రీ మృత్యుంజయ మహా దేవాలయంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకులు వారికి పూర్ణకుంభ స్వాగతం పలికారు. అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం వడ్లగూడెం గ్రామ శివారులో ఉన్న ప్రముఖ శివాలయం దుర్గా మల్లేశ్వర స్వామి దేవాలయంలో ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి, అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ప్రత్యేక పూజలు చేశారు.