తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: కాంగ్రెస్ (Congress) పార్టీ పాకిస్థాన్ టీం (Pakistan Team) అంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay Kumar) చేసిన వ్యాఖ్యలు వివాదస్పదమయ్యాయి. మంగళవారం కరీంనగర్‌లోని పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ… బీజేపీ పార్టీ ఇండియా టీం అని, కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ టీం అంటూ రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలను క్రికెట్‌తో అభివర్ణిస్తూ ప్రచారం నిర్వహించడం వివాదాస్పదమైంది. అయితే ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఘూటుగా స్పందించింది. గ్రాడ్యుయేట్స్ ఓట్ల కోసం కేంద్ర మంత్రి హోదాలో ఉన్న బండి సంజయ్ ఇంత దారుణంగా మాట్లాడుతారా? అంటూ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (Chamala Kiran kumar Reddy) ఫైర్ అయ్యారు. తమకు వేస్తే భారత్‌కు వేసినట్లు, కాంగ్రెస్‌కు ఓటు వేస్తే పాకిస్థాన్‌కు మద్దతిచ్చినట్లు అని కేంద్ర మంత్రి స్థాయిలో బండి కామెంట్ చేయడం దారుణంగా ఉన్నదన్నారు.
మంగళవారం ఆయన గాంధీభవన్‌లో మాట్లాడుతూ.. బండి సంజయ్ కేంద్ర మంత్రి స్థాయిలో స్ఫూర్తిదాయకంగా మాట్లాడాల్సిన అవసరం ఉన్నదన్నారు. ప్రజలను కన్ ప్యూజ్ చేసేందుకు ఏదైనా ఇలా మాట్లాడతారా? అంటూ నిలదీశారు. ఓట్ల కోసం దిగజారడం విచిత్రంగా ఉన్నదన్నారు. ఇక బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముస్లింలు ఓబీసీ కేటగిరిలోనే ఉన్నారనే విషయాన్ని బండి సంజయ్ మర్చిపోయాడని మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు కూడా ముస్లింలు ఓబీసీలోనే ఉన్నారని గుర్తు చేశారు.
మరోవైపు, ఫోన్ ట్యాపింగ్ నిందితులను ఇండియాకు రప్పించాల్సింది కేంద్ర ప్రభుత్వమే అని తెలిపారు. ఇప్పటి వరకు వాళ్లను తీసుకురాలేదంటేనే బీజేపీ, బీఆర్‌ఎస్‌ల ఒప్పందాలు అర్థమవుతున్నాయన్నారు. ఈడీ, సీబీఐ, ఐటీ సంస్థల స్టాఫ్ బీజేపీ కార్యకర్తల్లా పనిచేయడం సిగ్గుచేటన్నారు. కారు రేసింగ్ లో ఇప్పటి వరకు ఈడీ నిందితులను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు. మైక్ దొరికితే ఏదీ పడితే అది మాట్లాడవద్దని కోరారు. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై ఎంపీ తన బృందంతో ఎలక్షన్ కమిషన్ సీఈవోకి ఫిర్యాదు చేశారు. రూల్స్‌కు విరుద్ధంగా కామెంట్లు చేసినందుకు కోడ్ ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని వివరించారు.
హరీశ్ రావు.. అరెస్ట్ డ్రామాలు ఆపు..
తెలంగాణ ప్రజలు ఆనందంతో ఉంటే మాజీ మంత్రి హరీశ్ రావు తన కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారని ఎంపీ చామల ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో లక్షల మంది ప్రజలు బీఆర్‌ఎస్ నిర్వాహకంతో ఎల్‌ఆర్‌ఎస్‌లు కట్టలేని స్థితిలో ఉన్నారని గుర్తు చేశారు. పేదల బాగుకోసం ఎల్‌ఆర్‌ఎస్ కట్టమని తాము కోరుతుంటే.. బీఆర్ఎస్ నేతలు వద్దని కోరడం విచిత్రంగా ఉందన్నారు. గ్రామ పంచాయితీ లే అవుట్‌లలో అక్కడక్కడ ఇబ్బంది పడుతున్న వాళ్లందరికీ తమ ప్రభుత్వం ఓ దారి చూపే ప్రయత్నం చేస్తుందని తెలిపారు. ప్రజా పాలనలో ప్రజల కోసం మాత్రమే సేవలు అందిస్తామని.. కేటీఆర్ తరహాలో మున్సిపల్ శాఖలో రూ.50 కోట్లు తప్పుదోవ పట్టించమని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని గాడిలో పెట్టేందుకు తాము 24 గంటలు పాటు కష్టపడి పనిచేస్తుంటే, బీఆర్‌ఎస్ చిల్లర రాజకీయాలు చేయడం సరికాదన్నారు. రబ్బరు చెప్పులు వేసుకున్న హరీశ్ రావు, పదేళ్ల పవర్‌లోనే కోట్లకు పడగలు ఎత్తాడని గుర్తు చేశారు.