BRS: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. అయితే ఈ విషయంపై బీఆర్ఎస్ విమర్శలు చేస్తోంది. ఈ మేరకు ‘ఎక్స్’లో ఓ పోస్టు చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతిలో తెలంగాణ దగా పడ్డదని తీవ్రంగా విమర్శించింది. పాలన గాలికి వదిలి… సీఎం ఢిల్లీకి వెళ్తున్నారని, కప్పం కడితేనే పదవి ఉంటుందని ఆ పోస్ట్ లో రాసుకొచ్చింది.
కాంగ్రెస్ అధిష్టానం మెప్పు పొందడానికి 36 సార్లు ఢిల్లీ వెళ్లిన రేవంత్ రెడ్డి… ఎస్ఎల్ బీసీ టన్నెల్ ప్రమాదం జరిగి 72 గంటలు అవుతున్నా అక్కడికి వెళ్లలేదని ధ్వజమెత్తింది.సీఎం రేవంత్.. రెండు రోజులుగా పట్టభద్రుల, టీచర్ ఎమ్మెల్సీలో భాగంగా ప్రచారంలో పాల్గొంటున్నారు. అయితే బీఆర్ఎస్ మాత్రం పదే పదే ఈ అంశంపై విమర్శలు చేస్తోంది.
కాగా, ముఖ్యమంత్రి రేవంత్ తరచూ అనేక సందర్భాల్లో ఢిల్లీ వెళ్తున్నప్పటికీ…ఇటీవల ఆయనకు పార్టీ అధిష్ఠానానికి చెడిందని, రాహుల్ ఆయనకు అప్పాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని ప్రచారం జరిగింది. అయితే గత వారం ఆయన రాహుల్ తో భేటీ అవడంతో ఆ అపవాదు తొలిగిపోయినట్లు అయింది. రాహుల్ తో భేటీలో భాగంగా.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కులగణన, ఎస్సీ వర్గీకరణ గురించి కీలక చర్చలు జరిగాయని రేవంత్ చెప్పారు. అయితే వచ్చే నెలలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ కోటా ఎన్నికలను నిర్వహించనున్నట్లు ఈసీ ప్రకటించినందున…బహుశా ఆ పని మీదే రేవంత్ ఢిల్లీ పయనమై ఉంటారని టాక్ నడుస్తోంది.
రేవంత్ చేతిలో దగాపడ్డ తెలంగాణ!
కాంగ్రెస్ అధిష్టానం మెప్పుపొందడానికి 36 సార్లు ఢిల్లీకి వెళ్ళిన రేవంత్ కి, ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం జరిగి 72 గంటలు అవుతున్నా ప్రమాదంలో చిక్కుకున్న వారి దగ్గరకు వెళ్ళే సమయం లేదు. pic.twitter.com/4f8sTugOHZ
— BRS Party (@BRSparty) February 25, 2025
ఇక, ఎమ్మెల్యే కోటాలో వచ్చే నెల 29న 5 స్థానాలు ఖాళీ అవుతున్నాయి. వాటికి ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం ప్రకటించింది. మార్చి 3న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు ప్రకటించింది. 10వ తేదీవరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగనుంది. 11న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు 13 వరకు గడువు ఇచ్చారు. 20న పోలింగ్ నిర్వహించనున్నారు. అదే రోజూ కౌంటింగ్ చేపట్టి విజేతలను ప్రకటిస్తారు.
Read Also: