Tollywood Celebrities And NTR Wishes To Chandrababu And PawanKalyan:ఏపీలో అసాధారణ విజయాన్ని సొంతం చేసుకున్న కూటమికి సినీ ఇండస్ట్రీ నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీ అధినేత నారా చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లను అభినందిస్తూ సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో ద్వారా పోస్టులు పెడుతున్నారు. తాజాగా టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ వీరిద్దరికి కలిపి శుభాకాంక్షలు తెలిపారు. చారిత్రాత్మకమైన విజయాన్ని సాధించినందుకు ప్రియమైన చంద్రబాబు మామయ్యకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు.
మీ ఈ విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపు నడిపిస్తుందని ఆశిస్తున్నా. అద్భుతమైన మెజారిటీతో గెలిచిన నారా లోకేశ్‌కు, మూడోసారి ఘనవిజయం సాధించిన బాలకృష్ణ బాబాయికి, ఎంపీలుగా గెలిచిన శ్రీ భరత్, పురందేశ్వరి అత్తకు నా శుభాకాంక్షలు. అలాగే ఇంతటి ఘనవిజయాన్ని సాధించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్‌గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ ఎన్టీఆర్ సోషల్‌మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపాడు. అంతేకాకుండా పీఎం మోదీ నాయకత్వంలో ఎన్డీయే కూటమికి, ఏపీలో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌కు శుభాకాంక్షలు. ఆ దేవుడి ఆశీస్సులు మీపై ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నానని టాలీవుడ్ హీరో నాగార్జున శుభాకాంక్షలు తెలిపాడు.
దార్శనికుడు చంద్రబాబుకి శుభాకాంక్షలు. అద్భుతమైన విజయం సాధించారని హీరో రామ్‌చరణ్ శుభాకాంక్షలు తెలిపాడు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో విజయం సాధించిన కూటమి సభ్యులందరికీ విజయాభినందనలు నారా చంద్రబాబు, పురందేశ్వరి, పవన్ కల్యాణ్‌లకు ప్రత్యేక అభినందనలంటూ సీనియర్ దర్శకుడు పరుచూరి గోపాలకృష్ణ తెలిపారు. చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరితో దిగిన ఫొటోను ప్రముఖ గాయని స్మిత షేర్ చేసి స్పెషల్ విషెస్ తెలిపారు.
ప్రియమైన @ncbn మావయ్యకి ఈ చారిత్రాత్మకమైన విజయాన్ని సాధించిందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు… మీ ఈ విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపున నడిపిస్తుందని ఆశిస్తున్నాను.
అద్భుతమైన మెజారిటీతో గెలిచిన @naralokesh కి, మూడోసారి ఘన విజయం సాధించిన బాలకృష్ణ బాబాయికి, MPలుగా…
— Jr NTR (@tarak9999) June 5, 2024