– మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై అక్కసెందుకు?
– ఈ పథకానికి, మెట్రోకీ సంబంధమేంటి?
– కాంగ్రెస్ ప్రభుత్వ పథకంపై కంటిమంట దేనికి?
– మోదీజీ.. మెట్రోకు మీరు చేసిందేముంది?
Minister Ponnam Fire On Prime Ministers Comments: మహిళకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించటం సమంజసం కాదన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. ట్విట్టర్ వేదికగా దీనిపై మంత్రి స్పందించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తగదని ప్రధాని స్థాయి వ్యక్తి మాట్లాడటం దురదృష్టకరమని, ప్రధాని ఇలా మాట్లాడటం దిగజారుడుతనమేనని మండిపడ్డారు. మహిళలు ఆర్థికంగా బలపడేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు సొంత ఖర్చుతో ఈ సౌకర్యం కల్పిస్తే, ప్రధాని దానిని ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. నిజానికి, ఉచిత బస్సు ప్రయాణానికి మెట్రో రైలుకు సంబంధమే లేదని, మెట్రో రైలు ఎక్కే ప్రయాణికుల కేటగిరీ వేరని వివరించారు. మెట్రో రైలు అభివృద్ధి ప్రాజెక్ట్ కోసం మోదీ ఇప్పటివరకు చేసిందేమీ లేదని, పైగా కాంగ్రెస్ మీద అక్కసుతో రాజకీయ లబ్దికోసం ఇలా మాట్లాడటం ఆయన స్థాయికి తగదని అన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు అందిస్తున్న ఉచిత బస్సు ప్రయాణం విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో నిబద్ధతతో ఉందనీ, ఇది భవిష్యత్తులోనూ కొనసాగుతుందని హామీ ఇచ్చారు. అంతేగాక, రాబోయే రోజుల్లో ఈ పథకాన్ని సమీక్షించి, మరిన్ని రూట్లలో బస్సులు నడుపుతామని, సౌకర్యాల మీద కూడా దృష్టి సారిస్తామని స్పష్టం చేశారు. జనాభాలో సగం ఉన్న మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన చిన్న సౌకర్యం మీద ప్రధాని స్థాయి వ్యక్తి ఇలా ప్రతికూల వ్యాఖ్యలు చేయటం తగదని హితవు పలికారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించిన రాష్ట్రాలన్నింటిలో విపక్షాలే అధికారంలో ఉండటమే ఆయన వ్యాఖ్యలకు కారణమని ఆరోపించారు.
Also Read: విశ్వనగరం.. వానొస్తే నరకం
ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ ఒక జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించటం వల్ల వచ్చే సమస్యలను మాట్లాడారు. ఉచిత బస్సు అందుబాటులో ఉంటే దాదాపు సగం మంది మహిళలైనా వాటిలోనే ప్రయాణిస్తారని, దీనివల్ల కాలుష్యం పెరుగుతుందని, అదే సమయంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెచ్చిన మెట్రో రైలు వ్యవస్థ దెబ్బతింటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఉచిత బస్సు ప్రయాణంతో మెట్రో రైలు ఎక్కే మహిళలు సగం మేర తగ్గారని, ఇదిలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో మెట్రో నిర్వహణ కష్టతరం కాకతప్పదని ప్రధాని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో తక్షణ లబ్ది కోసం రాజకీయ పార్టీలు ఇలా హామీలివ్వటం తగదని ప్రధాని హితవు పలికారు. కాగా, ఇక, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని దేశ రాజధానిలో అక్కడి సీఎం కేజ్రీవాల్ ప్రారంభించగా, ప్రస్తుతం తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లోనూ ఈ పథకం అమల్లో ఉంది. కాగా, తాజాగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేళ.. తాము గెలిస్తే ఏపీలోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి తరపున ప్రచారం చేశారు.