Challenge: రాజకీయాలలో నాయకుల మధ్య జరిగే సవాళ్లు, ప్రతి సవాళ్లు ఛాలెంజ్‌లను సాధారణంగానే భావించాలి. రాజకీయాలలో మాట మీద నిలబడటం అంత మామూలు విషయం కాదు. 18వ లోక్ సభకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగస్టు 15 లోపు రైతుల రుణాలు మాఫీ చేస్తామనే హామీని రైతాంగానికి ఇచ్చారు. అయితే ఈ హామీ పై స్పందించిన బిఆర్ఎస్ నాయకులు, మాజీమంత్రి హరీష్ రావు ఆగస్టు 15 లోపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీ చేస్తే నేను నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ సిద్దిపేట నుండి పోటీ చేయను అనే ఛాలెంజ్ విసరటం జరిగింది. అయితే ఈ చాలెంజ్‌ని స్వీకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హరీష్ రావు చాలెంజ్‌ని స్వీకరిస్తున్నాను, రాజీనామాకు సిద్ధంగా ఉండాలని స్పందించారు. అయితే ఈ ఛాలెంజ్‌ని మరింత రాజకీయంగా రక్తి కట్టించడానికి హరీష్ రావు హైదరాబాద్ గన్ పార్క్‌లో ఉన్న అమరవీరుల స్థూపాన్ని వేదికగా చేసుకొని తన రాజీనామా పత్రాన్ని జర్నలిస్టులకు అందజేయడం జరిగింది.
లోక్‌సభ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చేనాటికి తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజులు పూర్తి చేసుకుంది. అయితే ఈ వంద రోజులలోనే ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన అన్ని వాగ్దానాలను అమలు చేయాలని ప్రతిపక్ష బిఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. కానీ వంద రోజులలోనే ఏ ప్రభుత్వము తాను ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చటం సాధ్యం కాదనే విషయం అటు పార్టీలకు ఇటు ప్రజలకు కూడా తెలుసు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రభుత్వం ఏర్పాటు అయిన తరువాత ప్రాధాన్యతా క్రమంలో ఎన్నికల సందర్భంగా ప్రజలకు హామీగా ఇచ్చిన 6 గ్యారంటీలకి సంబంధించిన 13 హామీలలో ఐదు హామీలను అమలులోకి తెచ్చారు. అలాగే రైతు రుణమాఫీకి సంబంధించి వ్యవసాయ మంత్రిత్వశాఖ అధికారులతో సమీక్ష సమావేశాన్ని కూడా నిర్వహించి రుణమాఫీ కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలనే నిర్ణయం ప్రజలకి రైతులకి ప్రభుత్వం పై విశ్వాసం కల్పించిందనే చెప్పాలి.
తెలంగాణ ఉద్యమ కాలంలోనూ రాష్ట్ర ఏర్పాటు అయిన తరువాత వివిధ సందర్భాలలో బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు దశాబ్ద పాలన కాలంలో ఎంత మేరకు నెరవేర్చిందనే ప్రశ్నలు సహజంగానే తలెత్తుతాయి. ప్రజలకు ఇచ్చిన హామీలను చిత్తశుద్ధితో అమలు చేసిన పార్టీకి, ప్రభుత్వానికి నాయకులకు ఇతరులను ప్రశ్నించే నైతిక అర్హత ఉంటుందనే విషయాన్ని కూడా గమనించాలి. తెలంగాణకి దళితుడే మొదటి ముఖ్యమంత్రి హామీని ఎందుకు అమలు చేయలేదు? ఎందుకు మాట తప్పారు? దళితులకు మూడు ఎకరాల భూమి పంపిణీ మాటేమిటి? ఆర్భాటంగా భూ పంపిణీని ప్రారంభించి ఎందుకు అటకెక్కించారు? కేజీ నుండి పీజీ వరకు ఉచిత ఇంగ్లీష్ మీడియం కార్పొరేటర్ విద్య ఏమైంది? డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఎందుకు కట్టించలేకపోయారు? ఇవి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలు కాదా?
Also Read: 23 సంవత్సరాలు..23 తప్పులు
ఈ అంశంపై రోజూ విమర్శలకు దిగుతున్న బీఆర్ఎస్ పార్టీ కూడా 2018 తెలంగాణ శాసనసభ ఎన్నికల వేళ రూ. 1 లక్ష రైతు రుణమాఫీని ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా తొలి విడతలో రూ.25 వేలు లోపు, రెండో విడతలో రూ.50వేల లోపు, మూడో విడతలో రూ.75వేల లోపు, నాల్గో విడతలో లక్ష రూపాయల లోపు రుణాలను మాఫీ చేయనున్నట్లు అప్పట్లో చెప్పారు. కానీ, దాని అమలుకు 2020 డిసెంబరులో శ్రీకారం చుట్టగా, 2023 శాసనసభ ఎన్నికల నాటికి కూడా ఈ ప్రక్రియను పూర్తిగా అమలు చేయలేకపోయింది. దీంతో కొందరు రైతుల మీద వడ్డీ భారం కూడా పడింది. దీనిమూలంగా వారికి మూడేళ్ల పాటు కొత్త రుణాలు లభించక, ప్రైవేటు వడ్డీ వ్యాపారుల బారిన పడాల్సి వచ్చింది. అలాగే, ఆ ఎన్నికల్లో తాము గెలిచిన వెంటనే రైతులకు ఉచిత ఎరువులు ఇస్తామనీ నాడు కేసీఆర్ ప్రకటించినా, దానినీ అమలు చేయలేకపోయారు. నిజానికి 2018 ఎన్నికల వేళ గులాబీపార్టీ లక్ష రూపాయల రైతు రుణమాఫీ, నిరుద్యోగులకు 3016 రూపాయల నిరుద్యోగ భృతి వంటి రెండు కీలక హమీలే ఇచ్చింది. కానీ, వాటిలో రుణమాఫీకి ఐదేళ్లు పడితే, నిరుద్యోగ భృతి గాలికి కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే.
రుణమాఫీ మీద హరీష్ విమర్శలను కాసేపు పక్కనపెడితే, ప్రభుత్వం ఇప్పటికే దీనిపై ముందడుగు వేసింది. రుణమాఫీ కోసం ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలనే నిర్ణయానికి వచ్చేసింది. దీనివల్ల ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితుల తలనొప్పి కూడా ఉండదని సర్కారు భావిస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో సుమారు 30 లక్షల మందికి పైగా రైతులకు రుణమాఫీ చేయాల్సి ఉండగా, సగటున దీనికి రూ. 35 వేల కోట్లు అవసరం అవతాయని ఒక అంచనా. రుణమాఫీపై తమ ఆలోచనను ఇప్పటకే రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వ పెద్దల దృష్టికీ తీసుకొచ్చారు. రైతులందరికీ ఒకే విడతలో రుణమాఫీ చేయాలని ప్రభుత్వం బ్యాంకులను కోరటం, ఈ రుణమాఫీకి అయ్యే మొత్తాన్ని ఒకేసారి చెల్లించటం సాధ్యం కాదు గనుక నెలవారీ వాయిదాల్లో బ్యాంకులకు చెల్లించేందుకు ప్రభుత్వం ఒక ప్రతిపాదనను బ్యాంకుల ముందుంచటం జరిగాయి. స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, వాణిజ్య పన్నుల శాఖల ద్వారా తనకొచ్చే ఆదాయంలో నిర్ణీత మొత్తాన్ని చెల్లించేందుకూ సర్కారు మానసికంగా సిద్ధమైంది.
Also Read: బీజేపీ, బీఆర్ఎస్ చెట్టాపట్టాల్!
2023 తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయటానికి రైతులకు ఒకేసారి రెండు లక్షల రూపాయల రుణాలను మాఫీ చేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ప్రజలు విశ్వసిస్తున్నారు. హామీలను అమలు చేయటానికి రేవంత్ రెడ్డి కూడా నిజాయితీగా చర్యలు ప్రారంభించారు. ఒకేసారి 30 లక్షల మంది రైతులకు 38 వేల కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేయటం అంత ఆషామాషీ విషయం కాదు. కానీ రైతాంగం కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం రుణాలను మాఫీ చేయాలనే కృత నిశ్చయంతో ఉంది. అందుకే ప్రభుత్వ అధినేతగా ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ చేసి తీరుతానని హామీ ఇస్తే, మొదట రుణమాఫీపై ఛాలెంజ్ చేసిన హరీష్ రావు.. రేవంత్ రెడ్డి లాంటి మొండి వాడితో పెట్టుకుంటే ఓటమి తప్పదని గ్రహించి రుణమాఫీతో పాటు ఆగస్టు 15 లోపు ఆరు గ్యారంటీలను కూడా అమలు చేయాలని మెలిక పెట్టి రాజీనామా ఛాలెంజ్ చేయటాన్ని పలాయన వాదంగానే చూడాలి. రేవంత్ రెడ్డి లాంటి నాయకుడితో ఓటమికి సిద్ధపడే ఛాలెంజ్ చేయాలని హరీష్ రావు కూడా తెలుసు. కాబట్టి రుణమాఫీతో పాటు ఆరు గ్యారంటీలను కూడా అమలు చేయాలని మెలిక పెడుతున్నాడు. రాజకీయాలు నాయకుల ఛాలెంజ్ ఎలా ఉన్నా రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై పేద ప్రజలు రైతులు పెట్టుకున్న ఆశలను వమ్ము చేయకుండా వారికి ఇచ్చిన హామీలను నెరవేర్చి తను ప్రజల కోసం పనిచేసే సేవకుడినని నిరూపించుకొని ప్రతిపక్షాల విమర్శలకు సరైన సమాధానం చెప్పాలని ఆశిద్దాం.
– డాక్టర్ తిరునహరి శేషు, రాజకీయ విశ్లేషకులు (కాకతీయ విశ్వవిద్యాలయం)