CM Reventh reddy voted kodangal with family lok sabha elections:
తెలంగాణ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఓటర్లు ఉదయం ఏడు గంటలకే పోలింగ్ కేద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దంపతులు కొడంగల్‌లోని ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆయన పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేశారు. నల్గొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ బస్సులో వెళ్లి ఓటు వేశారు. ములుగు జిల్లా జగ్గన్నపేటలో మంత్రి సీతక్క, ఖమ్మం జిల్లా మధిరలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, గొల్లగూడెంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కల్లూరు మండలం నారాయణపురంలో మంత్రి పొంగులేటి, సూర్యాపేట జిల్లా కోదాడలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఓటు వేశారు.
ఓటుతోనే హక్కుల పరిరక్షణ
తెలంగాణలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఓటు వేసేందుకు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్ చేశారు. దేశ భవిష్యత్తు మన భాధ్యత.. ఓటు వేయడం పై నిర్లక్ష్యం వద్దు.. ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని పిలుపునిచ్చారు. సోమవారం ఉదయం ట్వీట్ చేసిన ఆయన.. ప్రజాస్వామ్య రక్షణలో మీ పాత్ర పోషించాలి. యువతకు మరీ మరీ చెబుతున్నా మీ ఓటు హక్కు తప్పక వినియోగించుకోండి అని సూచించారు. భారత ప్రజాస్వామ్యం పటిష్టంగా ఉండటానికి ఓటే పునాది అని, ప్రజల హక్కుల పరిరక్షణ ఓటుతోనే సాధ్యం అన్నారు. ఓటు మన హక్కు మాత్రమే కాదని బాధ్యత కూడా అని గుర్తు చేశారు. మన బాధ్యత నిర్వర్తించినప్పుడే హక్కుల కోసం ప్రశ్నించే అవకాశం లభిస్తుందన్నారు.