- – తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల ఘట్టం సమాప్తం
– హామీలు, సంక్షేమ పథకాల అమలుపై దృష్టి పెట్టిన రేవంత్ సర్కార్
– వరుసగా అన్ని శాఖల మంత్రులతో సీఎం విడివిడిగా సమీక్షలు
– ఇవాళ ధరణి కమిటీ సమావేశం
– ఎన్నికల కోడ్‌తో పెండింగ్‌లో ఉండిపోయిన పనులు
– మళ్లీ అధికారులను, మంత్రులను అప్రమత్తం చేస్తున్న రేవంత్ రెడ్డి
– ముందుగా రైతు రుణమాఫీ విధివిధానాలపై కసరత్తు
– పరిష్కారం దిశగా ధరణి సమస్యలు
– రానున్న వర్షాకాలం దృష్టిలో పెట్టుకుని నాలాల పనుల వేగవంతం
– ఖరీఫ్ సీజన్‌లో సాగు నీరు, రైతు సబ్సిడీలపై త్వరలో సమీక్ష
Telangana CM Focus on administration after elections conducted review meetings: గత మూడు నెలలుగా పార్లమెంట్ ఎన్నికలపై గురిపెట్టిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, క్షేత్ర స్థాయి క్యాడర్ నుంచి మంత్రుల దాకా ఉరుకులు, పరుగులు పెట్టించారు. ప్రత్యర్థులను ఎదుర్కొంటూ, విపక్షాల వైఫల్యాలను ఎండగడుతూ తనదైన స్టయిల్‌లో ప్రసంగిస్తూ తనదైన ముద్ర వేశారు. అధిష్టానం అప్పజెప్పిన క్యాంపెయినర్ బాధ్యతను కూడా సక్రమంగా నిర్వర్తించారు. తెలంగాణ సహా పొరుగు రాష్ట్రాలలోనూ కాంగ్రెస్ తరఫున బీజేపీ విధానాలను తూర్పారబడుతూ జాతీయ రాజకీయాలలోనూ గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఎన్నికల ప్రక్రియ పూర్తవడంతో తెలంగాణలో పాలనపై దృష్టి పెట్టారు. పాలనాపరమైన అంశాలపై రివ్యూలు చేపడుతూ, సంక్షేమ పథకాల అమలు తీరుపై ఫోకస్ చేశారు. అందులో భాగంగానే తక్షణమే పూర్తి చేయవలసిన పెండింగ్ పనులను ముందుగా పూర్తి చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే ఇవాళ సెక్రటేరియట్‌లో ధరణి కమిటీ సమావేశం జరగనుంది. ధరణిని రద్దు చేసి ఆ స్థానంలో భూమాతగా పేరు మార్చే యోచనలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దిశగా చేసే ప్రయత్నాలు ఓ కొలిక్కి రానున్నాయి. అలాగే, విద్యుత్, విద్య, తాగునీటి సరఫరా, నీటి పారుదల శాఖల ప్రక్షాళనతో పాటు అసెంబ్లీ ఎన్నికలలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, హామీల అమలుకు సంబంధించిన విధివిధానాల రూపకల్పన, అందుకు అవసరమయ్యే ఆర్థిక వనరుల సమీకరణ తదితర అంశాలపై దృష్టిని కేంద్రీకరించారు సీఎం.
రైతు రుణ మాఫీ
పంద్రాగస్టులోగా ఒకేసారి రైతు రుణమాఫీ చేస్తామని ప్రకటించారు రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఆ దిశగా చర్యలకు ఉపక్రమించారు. రుణమాఫీ కోసం ఓ ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి రాష్ట్రానికి నెలనెలా వచ్చే ఆదాయంలో 10 శాతం దానికి మళ్లించి బ్యాంకులకు రూ.37 వేల కోట్లను ఈఎంఐ మాదిరిగా చెల్లించాలనే ఆలోచన చేసి ఈ హామీని నెరవేర్చాలనే సంకల్పంతో ఉన్నట్టు సమాచారం. ఇందుకోసం కేంద్ర ఆధీనంలో నడిచే ఆర్బీఐను సంప్రదించి అంగీకరించే ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తం వ్యవసాయ భూమిలో దాదాపు 45 శాతం మేర సాగులోనే లేదని, అయినా రైతుబంధు సాయాన్ని గత ప్రభుత్వం విడుదల చేసిందని, ఇది వృథాయేనంటూ ప్రాథమిక అంచనాకు వచ్చింది ప్రభుత్వం. ఇప్పుడు ఇదే అంశంపై పూర్తి నివేదికలు తెప్పించుకుని రైతు రుణమాఫీని సాధ్యమైనంత వేగవంతంగా పూర్తి చేయాలనే యోచనలో ఉన్నారు రేవంత్ రెడ్డి. అదీగాక వచ్చేది ఖరీఫ్ సీజన్. రైతులకు పంట సాయం కూడా అందజేయాలి. వారికి సబ్సిడీ విత్తనాలు, పనిముట్లు, సాగునీటి సదుపాయాలు కల్పించాలి. ఇప్పటికే మోదీ కిసాన్ సమ్మాన్ యోజన పథకం అమలు చేయాలనే నిర్ణయానికి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి త్వరలోనే అగ్రికల్చర్, రెవెన్యూ శాఖలతో రివ్యూ జరిపేందుకు కసరత్తు చేస్తున్నారు.
ధరణి పరిష్కారం దిశగా..
ధరణి చట్టం ప్రకారం భూములతో ముడిపడిన ఏ సమస్యనూ పరిష్కరించే అధికారం తహసీల్దార్, ఆర్డీవో, కలెక్టర్, భూపరిపాలన ప్రధాన కమిషనర్‌కు లేకుండా తెలంగాణ భూమి హక్కులు పట్టాదారు పాస్ పుస్తకం చట్టం-2020 తెచ్చారు. దానివల్ల, రికార్డులతో ముడిపడిన ఏ సమస్యనైనా న్యాయస్థానంలో తేల్చుకోవాల్సిందే. దాంతో ధరణి వల్ల ప్రజలు పడే బాధలను గుర్తించిన కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి వస్తే రద్దు చేస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ధరణి సమస్యలపై ఏర్పాటుచేసిన కమిటీ ఇచ్చిన నివేదికల ఆధారంగా సమస్యలను ఓ కొలిక్కి తేనుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే స్పెషల్ డ్రైవ్ ద్వారా కొన్ని సమస్యలను పరిష్కరించారు. జూన్ 1న ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టనున్నారు.
నాలా పూడిక పనులు
ప్రతి సంవత్సరం గ్రేటర్ పరిధిలోని ప్రజలు కొద్దిపాటి వర్షాలకే నరకం అనుభవిస్తున్నారు. లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోతాయి. వర్షాలకు నగరం అతలాకుతలం అవుతోంది. వచ్చేది వర్షాకాలం. అందుకే, నాలా పూడిక పనులను వేగవంతం చేసే పనులపై దృష్టి సారించింది ప్రభుత్వం. నగరంలో 1200 కిలోమీటర్ల పొడవునా నాలాలు ఉన్నాయి. ఇందుకు గాను పూడికతీత కోసం 952.71 కిలోమీటర్లు ఎంపిక చేశారు. నగర పరిధిలో 6 జోన్లలో 3.8 లక్షల క్యూబిక్ మీటర్ల వ్యర్థాలు ఉన్నట్లు అంచనా. ఒక్క చార్మినార్ జోన్ పరిధిలోనే 1.4 లక్షల క్యూబిక్ మీటర్లు ఉండటం గమనార్హం. నాలాల పూడికతీత పనులను వేగవంతం చేసే దిశగా జీహెచ్ఎంసీ అధికారులను అప్రమత్తం చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి.
నిధుల సమీకరణ
పూర్తి స్థాయిలో గ్యారెంటీలను అమలు చేయడానికి అవసరమైన నిధులపై రెవెన్యూ, ఫైనాన్స్ డిపార్టుమెంట్ల అధికారుల నుంచి వివరాలను సేకరించే బాధ్యతను అప్పజెప్పిన రేవంత్ రెడ్డి, త్వరలో రివ్యూ మీటింగ్ పెట్టి సమీక్షించనున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న ఆదాయ వనరులు, రుణం రూపంలో సమీకరించుకునే వెసులుబాటు, రైతు రుణ మాఫీ అమలు చేయాలనే టార్గెట్ ఉన్నందున వాటికి అవసరమైనట్లుగా రిజర్వులో ఉంచుకుని కేటాయించి విడుదల చేయడం, ఇలాంటి అంశాలన్నింటిపై త్వరలో రివ్యూ జరపనున్నారు. ఇవిగాక గోదావరి, కృష్ణా జలాలను ప్రణాళికాబద్ధంగా వాడుకోవడంపైనా ప్రభుత్వం దృష్టి పెట్టింది. తాగు, సాగు అవసరాలకు ఇబ్బంది లేకుండా ప్లాన్ ప్రకారం పనిచేయాలని సంబంధిత ఇరిగేషన్ అధికారులు, ఇంజనీర్లతో సమీక్ష ఏర్పాటు చేయనున్నారు. ఇక విద్యా సంవత్సరం కూడా వచ్చే నెల నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రాథమిక విద్య మొదలు ఉన్నత విద్య వరకు ప్రభుత్వం రివ్యూ చేసి కొన్ని నిర్ణయాలు తీసుకోనున్నది.