Rahul Gandhi news today
Politics

అమేథీ నుంచి రాహుల్ గాంధీ పోటీ.. యూపీ కాంగ్రెస్ నేత క్లారిటీ..

Lok Sabha Polls : సార్వత్రిక ఎన్నికలకు అన్ని పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. ఇప్పటికే బీజేపీ తొలి జాబితా విడుదల చేసి ఎన్నికల రేసును మొదలు పెట్టింది. అటు విపక్షాల కూటమి ఇండియా కూడా వ్యూహాలకు పదును పెడుతోంది. కూటమిలోని పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు కొలిక్కి వస్తోంది. యూపీలో కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు జరిగింది. ఇప్పుడు యూపీ నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పోటీపై క్లారిటీ కూడా వచ్చేసింది.

లోక్ సభ ఎన్నికల్లో మరోసారి ఉత్తర్ ప్రదేశ్ లోని అమేథీ నియోజకవర్గం నుంచి రాహుల్ గాంధీ బరిలోకి దిగాలని భావిస్తున్నారు. ఈ విషయాన్ని యూపీకి చెందిన కాంగ్రెస్ నేత ప్రదీప్ సింఘాల్ వెల్లడించారు. ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ పెద్దలను కలిసి తర్వాత ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు. రాహుల్ గాంధీ అమేథీ నుంచి పోటీ చేసే విషయాన్ని అధికారికంగా త్వరలోనే ప్రకటిస్తారని తెలుస్తోంది.

2019 వరకు అమేథీ నియోజకవర్గం కాంగ్రెస్ కు కంచుకోటగా ఉంది. 1967 నుంచి 2019 వరకు రెండు పర్యాయాలు మినహా కాంగ్రెస్ అభ్యర్థులే ఇక్కడ విజయ భేరి మోగించారు. ఇందిరా గాంధీ కుటుంబ సభ్యులకు అమేథీ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఇందిరా గాంధీ చిన్న కుమారుడు సంజయ్ గాంధీ ఇక్కడ నుంచే ఎంపీగా ఎన్నికయ్యారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ఉపఎన్నిక సహా 4సార్లు గెలిచారు. సోనియా గాంధీ కూడా ఒక పర్యాయం ప్రాతినిధ్యం వహించారు.

రాహుల్ గాంధీ కూడా ఈ నియోజకర్గం నుంచి గెలిచి తొలిసారి ఎంపీగా పార్లమెంట్ లో అడుగుపెట్టారు. హ్యాట్రిక్ విజయాలు సాధించారు. 2004 నుంచి 2019 వరకు ఆయనే ప్రాతినిధ్య వహించారు. అయితే 2019 ఎన్నికల్లో రాహుల్ గాంధీ అనూహ్యంగా ఓటమిపాలయ్యారు. ఆ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ విజయం సాధించారు. ఇలా చాలాకాలం తర్వాత కాంగ్రెస్ అమేథీలో ఓడిపోయింది.

వచ్చే ఎన్నికల్లోనూ అమేథీ నుంచి బీజేపీ అభ్యర్థిగా స్మృతి ఇరానీనే బరిలోకి దిగనున్నారు. బీజేపీ అభ్యర్థుల తొలి జాబితాలోనే ఆమెకు స్థానం దక్కింది. కాషాయ పార్టీ అమేథి అభ్యర్థిగా స్మృతి ఇరానీ పేరును ప్రకటించింది. స్మృతి ఇరానీ 2014 ఎన్నికల్లో కూడా అమేథీ నుంచి పోటీ చేసి రాహుల్ గాంధీ చేతిలో ఓడిపోయారు. ముచ్చటగా మూడోసారి రాహుల్ గాంధీ, స్మృతి ఇరానీ మధ్య పోటీ జరగనుంది.