IPL 2024: ఎన్నో రికార్డులకు ఐపీఎల్-24 వేదికగా మారింది. ఎప్పుడూ లేనంతగా భారీ స్కోర్లు, సిక్సులు, ఫోర్లు నమోదవుతున్నాయి. జస్ప్రీత్ బుమ్రా లాంటి ఒకరిద్దరు టాప్ బౌలర్లు తప్ప అంతా బ్యాటర్ల దాడిలో బలవుతున్నారు. ఎలాంటి బంతులు వేస్తున్నా పరుగులు లీక్ అవుతుండటంతో ఎవరికీ ఏం చేయాలో పాలుపోవడం లేదు. అయితే బౌలర్లకు గుడ్ న్యూస్. క్యాష్ రిచ్ లీగ్‌లో నయా ప్రయోగానికి బీసీసీఐ రెడీ అవుతోంది. ఇది గానీ సక్సెస్ అయిందా ఇక బ్యాటర్లకు చుక్కలేనని చెప్పాలి. ఇందుకోసం బీసీసీఐ వికెట్ నుంచి బ్యాటర్లతో పాటు బౌలర్లకు కూడా హెల్ప్ లభించేలా కొత్త పిచ్‌లను తయారు చేస్తోంది. వీటినే హైబ్రిడ్ పిచ్‌లుగా పిలుస్తున్నారు. సిస్‌గ్రాస్ అనే సంస్థ రూపొందిస్తున్న ఈ పిచ్‌లు మంచి రిజల్ట్స్ ఇస్తున్నాయి. ఈ ట్రాక్స్‌లో న్యాచులర్ గ్రాస్‌తో పాటు 5 శాతం పాలిమర్ కూడా కలసి ఉంటుంది. దీంతో పేసర్లు కన్సిస్టెంట్గా బౌన్స్ రాబట్టొచ్చు. వికెట్ చాలా సేపటి వరకు తాజాగా ఉంటుంది. కాబట్టి బౌలర్లు మరింత ఎఫెక్టివ్‌గా బౌలింగ్ చేయొచ్చు.
హైబ్రిడ్ పిచ్ గా ధర్మశాల
ధర్మశాల స్టేడియాన్ని రెండో హోం గ్రౌండ్‌గా ఎంచుకున్న పంజాబ్ కింగ్స్ జట్టు మే 5న చెన్నై సూపర్‌కింగ్స్‌తో.. మే 9న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఈ హైబ్రిడ్ పిచ్‌లపై ఆడబోతోంది. ఈ మ్యాచ్‌ల ఫలితాలను బట్టి మున్ముందు మ్యాచ్‌ల్లోనూ ఇలాంటి పిచ్‌లు తయారుచేయడానికి బీసీసీఐ ఆలోచన చేస్తోంది. ఐసీసీ కూడా ఇప్పటికే టీ20, వన్డేల్లో హైబ్రిడ్ పిచ్‌ల వాడకానికి ఆమోదం తెలపడంతో త్వరలో అంతర్జాతీయస్థాయిలోనూ ఈ పిచ్‌లపై మ్యాచ్‌లు జరిగే అవకాశాలున్నాయి. ఇంగ్లాండ్‌లో హైబ్రిడ్ పిచ్‌లపై టీ20, వన్డే మ్యాచ్‌లే కాదు నాలుగు రోజుల కౌంటీ మ్యాచ్‌లు కూడా ఆడుతున్నారు. ఈనేపథ్యంలో హైబ్రిడ్ ప్రయోగం మన ఐపీఎల్‌లో ఎలాంటి ఫలితాలు ఇస్తుందనేది ఆసక్తికరం.