Vemulawada MLA Adi Srinivas Slams on KCR
Politics

KCR: అప్పుడు గడపదాటనివ్వలే.. ఇప్పుడు బంతి భోజనాలు

– ఫామ్‌హౌజ్‌లో ఎమ్మెల్యేలతో కేసీఆర్ ఫేర్‌వెల్ పార్టీ
– మునిగిపోయే నావలో ఎవరుంటారు: ఆది శ్రీనివాస్ సెటైర్లు
– వాళ్లు ఎమ్మెల్యేలను కొన్నారు.. మేం ఆహ్వానిస్తున్నాం: మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్

Farm House: బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి ఎమ్మెల్యేల చేరికలు జోరు అందుకుంటున్న సందర్భంగా నష్టనివారణ చర్యల కోసం కేసీఆర్ రంగంలోకి దిగారు. ఫామ్‌హౌజ్‌లో వరుసగా ఎమ్మెల్యేలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. కాగా, ఎమ్మెల్యేలను ఆహ్వానిస్తున్న కాంగ్రెస్ పార్టీపై కేటీఆర్ ట్విట్టర్ వేదికగా విమర్శలు సంధిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ ద్వంద్వ నీతిని ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ వ్యవహార శైలిని కూడా ఎత్తిచూపుతున్నారు. అసెంబ్లీ మీడియా హాల్‌లో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్‌లు మాట్లాడుతూ కేసీఆర్, కేటీఆర్‌లపై విమర్శలు సంధించారు.

కేసీఆర్ తన ఎర్రవెల్లి ఫామ్‌హౌజ్‌లో ఎమ్మెల్యేలతో వీడ్కోలు పార్టీ చేసుకుంటున్నారని ఆదిశ్రీనివాస్ సెటైర్ వేశారు. ఒకప్పుడు ఇదే కేసీఆర్ ఆ ఎమ్మెల్యేలను ప్రగతి భవన్ మెట్లు కూడా ఎక్కనివ్వలేదని, కానీ, నేడు ఎమ్మెల్యేలను పార్టీలో నుంచి బయటికి వెళ్లకుండా కాపాడుకోవడానికి తన ఫామ్‌హౌజ్‌కు రప్పించుకున్నారని, వారితో బంతి భోజనాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఒకప్పుడు ప్రతిపక్ష పార్టీల గొంతు నొక్కిన కేసీఆర్ కొడుకు కేటీఆర్ ఇప్పుడు ఫిరాయింపులపై బాధ పడుతున్నారని ఎద్దేవా చేశారు. ఆయన ట్విట్టర్‌లో తప్పితే మరో చోట కనిపించరని, ప్రజలకు ఉపయోగపడే చోట అసలే కనిపించరని విమర్శించారు. ఇప్పుడు ఫిరాయింపులపై బాధపడే కేటీఆర్ 2019లో 19 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కేసీఆర్ బీఆర్ఎస్‌లో చేర్చుకున్నప్పుడు కేటీఆర్ ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. కేసీఆర్ అడ్డగోలుగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గుంజుకున్నప్పుడు కేటీఆర్‌కు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ మునిగిపోయే నావ అని, ఆ మునిగిపోయే నావలో ఎవరు ఉంటారని అడిగారు.

ఇక మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ కౌశిక్ రెడ్డి ప్రమాణాల ఎపిసోడ్ పై స్పందించారు. కౌశిక్ రెడ్డి మాటలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని, దేవుళ్ల ముందు వెళ్లి తప్పుడు ప్రమాణాలు చేస్తున్నారని ఆగ్రహించారు. కౌశిక్ రెడ్డి చేస్తున్న ఆరోపణలు అవాస్తవాలని పేర్కొన్నారు. కేసీఆర్ తమ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేస్తే అది కేవలం కలగానే మిగిలిపోతుందని స్పష్టం చేశారు. కేసీఆర్‌కు చేతనైతే ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాలని, కానీ, ప్రజా వ్యతిరేకంగా నడుచుకోవడం సరికాదని సూచించారు. రేవంత్, కాంగ్రెస్ తుఫానులో కేసీఆర్ కొట్టుకుపోతారన్నారు. జీవన్ రెడ్డి అలక గురించి మాట్లాడుతూ.. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు జీవన్ రెడ్డి నిలబడ్డాడని, పార్టీ క్యాడర్‌ను కాపాడారని తెలిపారు. జీవన్ రెడ్డి అంటే తమకు, రేవంత్ రెడ్డికి చాలా గౌరవం అని వివరించారు.