HC send notice to ktr
Politics

KTR: పరీక్షా పే చర్చ నిర్వహించే మోదీకి.. నీట్ పట్టదా?

NEET: నీట్ పరీక్షను వ్యతిరేకించే గళాలు పెరుగుతున్నాయి. చాన్నాళ్ల నుంచి తమిళనాడు వ్యతిరేకిస్తున్నది. తెలంగాణ కూడా ఇదే స్వరం వినిపిస్తున్నది. అధికార, ప్రతిపక్ష పార్టీలకు అతీతంగా తెలంగాణలో ఈ డిమాండ్ వినిపిస్తున్నది. విద్యార్థులను బలిపెడుతున్న.. వారి జీవితాలను ఆడుకుంటున్న నీట్ పరీక్షను రద్దు చేయాలని కోరుతున్నారు. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇదే డిమాండ్‌ను పునరుద్ఘాటించారు.

నీట్ యూజీ ఎగ్జామ్ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వ తీరుపై కేటీఆర్ మండిపడ్డారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్ ప్రమాదంలో పడినా కేంద్రం పట్టించుకోదా? అని నిలదీశారు. ఓవైపు గ్రేస్ మార్కుల గందరగోళం.. మరో వైపు పేపర్ లీకేజీల వ్యవహారంతో పిల్లల్లో, తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన నెలకొంటున్నదని వివరించారు. పరీక్షా పే చర్చ నిర్వహించే ప్రధాని మోదీకి, కేంద్రమంత్రులకు నీట్ పరీక్ష ఎందుకు పట్టడం లేదని ప్రశ్నించారు. మొత్తం వ్యవహారంలో సమగ్ర విచారణ చేపట్టాలని, బాధ్యులను శిక్షించాలని డిమాండ్ చేశారు. కష్టపడి చదివిన విద్యార్థులకు నష్టం జరగకుండా చూడాలని కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖలో కేటీఆర్ పేర్కొన్నారు.

వైద్య విద్యలోకి ప్రవేశ పరీక్ష కోసం పిల్లలు రేయింబవళ్లు కష్టపడతారు. తల్లిదండ్రులూ వారికి అండగా నిలబడతారు. నిద్రాహారాలు మానేసి మరీ నీట్ కోసం ప్రిపేర్ అయ్యే విద్యార్థులు ఉన్నారు. కానీ, కొందరికి నీట్ పరీక్ష కోట్ల రూపాయలను సంపాదించే వ్యవహారంగా మారింది. పేపర్ లీక్‌ చేసి కోట్ల రూపాయలు దండుకుంటున్నారు. మొన్నటి నీట్ పరీక్షా పత్రం కూడా బిహార్‌లో లీక్ అయిందని కేసు నమోదైంది. మొత్తం 14 మంది విద్యార్థుల ప్రమేయం ఇందులో ఉన్నదని, కొందరిని ఇప్పటికే అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. రూ. 30 లక్షల చొప్పున నీట్ కొశ్చన్ పేపర్‌ను అమ్ముకున్నట్టు సమాచారం.