Elon Musk: లోక్ సభ, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఓడిపోయిన వారి నుంచి అనేక అనుమానాలు వచ్చాయి. తప్పక గెలుస్తామని భావించి ఓడినవారు అంతిమంగా ఈవీఎంల సామర్థ్యంపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఫలితాలు వెలువడి పది రోజులు గడిచిపోయినా ఇప్పటికీ ఈవీఎం హ్యాక్ అంశంపై చర్చ జరుగుతూనే ఉన్నది. తాజాగా రాహుల్ గాంధీ కూడా దీనిపై రియాక్ట్ అయ్యారు. ప్రముఖ టెక్ దిగ్గజం, టెస్లా సీఈవో ఎలన్ మస్క్ చేసిన ట్వీట్ రీట్వీట్ చేస్తూ రాహుల్ గాంధీ తన అభిప్రాయాన్ని జోడించారు.
‘మనం ఈవీఎంలను తప్పకుండా పక్కనపెట్టాలి. వీటిని మనుషులు లేదా ఏఐ (కృత్రిమ మేధా) హ్యాక్ చేసే ముప్పు కొంచెమే ఉన్నా అది గంభీరమైన ప్రభావం వేస్తుంది’ అని ఎలన్ మస్క్ ట్వీట్ చేశారు. దీనికి స్పందనగా.. రాహుల్ గాంధీ రియాక్ట్ అవుతూ.. భారత దేశంలో ఈవీఎంలు బ్లాక్ బాక్స్ వంటివని, వీటిని పరిశీలించడానికి ఎవరికీ అనుమతి ఇవ్వరని కామెంట్ చేశారు. భారత ఎన్నికల విధానంలో పారదర్శకతపై ఆందోళనకర అభ్యంతరాలు వస్తున్నాయని పేర్కొన్నారు. వ్యవస్థలు వాటి జవాబుదారీతనాన్ని చూపలేకపోయినప్పుడు ప్రజాస్వామ్యం వట్టి బూటకంగా లేదా మోసపోయే ముప్పు ఎక్కువగా ఉంటుందని వివరించారు.
EVMs in India are a “black box,” and nobody is allowed to scrutinize them.
Serious concerns are being raised about transparency in our electoral process.
Democracy ends up becoming a sham and prone to fraud when institutions lack accountability. https://t.co/nysn5S8DCF pic.twitter.com/7sdTWJXOAb
— Rahul Gandhi (@RahulGandhi) June 16, 2024
ఈ ట్వీట్‌కు మిడ్ డే పేపర్ క్లిప్‌ను జతచేశారు. ఏక్‌నాథ్ షిండే వర్గానికి చెందిన శివసేన ఎంపీ రవీంద్ర వాయికర్ బావమరిది ఫోన్ వాడి ఈవీఎం అన్‌లాక్ చేశాడన్న ఆరోపణలతో వచ్చిన కథనాన్ని జోడించారు. ఈవీఎంలను కౌంటింగ్ చేసేటప్పుడు అన్‌లాక్ చేయడానికి ఉపయోగించే ఓ ఎన్నికల అధికారి ఫోన్‌ను రవీంద్ర వాయికర్ బావమరిది మంగేశ్ పందిల్కర్ ఉపయోగించాడని, కౌంటింగ్ కేంద్రంలో ఆ ఫోన్ ద్వారా ఈవీఎంను అన్‌లాక్ చేయడానికి అవసరమైన ఓటీపీని జెనరేట్ చేశాడన్న ఆరోపణలు వచ్చాయి. అందువల్లే ఉద్ధవ్ ఠాక్రే వర్గం ఎంపీ అభ్యర్థి అమోల్ గజానన్ కిర్తీకర్ కేవలం 48 ఓట్లతో ఓడిపోయాడనే వాదనలు వచ్చాయి. ఇందుకు సంబంధించిన పేపర్ క్లిప్‌ను జత చేసి రాహుల్ పై ట్వీట్ చేశారు.
ఈవీఎంలను హ్యాక్ చేసే ముప్పు ఉన్నదని, బ్యాలెట్ పద్ధతి బెటర్ అనే చర్చ దేశ విదేశాల్లోనూ ఉన్నది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న జూనియర్ రాబర్ట్ ఎఫ్ కెన్నెడీ ఇందుకు సంబంధించి ఓ ట్వీట్ చేశారు. పూర్టో రికో ప్రైమరీ ఎన్నికల్లో వందలాది సంఖ్యలో అవకతవకలు జరిగాయని మీడియాలో కథనాలు వస్తున్నాయని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ పై ఎలన్ మస్క్ స్పందిస్తూ.. ఈవీఎంలను ఎన్నికల ప్రక్రియలో ఉపయోగించకూడదని పేర్కొన్నారు.
Anything can be hacked
— Elon Musk (@elonmusk) June 16, 2024
అలాగే.. మాజీ కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ కూడా ఈ అంశంపై ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అయ్యారు. ఎలన్ మస్క్‌ది చాలా జెనరలైజేషన్ స్టేట్‌మెంట్ అని, ఆయన అభిప్రాయంలో ఎవరూ సురక్షితమైన డిజిటల్ హార్డ్‌వేర్‌ను తయారు చేయలేరు.. కానీ, ఇది తప్పు అని ట్వీట్ చేశారు. భారత్‌లా సరైన ఈవీఎంలను తయారు చేయవచ్చని, అవసరమైతే ఎలన్ మస్క్‌కు ట్యూటోరియల్ చెప్పడానికి కూడా రెడీ అన్నట్టుగా కామెంట్ చేశారు. ఇందుకు ఎలన్ మస్క్ రియాక్ట్ అవుతూ.. దేన్నైనా హ్యాక్ చేయవచ్చని స్పష్టం చేశారు. టెక్నికల్‌గా ఎలన్ కామెంట్ సరైందేనని పేర్కొంటూ ఆ సంభాషణ, సందర్భాలు వేరని పేర్కొన్నారు. ఏదైనా సాధ్యమేనని బీజేపీ నేత రాజీవ్ చంద్రశేఖర్ అన్నప్పుడు భారత ఈవీఎంలు హ్యాక్‌కు గురికావని ఎలా చెబుతారని కాంగ్రెస్ యూత్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ బీసీ రియాక్ట్ అయ్యారు.
కొన్ని గంటలుగా ట్విట్టర్‌లో ఈవీఎం అనే పదం ట్రెండింగ్‌లోనే ఉంది.