ఈవీఎం ధ్వంసం కేసులో ఈసీ సీరియస్
మాచర్ల ఎమ్మెల్యే అరెస్టుకు ఆదేశాలు
దుబాయ్ వెళ్లేందుకు పిన్నెల్లి బ్రదర్స్ యత్నం
Pinnelli Brothers: ఈవీఎంను పగలగొట్టిన కేసులో మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టు అయినట్టు వార్తలు వచ్చాయి. కానీ, అవి అవాస్తవం అని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం పిన్నెల్లి పరారీలో ఉన్నాడు. పోలీసులకు చిక్కినట్టే చిక్కి తప్పించుకుపోయాడు. ఆయన విదేశాలకు పారిపోయారా? లేక ఇక్కడే అజ్ఞాతంలో ఉన్నారా? అనేది ఇంకా తెలియరాలేదు. ఆయన దేశం దాటకుండా లుక్ ఔట్ నోటీసులైతే జారీ చేశారు.
హైదరాబాద్ కూకట్‌పల్లిలోని ఆయన స్వగృహంలో పిన్నెల్లి ఉంటారని భావించి బుధవారం ఉదయం గురజాల డిఎస్పీ ఆధ్వర్యంలోని ఒక బృందం సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది. వీరికి తెలంగాణ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు కూడా సాయంగా నిలిచారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి దుబాయ్ వెళ్లేందుకు ప్లాన్ వేసుకున్నాడని, బుధవారం మధ్యాహ్నం 1.20 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి దుబాయ్ వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నాడని తెలుసుకుని అక్కడ పోలీసులు మాటు వేశారు. అయితే, ఈ విషయం గ్రహించి సంగారెడ్డి జిల్లా కంది వద్ద కారు, డ్రైవర్, మొబైల్‌ను వదిలేసి వేరే వాహనంలో ఎమ్మెల్యే పరార్ అయ్యారు. దీనిపై కారు డ్రైవర్, గన్‌మెన్‌లను పోలీసులు ప్రశ్నించారు. పోలీసులు అక్కడికి చేరడానికి కొద్దిసేపు క్రితమే పిన్నెల్లి పారిపోయినట్టు తెలిసింది. ఆయన అరెస్టు అయినట్టు వస్తున్న వార్తలు అవాస్తవం అని సంగారెడ్డి ఎస్పీ స్పష్టం చేశారు.
పోలింగ్ రోజు మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని రెంటచింతల మండలం పాల్వాయిగేటు (పోలింగ్ కేంద్రం 202)లో ఈవీఎంను ధ్వంసం చేసిన ఎమ్మెల్యేపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఐపీసీ, ప్రజాప్రాతినిధ్య చట్టం, పీడీపీపీ చట్టాల పరిధిలో 10 సెక్షన్లతో పిన్నెల్లిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఐపీసీ కింద 143, 147, 448, 427, 353, 452, 120బి, ఆర్పీ చట్టం 131, 135 సెక్షన్లతో కేసులు నమోదయ్యాయి. ఈనెల 20నే పిన్నెల్లిపై కేసులు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు.