YCP manifesto 2024(Political news in AP): ఏపీలో ఎన్నికల ప్రచారం ఉధృతంగా చేపడుతున్న వైసీపీ తాజాగా 2024 ఎన్నికల కోసం మ్యానిఫెస్టోను విడుదల చేసింది. తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో సీఎం, వైసీపీ చీఫ్ జగన్ వైసీపీ మ్యానిఫెస్టో 2024ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష టీడీపీపై తీవ్ర విమర్శలు చేశారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలు చేశామని, అందుకే తమకు ప్రజల్లో అపార విశ్వసనీయత ఉన్నదని వివరించారు. 2014 ఎన్నికల్లో టీడీపీ ఇచ్చిన హామీలను ఆ తర్వాత అధికారంలోకి వచ్చి గాలికి వదిలిపెట్టిందని ఆరోపించారు. మ్యానిఫెస్టో విడుదలైన తర్వాత టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు జగన్ పై విమర్శలు సంధించారు. సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన జగన్.. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ప్రజలను ఓట్లు అడుగుతారని నిలదీశారు.
గత మ్యానిఫెస్టోలని ముఖ్యమైన హామీలను కొనసాగిస్తామని కొత్త మ్యానిఫెస్టోలో పార్టీ పేర్కొంది. అమ్మ ఒడి, విద్యా కానుక, మహిళలకు వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా వంటి స్కీములను కొనసాగించే నిర్ణయం తీసుకుంది. పింఛన్లు, నేస్తం పథకాలు వంటివాటిని కొనసాగిస్తూ ప్రజలకు పంపిణీ చేసే మొత్తాలను దశల వారీగా పెంచుతామని కొత్త మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చింది. మ్యానిఫెస్టోలోని కీలక విషయాలు ఇలా ఉన్నాయి.
Also Read: కవరింగ్ కింగ్.. మల్కాజ్‌గిరి మీదేనంటవ్!
పింఛన్‌ను 3 వేల నుంచి రూ. 3,500 పెంపు, వైఎస్సార్ చేయూత రూ. 75 వేల నుంచి లక్షా 50 వేలకు పెంపు, అమ్మ ఒడి రెండు వేల పెంపు, కాపు నేస్తం రూ. 60 వేల నుంచి రూ. లక్షా 20 వేలకు పెంపు, ఈబీసీ నేస్తం రూ. 45 వేల నుంచి రూ. లక్షా 5 వేలకు పెంపు. వైస్సార్ రైతు భరోసా రూ. 13,500 నుంచి రూ. 16 వేలకు పెంపు, మత్స్యకార భరోసా కింద ఐదు విడతల్లో రూ. 50 వేలు అందజేత, వైఎస్సార్ సున్నా వడ్డీ కింద రూ. 3 లక్షల లోన్, వాహన మిత్ర ఐదేళ్లలో రూ. 50వేల నుంచి రూ. 1 లక్షకు పెంపు, చేనేతలకు యేటా రూ. 24 వేల చొప్పున షదేళ్లలో రూ. 1 లక్షా 20 వేలకు పెంపు, లా నేస్తం కొనసాగింపు, వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా కొనసాగింపు హామీలను మ్యానిఫెస్టోలో పొందుపరిచారు.
ఇళ్ల స్థలాలు లేని అర్హులకు ఇళ్ల పట్టాల కొనసాగింపు, ట్యాబ్ పంపిణీ కొనసాగింపు, ప్రతి నియోజకవర్గంలో స్కిల్ హబ్, జిల్లాకో స్కిల్‌డెవలప్‌మెంట్ కాలేజీ, తిరుపతిలో స్కిల్ యూనివర్సిటీ, వచ్చే ఏడాది నుంచి ఒకటో తరగతి నుంచి ఐబీ సిలబస్, గిగ్ ఉద్యోగులకు వైఎస్సార్ బీమా, ఎస్సీ, ఎస్టీ కాలనీలకు ఉచిత విద్యుత్ అందిస్తామని మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చారు.
ఈ మ్యానిఫెస్టోపై వైసీపీ నాయకులు అద్భుతంగా ఉన్నదనే వ్యాఖ్యలు చేస్తుంటే టీడీపీ నాయకులు విమర్శలు చేస్తున్నారు. ఇది కొత్త జారులో పాత చింతకాయ పచ్చడిలా ఉన్నదని కామెంట్ చేస్తున్నారు. పాత మ్యానిఫెస్టోలనే సింహభాగం హామీలు కొత్త మ్యానిఫెస్టోలోనూ ఉన్నాయని, వైసీపీ కొత్త మ్యానిఫెస్టో కొత్తగా ఏమీ లేదని విమర్శిస్తున్నారు.