– విజయ సాధనకు హస్తం వ్యూహాలు
– హస్తానికి చెక్ పెట్టేందుకు కమలం పార్టీ కుస్తీ
– అరవింద్ ఓటమే లక్ష్యంగా గులాబీ పార్టీ ప్రణాళిక
– ప్రచార పర్వంలో కాంగ్రెస్, బీజేపీ
– గెలుపును నిర్ణయించేది రైతులే
Winning Nizamabad Indur ls Seat Possible Parties Team Work Strategies: తెలంగాణలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో పై చేయి సాధించేందుకు కాంగ్రెస్, బీజేపీలు పోటీపడుతుండగా, తన ఉనికిని నిలబెట్టుకునేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో విజయఢంకా మోగించిన కాంగ్రెస్ అదే ఊపును ఎంపీ ఎన్నికల్లోనూ చూపాలని తాపత్రయపడుతుండగా, కేంద్రంలోని మోదీ పేరుతో బాటు అభ్యర్థుల బలంతో మరిన్ని సీట్లు కొల్లగొట్టాలని కాషాయదళం ఆరాట పడుతోంది. ఫోన్ ట్యాపింగ్, కవిత అరెస్టు ఉదంతాలతో అతలాకుతలం అవుతోన్న బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో తన ఉనికిని బలంగా చాటుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఈ నేపథ్యంలో నిజామాబాద్ స్థానం మీద ఈ మూడు పార్టీలు తమదైన రీతిలో పట్టు సాధించేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల గణాంకాల ప్రకారం.. ఈ నిజామాబాద్ లోక్‌సభ స్థానంలో మొత్తం 16,72,823 ఓటర్లుండగా, వీరిలో 12,38,692 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
1952లో నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి నిజామాబాద్‌లో కాంగ్రెస్ పార్టీదే హవా. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ కొన్నాళ్లు వెలిగింది. కాంగ్రెస్ ఇక్కడి నుంచి 11 సార్లు, టీడీపీ మూడు సార్లు, బీజేపీ, బీఆర్ఎస్, స్వతంత్రులు ఒక్కోసారి విజయం సాధించారు. శ్రీరాంసాగర్, నిజాంసాగర్, పోచారం ప్రాజెక్ట్‌ల జలధారతో ఇక్కడి నేలను సస్యశ్యామలం చేస్తోంది. డీ శ్రీనివాస్, మధుయాష్కీ గౌడ్, కల్వకుంట్ల కవిత వంటి హేమాహేమీలు ఇక్కడి నుంచి రాజకీయాలు చేశారు. గత ఎన్నికల్లో కల్వకుంట్ల కవితపై సంచలన విజయం నమోదు చేసిన ధర్మపురి అర్వింద్.. అదే రిజల్ట్‌ను మరోసారి పునరావృతం చేయాలని భావిస్తున్నారు. దాదాపు పదేళ్ల తర్వాత తెలంగాణలో అధికారంలో రావడంతో కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్‌పై కన్నేసింది. ఇక్కడ హస్తం పార్టీ గెలిచి దాదాపు 15 ఏళ్లు కావొస్తోంది. తెలుగు, కన్నడ, మరాఠీ ప్రాంతాల సంస్కృతి కలగలిసిన ఈ సీటులో గెలిస్తే జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తుందనే సెంటిమెంట్ బలంగా వుంది. ఆంధ్రా సెటిలర్లు, చెరుకు, పసుపు రైతులు ఇక్కడి రాజకీయాలను శాసిస్తున్నారు.
Read Also: సికింద్రాబాద్ కంటోన్మెంట్ బరిలో నిలిచేదెవరో..?
నిజామాబాద్ లోక్‌సభా స్థానం పరిధిలో ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బాల్కొండ, కోరుట్ల, జగిత్యాల అసెంబ్లీ సెగ్మెంట్లున్నాయి. ఈ ఏడింటిలో కాంగ్రెస్, బీజేపీలు చెరో రెండు సీట్లు గెలుచుకోగా, గులాబీ పార్టీ 3 సీట్లు గెలిచింది. బాల్కొండ, కోరుట్ల, జగిత్యాల స్థానాల్లో బీఆర్ఎస్, ఆర్మూరు, నిజామాబాద్ అర్బన్‌లో బీజేపీ గెలవగా మిగిలిన రెండు సీట్లు కాంగ్రెస్ వశమయ్యాయి. నిజామాబాద్ ఎంపీ సీటు పరిధిలో గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కంటే కాంగ్రెస్‌కే ఎక్కువ ఓటు బ్యాంకు దక్కింది. ఇక్కడి 7 అసెంబ్లీ సీట్ల పరిధిలో బీజేపీకి 29.3 శాతం ఓట్లు దక్కగా కాంగ్రెస్‌కు 32.7 శాతం ఓటు షేర్ వచ్చింది.
దాదాపు పదేళ్ల తర్వాత తెలంగాణలో అధికారంలో రావడంతో ఎలాగైనా ఇక్కడ గెలిచి తీరాలనే కసితో కాంగ్రెస్ పనిచేస్తోంది. ఇక్కడ 2009లో చివరిసారిగా మధుయాష్కీ గౌడ్ కాంగ్రెస్ తరపున విజయం సాధించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండటం, అధికారంలోకి వచ్చిన స్వల్ప సమయంలో కాంగ్రెస్ అమల్లోకి తెచ్చిన సంక్షేమ పథకాలు అమలు చేయటం, రెండు స్థానాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉండటం, గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఎంపీ సీటు పరిధిలోని 7 సీట్లలో బీజేపీ కంటే కాంగ్రెస్‌కు ఓటు శాతం దక్కటం, ఆత్మరక్షణలో పడిన బీఆర్ఎస్‌కు గత అసెంబ్లీ ఎన్నికల్లో దక్కిన ఓట్లలో భారీ కోతపడే అవకాశం కనిపించటం.. ఇక్కడ కాంగ్రెస్‌కు సానుకూల అంశాలు. ఇక ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న జీవన్ రెడ్డికి అన్ని వర్గాలతోనూ మంచి సంబంధాలు ఉండటం కలిసొచ్చే మరో అంశంగా ఉంది. అయితే, ఈ సీటును ఆశించి భంగపడిన నేతలంతా ఒక్కమాటపై నిలబడి పార్టీ విజయం కోసం పనిచేయాల్సి ఉంది.
Read Also: ఒక వైపు పింఛన్ల పంచాయితీ జరుగుతుంటే.. ఉద్యోగాల గురించి వైసీపీ గొప్పలు
బీజేపీ మరోమారు తన సిట్టింగ్ ఎంపీ అయిన అరవింద్‌కే దీనిని కేటాయించింది. మాజీ పీసీసీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ కుమారుడైన అరవింద్ 2019లో నాటి సీఎం కేసీఆర్ తనయ కల్వకుంట్ల కవితను ఓడించి వార్తల్లో నిలిచారు. ఆ ఎన్నికల్లో పసుపు బోర్డు అంశం, జొన్నలకు మద్దతు ధర వంటి అంశాలే కీలక ప్రచారాంశాలుగా నిలిచాయి. పార్టీ పరంగా ధర్మపురి అరవింద్‌కు కొంత వ్యతిరేకత ఉండటం, మైనారిటీ ఓట్లు దక్కే అవకాశం లేకపోవటం, ఎంపీ టికెట్ ఆశించిన మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ, ఆర్మూర్ ప్రాంతానికి చెందిన పార్టీ సీనియర్ నాయకుడు అల్జాపూర్ శ్రీనివాస్ వర్గం అరవింద్‌కు సహకరించకపోవటం బీజేపీకి ప్రతికూల అంశాలు కాగా, పసుపు బోర్డు హామీ విషయంలో ముందడుగు పడటం, కేంద్రంలోని మోదీ పాలన, రామమందిర నిర్మాణం, అర్వింద్ గెలిస్తే కేంద్రంలో మంత్రి పదవి లభిస్తుందని ప్రచారం వంటివి ఆయనకు కలిసొచ్చే అంశాలు.
ఇక బీఆర్ఎస్ పార్టీ తన అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ను ప్రకటించింది. గత ఐదేళ్లుగా తమ కుటుంబానికి కొరకరాని కొయ్యగా మారిన అర్వింద్ ఓటమే లక్ష్యంగా అదే మున్నూరు సామాజిక వర్గానికి చెందిన గోవర్థన్‌ను కేసీఆర్ బరిలో నిలిపారు. ఈ ఎంపీ సీటు పరిధిలో ముగ్గురు సొంత పార్టీ ఎమ్మెల్యేలుండటం, కాపు సామాజిక వర్గంలో బాజిరెడ్డి గోవర్ధన్‌కు లీడర్‌గా గోవర్థన్‌కు ఉన్న మంచి పేరు ఈ పార్టీకి కలిసొచ్చే అంశాలు కాగా, ఫోన్ ట్యాపింగ్, కవిత అరెస్టు తర్వాత కేడర్ అంతా వలస పోవటం పార్టీకి మైనస్‌గా మారుతోంది.