Cabinet Meeting: కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి వచ్చాక రేవంత్ రెడ్డి క్యాబినెట్ సోమవారం సమావేశమైంది. ఖరీఫ్ సీజన్ మొదలు, పాఠశాలల ప్రారంభం, రాష్ట్ర అవతరణ దినోత్సవం సమీపించిన తరుణంలో నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఖరీఫ్ సీజన్ పంటకు సన్న వడ్లకు ఎమ్మెస్పీపై రూ. 500 బోనస్ ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించింది. రాష్ట్ర అవతరణ ఘనంగా నిర్వహించాలని, ఈ వేడుకలకు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని ఆహ్వానించాలని నిర్ణయం తీసుకుంది. మంత్రివర్గ సమావేశం ముగిసిన తర్వాత భేటీలో తీసుకున్న నిర్ణయాలను మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు.
మొలకెత్తినా కొంటాం:
వర్షం కురవడంతో పలు చోట్ల తడిసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని, రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా సాఫీగా కొనుగోళ్లు సాగించేలా జిల్లా కలెక్టర్లు బాధ్యతలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు ప్రతి రోజు ఏదో ఒకచోట కొనుగోలు కేంద్రాలను పర్యటించి పరిశీలించాలని, ఏ సమస్య ఉన్నా తక్షణమే పరిష్కరించాల్సిన బాధ్యతను కలెక్టర్లు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్టు మంత్రులు వివరించారు. తడిసిన ధాన్యం, మొలకెత్తిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని, అలాంటి చోట కలెక్టర్లు పౌర సరఫరాల విభాగం అధికారులకు నివేదించి కొనుగోళ్లు జరిగేలా చూడాలని తెలిపారు. ఇప్పటికే 35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, అందుకు సంబంధించి మూడు రోజుల్లోనే రైతుల ఖాతాలకు డబ్బులు పంపించామని వివరించారు.
ఖరీఫ్ కోసం ముందు జాగ్రత్తలు:
ఖరీఫ్ సీజన్‌లో సన్న రకాల వరి సాగు చేయడానికి రైతులను ప్రోత్సహించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. వచ్చే సీజన్ నుంచి ఎమ్మెస్పీపై రూ. 500 బోనస్ చెల్లించాలని నిర్ణయం తీసుకున్నట్టు మంత్రులు తెలిపారు. ఈ సారి సానుకూల వాతావరణం, సమృద్ధిగా వర్షాలు కురిసే అంచనాలు ఉండటంతో గతంలోని 1.44 ఎకరాల సాగును మించి ఈ సారి 1.50 లక్షల ఎకరాల్లో సాగు ఉంటుందని అంచనా వేశారు. ఖరీఫ్ పంటకు విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండేలా అధికారులకు సూచించినట్టు వివరించారు. నకిలీ విత్తనాలను అరికట్టడానికి చర్యలు, వాటి బారిన పడకుండా రైతులకు అవగాహన కల్పించే కార్యక్రమాలను ముమ్మరం చేయనున్నట్టు తెలిపారు. విత్తనాల అమ్మకంపై కచ్చితమైన పర్యవేక్షణ, ఏయే విత్తన కంపెనీలు ఏయే జిల్లాల్లో రైతులకు విత్తనాలు అమ్ముతున్నాయో స్పష్టమైన రికార్డులు మెయింటెయిన్ చేయాలని నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు.
ఘనంగా అవతరణ వేడుకలు:
తెలంగాణ ఏర్పడి పదేళ్లు గడుస్తున్న నేపథ్యంలో జూన్ 2న ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహించాలని, ఇందుకోసం ఈసీ అనుమతి కోరుతూ లేఖ రాయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఈ వేడుకలకు సోనియా గాంధీని ఆహ్వానించడానికి, తెలంగాణ ఉద్యమకారులను సన్మానించడానికి కూడా ఈసీ అనుమతి కోరుతూ లేఖ రాయాలని నిర్ణయించింది.
పాఠశాలలపై దృష్టి:
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలపై మంత్రివర్గ భేటీలో చర్చించారు. అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ఏర్పాటుతో స్వయం సహాయక సంఘాలను భాగస్వామ్యం చేసి మంచి మార్పు తీసుకురావాలని అంగీకరించింది. ఇప్పటికే అమ్మ ఆదర్శ పాఠశాలల పథకం ద్వారా స్కూల్స్ మెయింటెనెన్స్‌ను స్వయం సహాయ సంఘాలకు ప్రభుత్వం అప్పగించింది. జూన్ 10లోగా ఏవైనా పనులుంటే వాటిని పూర్తి చేయాలని నిర్ణయించింది. నోట్ బుక్స్, పాఠ్య పుస్తకాలు, యూనిపామ్స్ పూర్తి స్థాయిలో అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. స్కూల్స్ ఓపెన్ అయ్యాక సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు పాఠశాలు పర్యటించాలని నిర్ణయం తీసుకుంది.
కాళేశ్వరంపై నిర్ణయం:
కాళేశ్వరం ప్రాజెక్టుపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్ఏ) మధ్యంతర నివేదికపై క్యాబినెట్ చర్చించింది. ఈ సిఫారసులపై కార్యచరణ ప్రారంభించాలని అధికారులను ఆదేశించింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు తాత్కాలికంగా రిపేర్లు చేపట్టినా తదుపరి ముప్పును ఉండదని చెప్పలేమని ఎన్‌డీఎస్ఏ ప్రస్తావించిందని, మూడు బ్యారేజీల్లో నీళ్లు నిల్వ చేయకూడదని చేసిన సిఫారసును మంత్రివర్గం ప్రత్యేకంగా గుర్తించింది. అత్యవసరంగా చేపట్టాల్సిన జయోఫిజికల్, జియో టెక్నికల్ పరీక్షలు చేయించాలని, ఎన్‌డీఎస్ఏ సూచించిన కేంద్ర సంస్థలకు వీటిని అప్పగించి, నెల రోజుల్లో రిపోర్టులు అందేలా చూడాలని అధికారులను ఆదేశించింది. ఇంతలోపు చేయాల్సిన మరమ్మతులను సంబంధిత కాంట్రాక్టు కంపెనీలతో చేయించాలని, అవసరమైన తాత్కాలిక చర్యలనూ చేపట్టాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.