– శత్రువు చేతిలో చురకత్తిగా డీకే అరుణ
– కొడంగల్‌లో 50 వేల మెజారిటీ రావాలి
– కేసీఆర్, హరీష్, ప్రవీణ్ కుమార్, అరుణపై సెటైర్లు
– ఒక్క ఏడాది అండగా ఉండండి.. వందేళ్ల అభివృద్ధి చేస్తా
– దేవుడు గుడిలో.. భక్తి గుండెల్లో ఉండాలి
-చేసిందేమీ లేకనే మోదీ తీట పంచాయితీ
Will Carry Out Rs Two Lakh Farm Loan Waiver Before Aug 15 CM Revanth Reddy: పంద్రాగస్టులోపు రుణమాఫీ చేస్తామని చెబితే బీఆర్ఎస్ నేతలు వంకరమాటలు మాట్లాడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. పంద్రాగస్టులోపు తమ ప్రభుత్వం రుణమాఫీ చేస్తే కేసీఆర్ తన బీఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తారా? అని సీఎం సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి మాట ఇస్తే తప్పడనే విషయం కేసీఆర్‌కు బాగా తెలుసని అన్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం కొడంగల్, నాగర్ కర్నూల్ నిర్వహించిన సభల్లో రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. కొన్నిచోట్ల రుణాలు చెల్లించాలని బ్యాంకులు రైతులకు నోటీసులిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అలా రైతులను వేధించటం మానుకోవాలని, వారి రుణం చెల్లించే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుందని, ప్రతి పైసా రుణం ప్రభుత్వమే తీర్చుతుందని స్పష్టం చేశారు.
డీకే అరుణకూ రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. డీకే అరుణ.. కృష్ణా జలాలు, రైల్వే లైన్, మక్తల్ ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకున్నారని గుర్తుచేశారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎందుకు తీసుకురాలేదని ఆమెను నిలదీశారు. ఆమె శత్రువు చేతిలో చురకత్తిగా మారి పాలమూరు ప్రజల కడుపులో పొడుస్తోందని విమర్శించారు. ఆమెతో తనకే పంచాయితీ లేదని, అలాగే పాలమూరుకు చెందిన ఎవరి మీద కోపం, ద్వేషం లేదని స్పష్టం చేశారు. పాలమూరు ప్రజలంతా తన వాళ్లేనన్నారు.పాలమూరుకు చెందిన బూర్గుల రామకృష్ణారావుకు సీఎంగా అవకాశం రాగా, 70 ఏళ్ల తర్వాత తెలంగాణ ప్రజలు తనకు ఆ అవకాశం ఇచ్చారని తెలిపారు. మళ్లీ మరోమారు పాలమూరు బిడ్డకు అవకాశం ఇచ్చారన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, పాలమూరును అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. ఈ ఏడాదిలో వచ్చే అన్ని ఎన్నికల్లో కొడంగల్ ప్రజలంతా తనకు తోడుగా నిలిస్తే.. వందేళ్ల అభివృద్ధి చేసి చూపిస్తానని వాగ్దానం చేశారు. ‘ఇంట గెలిచి రచ్చ గెలవాలననే మాట ప్రకారం.. కొడంగల్‌లోని నా బంధువులు, బలగం మీరే కదా. కాబట్టి, ఇక్కడ లోక్‌సభ ఎన్నికల్లో కనీసం 50 వేల మెజార్టీతో వంశీచంద్ రెడ్డిని గెలిపించాలి. లేదంటే సీఎం ఇలాకాలోనూ బలం లేదని ప్రత్యర్థులు మనల్ని ఎగతాళి చేస్తారని గుర్తుచేశారు.
Also Read:బీరు..జోరు..హుషారు
కేసీఆర్ పదేళ్లు ప్రజలను మోసం చేశారని, తాగుబోతు సంసారం లెక్కనే రాష్ట్రాన్ని ఆగం చేశాడని సీరియస్ అయ్యారు. రాష్ట్రాన్ని అప్పులకుప్ప చేశారని, తాను రూ. 3,900 కోట్ల లోటు బడ్జెట్‌తో ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నానని వెల్లడించారు. వంద రోజుల్లో ఐదు గ్యారంటీలను అమలు చేశామని, రుణమాఫీ చేద్దామనుకుంటూ ఉండగానే ఎన్నికల కోడ్ వచ్చిందని తెలిపారు. పంద్రాగస్టులోపు రుణమాఫీ చేయకపోతే సీఎం పదవికి రాజీనామా చేస్తావా అన్న హరీష్ రావు సవాలుకు స్పందిస్తూ, తాను పంద్రాగస్టులోపు రుణమాఫీ చేస్తే బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ రద్దు చేస్తాడా? అని సవాలు విసిరారు. భూమి, ఆకాశం తలకిందులైనా రుణమాఫీ ఆగదని స్పష్టం చేశారు.
కేంద్రంలో పదేళ్లు అధికారంలో ఉన్న మోడీ కూడా ఏమీ చేయలేదని, అందుకే ప్రజలను రెచ్చగొట్టి ఓట్లు దండుకోవాలని చూస్తున్నాడని ఆరోపించారు. మతం పేరుతో తీట పంచాయితి పెట్టి ఎన్నికల్లో గెలవాలని అనుకుంటున్నారని, కానీ, పాలమూరు ప్రజలంతా ఆ తప్పుడు వ్యూహాన్ని తిప్పికొట్టాలని ‘మేమూ హిందువులమే. తాత ముత్తాతల నుంచి పూజలు చేసినోళ్లమే. కానీ, దేవుడంటే గుడిలో ఉండాలి. భక్తి గుండెల్లో ఉండాలి. హిందూయిజంలోనే మతసామరస్యం ఉన్నది. పరమతాలను గౌరవించాలని ఉన్నది. ఊళ్లలో పీర్ల పండుగకు మనమే ముందుంటాం కదా. మన ఇంట్లో దసరా పండుగకు ముస్లింలు రారా? క్రిస్మస్‌కు మనం చర్చి పోయిరావట్లేదా? ఎన్నికల కోసం బీజేపీ నాయకులు పంచాయితీ పెడుతుర్రూ’ అని రేవంత్ రెడ్డి తెలిపారు. అందరూ కలిసి కట్టుగా ముందుకు సాగాలని, ఇక్కడి నుంచి కనీసం 50 వేల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్‌ను గెలిపించాలని కోరారు.
అనంతరం నాగర్ కర్నూలులో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలోకాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవికి మద్దతుగా ఆయన ప్రచారం చేశారు. ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్‌తో తనకు ఎలాంటి విభేదాలు లేవని ,ఐపీఎస్‌గా రాజీనామా చేసి దొరల గడీలు కూలుస్తానన్న ప్రవీణ్ కుమార్ దొరల పార్టీలో ఎందుకు చేరారో చెప్పాలని నిలదీశారు. ప్రజలు సమాధి చేసిన పార్టీకి ఆయన ప్రాణం ఎందుకు పోయాలనుకుంటున్నారని, టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌గా ఉండమంటే ప్రవీణ్ కుమార్ తిరస్కరించి దొర గడీల వద్ద కాపలాగా ఉండాలనుకున్నారని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మోదీ, కేసీఆర్ ఎస్సీ వర్గీకరణ విషయంలో మోసం చేశారన్నారు.రెండు టీఎంసీలతో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, తుమ్మిళ్ల ప్రాజెక్టు, కల్వకుర్తి, నెట్టెంపాడు, సంగం బండ, భీమా, మక్తల్-నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకాలను పూర్తి చేసి పాలమూరు రుణం తీర్చుకుంటానని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అటు సూర్యుడు ఇటు వచ్చినా.. ఇటు సూర్యుడు అటు పోయినా తెలంగాణలో ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తామని మామా అల్లుళ్లు బీఆర్ఎస్ పార్టీని రద్దు చేసుకోవాలని సవాల్ విసిరారు. రాబోయే వరి పంటకు రూ. 500 బోనస్ ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నాగర్ కర్నూల్ బరిలో నిలిచిన కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవిని భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.