Elephant Attack: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఓ గజరాజు హల్‌చల్ చేస్తున్నది. మంద నుంచి విడిపోయి వెర్రెత్తిపోయింది. ఆగ్రహంతో ఊగిపోతున్నది. ఎవరు కనబడితే వారిపై దాడికి దిగుతున్నది. 24 గంటల వ్యవధిలోనే ఆ ఏనుగు ఇద్దరి ప్రాణాలు తీసింది. గురువారం పెంచికలపేట మండలంలో పోషన్న అనే రైతును, ఏప్రిల్ 3వ తేదీన చింతలమానేపల్లి మండలంలో అల్లూరి శంకర్ అనే మరో రైతును ఏనుగు తొక్కి చంపేసింది.
పెంచికలపేట కొండపల్లి గ్రామానికి చెందిన పోషన్న పొలానికి నీరు పెట్టడానికి వెళ్లాడు. అదే పొలం వద్దకు ఏనుగు వచ్చింది. ఉన్నట్టుండి ఆయనపై దాడికి దిగింది. కాళ్లతో తొక్కి చంపింది. ఏనుగు దాడిలో పోషన్న స్పాట్‌లోనే మరణించాడు. ఘటనాస్థలికి వెళ్లిన గ్రామస్తులు భయాందోళనలకు లోనయ్యారు. పోషన్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.
Also Read: పాపం మూగజీవాలు.. దాహంతో ట్యాంకులోకి దిగి 30 కోతుల మృత్యువాత
కాగా, చింతలమానేపల్లి బూరెపల్లి గ్రామపరిధిలో బుధవారం ఏనుగు దాడిలో అల్లూరి శంకర్ మరణించాడు. శంకర్ తన భార్యతో కలిసి తోటలో మిరపకాయలు ఏరుతున్నారు. జనావాసాల్లోకి వస్తుందేమోనని ఏనుగును కొందరు తరిమారు. ఆ ఏనుగు శంకర్ ఉన్నవైపుగా వచ్చింది. తన భార్య ఆ విషయాన్ని అరుస్తూ తన భర్తకు చెప్పింది. ఆయన వెంటనే చెట్ల పొదల మధ్య దాక్కున్నాడు. కానీ, ఏనుగు తొండంతో పలుమార్లు దాడి చేయడంతో శంకర్ స్పాట్‌లోనే మరణించినట్టు భార్య సుగుణ తెలిపింది.