– మేడిగడ్డ కుంగిన తర్వాతి చర్యలపై ఎన్‌డీఎస్ఏ ఫోకస్
– లోపాలు చూసుకోకుండా క్వాలిటీ సర్టిఫికెట్ ఎలా ఇచ్చారు?
– డిజైన్‌ను కచ్చితంగా ఫాలో అయ్యారా?
– భవిష్యత్ చర్యల కోసం సమాచారం కోరిన కేంద్ర కమిటీ
– ముగిసిన ఎన్‌డీఎస్ఏ బృందం పర్యటన
– నెక్ట్స్ ఏం జరగనుంది..?
– ‘స్వేచ్ఛ’ ప్రత్యేక కథనం
Why, What, How..Kaleshwaram Project: ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు తర్వాత డ్యామ్ భద్రత, భవిష్యత ప్రణాళిక వంటి పలు అంశాల విచారణ కోసం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్ఏ) చేపట్టిన పర్యటన ముగిసింది. గత మూడు రోజులుగా హైదరాబాద్ జలసౌధలో చేపట్టిన ఈ విచారణలో చివరిరోజున కేంద్ర నిపుణుల కమిటీ స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ (ఎస్‌డీఎస్‌వో) అధికారులతో సహా పలు విభాగాల అధికారులతో సమావేశమైంది. మేడిగడ్డ కుంగిన తర్వాత అక్కడ తీసుకున్న నష్ట నివారణ చర్యలతో బాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీ భద్రతకు తాము ఏం చేసిందీ స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ (ఎస్‌డీఎస్‌వో) అధికారులు కేంద్ర బృందానికి వివరించారు. వీటితో బాటు తాము తీసుకోబోతున్న 10 అంశాల గురించి ఒక నివేదికను రాష్ట్రానికి చెందిన ఎస్డీఎస్‌వో అధికారులు కేంద్ర బృందానికి అందించారు.
జలసౌధలో బుధవారం కేంద్ర, రాష్ట్ర అధికారుల మధ్య జరిగిన మూడు రోజుల భేటీలో సీపేజీల తర్వాత డ్యామ్‌సేఫ్టీ చట్టం ప్రకారం రాష్ట్రప్రభుత్వ అధికారులు తీసుకున్న చర్యలు, మేడిగడ్డ కుంగిన వెంటనే ఏదైనా కమిటీ వేసి, విచారణ జరిపి, వైఫల్యానికి కారణాలను తెలుసుకోగలిగారా? అని ఎన్‌డీఎస్ఏ అధికారులు ఆరా తీశారు. గడచిన వానాకాలానికి ముందు, ఆ తర్వాత బ్యారేజీల వాస్తవిక స్థితిమీద రాష్ట్ర ప్రభుత్వం నివేదిక తెప్పించుకుందా? నాడు బ్యారేజీ పరిస్థితి ఎలా ఉందని కేంద్ర కమిటీ అధికారులు ఆపరేషన్ అండ్ మెయింటెన్స్ (ఓఅండ్‌ఎం) విభాగపు అధికారులను అడిగి తెలుసుకున్నారు. అయితే 2024 దాకా బ్యారేజీల నిర్వహణ అంతా నిర్మాణ సంస్థల చేతుల్లోనే ఉండటంతో, ఆ బ్యారేజీల వార్షిక మరమ్మతులపై తమకు ఎలాంటి నివేదికలూ అందలేదని, బ్యారేజీల లోపాల గురించి కూడా తమకు క్షేత్రస్థాయి అధికారులు ఏ సమాచారం ఇవ్వలేదని ఆపరేషన్ అండ్ మెయింటెన్స్ విభాగపు అధికారులు బదులిచ్చారు.
అలా ఎలా సర్టిఫై చేశారు?
నిర్మాణం ఏ విధంగా జరిగింది? ముందుగా నిర్ణయించిన డిజైన్ ప్రకారమే బ్యారేజీ నిర్మాణం జరిగిందా? మధ్యలో ఏమైనా మార్పులు చేశారా? అంటూ బ్యారేజీలు నిర్మాణంలో ఉండగా, అక్కడ క్షేత్రస్థాయి విధులు నిర్వహించిన అధికారులనూ ఎన్‌డీఎస్ఏ విచారించింది. దీనికి వారు డిజైన్ ప్రకారమే నిర్మాణం జరిగిందని బదులిచ్చారు. అనంతరం ‘పనులన్నీ అనుకున్న ప్రమాణాల ప్రకారమే జరిగాయని నిర్ధారిస్తూ, నిర్మాణ సంస్థకు సర్టిఫికెట్ ఇచ్చే ముందు మీరు బ్యారేజీని పరిశీలించారా? ఆ సమయంలో మీకు ఎలాంటి లోపాలనూ మీ దృష్టికి రాలేదా? తొలి సీజన్‌లోనే వరదల అనంతరం మూడు బ్యారేజీల్లో సీసీ బ్లాకులతో పాటు అఫ్రాన్లు దెబ్బతిన్నా గుర్తించలేదా? అంటూ కేంద్ర కమిటీ క్వాలిటీ కంట్రోల్ విభాగం అధికారులను నిలదీయగా, ఐఎస్ కోడ్ ప్రకారమే నిర్మాణ పనులు జరిగినట్లు గుర్తించి, సర్టిఫికెట్లు ఇచ్చామని క్వాలిటీ కంట్రోల్ అధికారులు బదులిచ్చారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై గతంలో జరిగిన విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (వీఅండ్‌ఈ) విచారణ సందర్భంగా రూపొందించిన నివేదిక ఇవ్వాలని కోరగా, విజిలెన్స్ డైరెక్టర్ జనరల్ రాజీవ్ రతన్ కేంద్ర కమిటీ ప్రతినిధులకు ఆ నివేదికను అందించి, ఆనాటి విచారణ క్రమంలో తాము గుర్తించిన లోటుపాట్లను వివరించారు.
ఇప్పుడే చెప్పలేం..
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై ఇంకా లోతుగా రీసెర్చి చేయాల్సిన అవసరముందని, మరిన్ని కీలక పత్రాల పరిశీలన తర్వాతే బ్యారేజీల్లో తలెత్తిన లోపాల మీద ఒక అంచనాకు రావటం సాధ్యమవుతుందని ఎన్‌డీఎస్ఏ కమిటీ చైర్మన్ జె.చంద్రశేఖర్‌అయ్యర్ అభిప్రాయపడ్డారు. తమ కమిటీ రాష్ట్ర అధికారుల నుంచి మరింత సమాచారాన్ని కోరిందని, అదంతా అందిన తర్వాతే లోపాలపై మరింత క్లారిటీ వస్తుందని భేటీ ముగిసిన తర్వాత మీడియాకు వెల్లడించింది. జలసౌధలో భేటీ తర్వాత కేంద్ర కమిటీ రాజేంద్రనగర్‌లోని తెలంగాణ ఇంజనీరింగ్ రిసెర్చ్ ల్యాబోరేటరీని సంద ర్శించి, కాళేశ్వరం బ్యారేజీల మోడల్స్‌ను పరిశీలించి… నీటి ప్రవాహ వేగంతో పాటు బ్యారేజీల నమూనాలను పరిశీలించింది.
ఏం చేయమంటారు?
వచ్చే వర్షాకాలంలోపు ఉన్న సమయంలో దెబ్బతిన్న బ్యారేజీల పరిరక్షణ, రిపేర్ల కోసం తాము తక్షణం చేపట్టాల్సిన చర్యలేమిటో చెబితా వాటిని అమలు చేస్తామని తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఆ శాఖ ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ(జనరల్) జి.అనిల్‌కుమార్ కోరగా, మంగళవారం లోగా తాము కోరిన సమాచారాన్ని అందిస్తే.. దానిని బట్టి తక్షణ చర్యలను సూచించగలమని కేంద్ర కమిటీ బదులిచ్చింది. ఈ సందర్భంగా తాము తీసుకోవాలనుకుంటున్న చర్యల గురించి, 10 అంశాలతో నివేదికను కేంద్ర కమిటీకి ఈఎన్‌సీ (జనరల్) అనిల్‌కుమార్ అందించారు.
తక్షణ చర్యలు ఇవే..
నిర్మాణ సంస్థలు ఐఎస్ కోడ్ ప్రకారం మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ పనులను చేపట్టడానికి అనుమతి
అన్ని బ్యారేజీల్లోని రంధ్రాలను గుర్తించి, రాఫ్ట్ కింద ఉన్న ఆ రంధ్రాల్లోకి ప్రెజర్‌తో ఇసుక లేదా సిమెంట్‌ను పంపి వాటిని మూసేయటం (ప్రెజర్ గ్రౌంటింగ్)
బ్యారేజీల గేట్ల నిర్వహణకు ఆధునిక స్కాడా విధానాన్ని అమలు చేసి, బ్యారేజీలపై ఒత్తిడి లేకుండా చూడటం
బ్యారేజీల ఎగువన, దిగువన వాటర్ ఫ్రూఫ్ కోసం సిమెంట్ గ్రౌటింగ్.
3డీ మోడల్ స్టడీస్ ఆధారంగా బ్యారేజీల ఎగువన, దిగువన ఉండే రాళ్లను తొలగించటం
బ్యారేజీల మీద వరద సమయంలో ఎక్కువ ఒత్తిడి పడకుండా, బ్యారేజీకి ఎగువన నదిపై రెగ్యులేటరీల నిర్మాణం
బ్యారేజీకి ఎగువన, దిగువన పోగుపడిన ఇసుక మేటలను ఇరిగేషన్ శాఖ పర్యవేక్షణలో తొలగించటం
మేడిగడ్డలో బ్లాకు-7లో జామ్ అయిన గేట్లను తొలగించటం
మేడిగడ్డ బ్యారేజీలో కుంగిన బ్లాకు-7లో అదనంగా స్టీల్ షీట్ పైల్స్ ఏర్పాటు