– గెలుపు తనదేనంటున్న హస్తం పార్టీ
– సీటు నిలుపుకుంటామంటున్న కమలనాథులు
– పట్టుకోసం కారు పార్టీ తంటాలు
– వరుసగా రెండుసార్లు ఏ పార్టీనీ ఆదరించని ఓటర్లు
– పార్టీల కంటే అభ్యర్థులే కీలకం
– కరీంనగర్ సీటులో ఆసక్తికర పోరు
హైదరాబాద్, స్వేచ్ఛ: తెలంగాణలోని పెండింగ్‌లో పెట్టిన 3 లోక్‌సభ స్థానాలకు కాంగ్రెస్ అధిష్ఠానం తాజాగా తన అభ్యర్థులను ప్రకటించింది. ఈ క్రమంలో కరీంనగర్ నుంచి వెలిచాల రాజేందర్ రావును ఆ పార్టీ బరిలో దించింది. దీంతో ఇప్పుడు అందరి దృష్టీ ఈ సీటు మీదనే నిలిచింది. ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ బరిలో ఉండగా, బీఆర్ఎస్ తరపున బోయినపల్లి వినోద్ కుమార్ పోటీలో ఉన్నారు. రెండు దశాబ్దాలుగా బీఆర్ఎస్ పట్టులో ఉన్న ఈ స్థానాన్ని ఎట్టి పరిస్థితిలోనూ కైవశం చేసుకునేందుకు కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. దీనికోసం మంత్రి పొన్నం ప్రభాకర్‌ను అక్కడ ఇన్‌చార్జ్‌గా నియమించారు.
ఇదీ చరిత్ర
చరిత్రలో ‘ఎలగందుల’ పేరుతో గొప్ప చరిత్రను సొంతం చేసుకున్న పట్టణమే కాలక్రమంలో కరీంనగర్‌గా మారింది. గొప్ప చారిత్రక, సాంస్కృతిక చరిత్ర దీనిసొంతం. కరీంనగర్ పార్లమెంట్ స్థానానికి ఇప్పటివరకు 19 పర్యాయాలు ఎన్నికలు జరగగా, వాటిలో పదిసార్లు ఈ సీటు కాంగ్రెస్ గెలుచుకుంది. మూడుసార్లు బీజేపీ, ఒకసారి టీడీపీ అభ్యర్థులు ఇక్కడ గెలుపొందారు. 1971లో తెలంగాణ సాధన పేరుతో ఏర్పడిన తెలంగాణ ప్రజాసమితి పార్టీ తరపున కాంగ్రెస్ దిగ్గజ నేత ఎం సత్యనారాయణరావు ఇక్కడ గెలిచారు. 2004 ఎన్నికలు, 2006, 2008 ఉపఎన్నికల్లో ఇక్కడ కేసీఆర్ గెలిచారు. గత మూడు ఎన్నికల్లో ఇక్కడ ఒక్కో పార్టీ గెలుస్తూ వచ్చాయి. 2009లో కాంగ్రెస్ తరపున పొన్నం ప్రభాకర్, 2014లో బీఆర్ఎస్ తరపున బి. వినోద్ కుమార్, 2019లో బీజేపీ తరపున బండి సంజయ్ ఇక్కడ గెలుపొందారు. ఇప్పటివరకు ఇక్కడ గెలుపొందిన వారిలో 15 మంది వెలమ సామాజిక వర్గానికి చెందిన వారు కాగా, మూడుసార్లు బీసీ, ఒకసారి రెడ్డి, రెండుసార్లు ఎస్సీ అభ్యర్థులు విజయకేతనం ఎగురవేశారు. ఇక్కడినుంచి గెలిచిన వారిలో బోయిన్‌పల్లి వినోద్ కుమార్, కేసీఆర్, జువ్వాడి చొక్కారావు, ఎం సత్యనారాయణరావు, జే. రమాపతిరావు, చెన్నమనేని విద్యాసాగర్ రావు వంటి దిగ్గజ నేతలుండగా, వీరిలో విద్యాసాగర్ రావు ఇక్కడ 3 సార్లు గెలిచి కేంద్రమంత్రిగా, ఆపై గవర్నరుగానూ సేవలందించారు.
గణాంకాలు
కరీంనగర్ లోక్‌సభ స్థానంలోని 7 అసెంబ్లీ సీట్లలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో వేములవాడ, హుస్నాబాద్, మానకొండూరు, చొప్పదండి స్థానాలు కాంగ్రెస్ ఖాతాలో పడగా, కరీంనగర్, హుజూరాబాద్, సిరిసిల్ల స్థానాలు బీఆర్ఎస్‌కు దక్కాయి. ఈ స్థానంలో మొత్తం 17 లక్షల ఓటర్లున్నారు. వీరిలో 19 % ఎస్సీ ఓటర్లు, 2.5 % ఎస్టీ ఓటర్లుండగా, 6.8 % మైనారిటీ ఓటర్లున్నారు. నియోజక వర్గంలో 22 % పట్టణ ఓటర్లుండగా, 78 % మంది రూరల్ ఓటర్లు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఎంపీ సీటు పరిధిలోని 7 సీట్లలో కాంగ్రెస్‌కు 37.2 %, ఓట్లు, 4 ఎమ్మెల్యే సీట్లు దక్కాయి. బీఆర్ఎస్ 37.6 % ఓట్లు, 3 సీట్లు గెలుచుకుంది. బీజేపీ కేవలం 18.2 % ఓట్లు పొందినా, ఒక్క ఎమ్మెల్యే సీటూ దక్కించుకోలేకపోయింది. ఈ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి పోటీచేసిన బండి సంజయ్ పరాజయం పాలయ్యారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఈ ఎంపీ స్థానంలో బీజేపీకి 43.7 % ఓట్లు రాగా బండి సంజయ్ ఎంపీగా గెలుపొందారు. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు 35.9 % ఓట్లొచ్చాయి.
Also Read: రాజీనామా.. హైడ్రామా..!రాజీనామా.. హైడ్రామా..!
ఇదే కాంగ్రెస్ బలం
సీనియర్ కాంగ్రెస్ నేత, కరీంనగర్ మాజీ ఎమ్మెల్యే వెలిచాల జగపతిరావు కుమారుడైన రాజేందర్ రావు ఇక్కడ హస్తం పార్టీ అభ్యర్థిగా ఉన్నారు. ఈ ఎంపీ సీటు పరిధిలో కాంగ్రెస్ పార్టీకి నలుగురు ఎమ్మెల్యేలుండటం, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండటం, ఇప్పటికే ఐదు హామీలు అమలు చేసిన కాంగ్రెస్ పట్ల ప్రజల్లో ఉన్న సానుకూలత కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ కలిసొచ్చే అంశాలు. కాంగ్రెస్ హయాంలో ఇక్కడ జరిగిన అభివృద్ధి, రేవంత్ రెడ్డి చరిష్మా, ఎంపీగా బండి సంజయ్ ఇక్కడ ఏ అభివృద్ధీ చేయలేకపోయాడనే అంశాలు కూడా హస్తం పార్టీ విజయానికి దోహదపడనున్నాయి. మంత్రి పొన్నం ప్రభాకర్‌ను అక్కడ ఇన్‌చార్జ్‌గా నియమించటంతో ఆయన తనకున్న పరిచయాలను పార్టీ విజయానికి వినియోగిస్తూ గట్టిగా శ్రమిస్తున్నారు.
అభ్యర్థే కమలానికి బలం
ఈ సీటులో బీజేపీకి సైద్ధాంతిక బలం కంటే అభ్యర్థి బలమే ఎక్కువని చెప్పుకోవాలి. ఫైర్ బ్రాండ్‌గా, బీజేపీ తెలంగాణ రాష్ట్ర మాజీ అధ్యక్షుడిగా పేరున్న బండి సంజయ్ ఇక్కడ బరిలో ఉన్నారు. ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ, బీజేవైఎంలో పనిచేసిన సంజయ్, అద్వానీ రథయాత్రలోనూ పాల్గొన్నారు. 2005-2019 మధ్యకాలంలో కరీంనగర్ కార్పొరేటర్‌గా పనిచేసిన సంజయ్ 2014, 2018 ఎన్నికల్లో ఓడినా 2019 లోక్‌సభ ఎన్నికల్లో గెలిచారు. కానీ, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్‌లో ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయారు. ప్రజాహిత యాత్ర పేరుతో ఇప్పటికే బండి సంజయ్ 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో సుడిగాలి పర్యటన పూర్తిచేశారు. సిట్టింగ్ ఎంపీగా తన విజయాలు, చేసిన అభివృద్ధి, రామమందిరం, ఆర్టికల్ 370, మోదీ చరిష్మాలను ప్రచారాస్త్రాలుగా మలచుకుంటున్నారు. తన సొంత సామాజిక వర్గమైన మున్నూరు కాపు ఓట్లతో బాటు ఇతర బీసీ వర్గాల ఓట్లమీద ఆశ పెట్టుకున్నారు.
Also Read: నల్లధనం..బీజేపీని నడిపించే ఇంధనం
పట్టుకోసం కారు తంటాలు
2004, 2006, 2008లో ఇక్కడ గెలిచిన కేసీఆర్ ఈ సీటును గులాబీ పార్టీకి పెట్టనికోటగా మలిచినా 2019 ఎన్నికలు, గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇక్కడ సమీకరణాలు బీఆర్ఎస్‌కు ప్రతికూలంగా మారాయి. ఇక్కడ కేసీఆర్ సమీప బంధువు వినోద్ కుమార్ బరిలో ఉన్నారు. కరీంనగర్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ స్వయంగా పాల్గొని వినోద్‌ను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గతంలో ఎంపీగా, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా తాను చేసిన అభివృద్ధి, పార్లమెంటులో తాను లేవనెత్తిన అంశాలను ఆయన ప్రచారంలో ప్రస్తావిస్తున్నారు. నిబంధనల ప్రకారం కరీంనగర్ పట్టణానికి అర్హత లేకున్నా.. నాటి కేంద్రమంత్రి వెంకయ్య నాయుడిని ఒప్పించి కరీంనగర్ పట్టణాన్ని స్మార్ట్ సిటీ జాబితాలో చేర్చేందుకు తాను కృషి చేశానని, సిరిసిల్ల నేతన్నలకు అండగా నిలిచానని ఆయన గుర్తుచేస్తున్నారు. కానీ, కవిత అరెస్టు, ఫోన్ ట్యాపింగ్ ఆయన విజయానికి ప్రతికూలంగా మారాయి. ఏదిఏమైనా కరీంనగర్ ఓటర్లు ఈసారి ఎవరిని ఆదరిస్తారో తెలియాలంటే జూన్ 4 వరకు ఆగాల్సిందే.