– గెలిచి తీరాలనే పట్టులో హస్తం
– మోదీ మేనియాపై కమలం ఆశలు
– సిట్టింగ్ సీటుపై పట్టుబిగిస్తున్న కారు
– సామాజిక సమీకరణాలే టార్గెట్‌గా వ్యూహాలు
Medak lok sabha constituency updates(Political news in telangana): లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న వేళ తెలంగాణలోని మెదక్ స్థానం ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. నాలుగు దశాబ్దాల నాడు నాటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ పోటీ చేసిన ఈ నియోజకవర్గం అప్పట్లో దేశవ్యాప్తంగా చర్చలో నిలిచింది. సీనియర్ కాంగ్రెస్ నేత బాగారెడ్డి నాలుగుసార్లు ఇక్కడి నుంచే కాంగ్రెస్ ఎంపీగా గెలుపొందారు. అయితే, 2004 ఎన్నికల వరకు కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గం కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటైనప్పటి నుంచి గులాబీ గూటికి చేరింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు వ్యూహాలు రచిస్తుండగా, తమ పట్టును నిలుపుకునేందుకు బీఆర్ఎస్, మోదీ హవాలో నెగ్గాలని బీజేపీ ప్రణాళికలు రచిస్తున్నాయి. ఈసారి జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తరపున నీలం మధు ముదిరాజ్, బిఆర్‌ఎస్ అభ్యర్థిగా పరుపతి వెంకట్రామరెడ్డి, కమలం పార్టీ నుంచి మాధవనేని రఘునందన్‌రావు బరిలో నిలిచారు.
మెదక్ పార్లమెంటు పరిధిలో సంగారెడ్డి, పటాన్‌చెరు, మెదక్, నర్సాపూర్, గజ్వేల్, దుబ్బాక, సిద్ధిపేట అసెంబ్లీ నియోజకవర్గాలుండగా సుమారు 18 లక్షల మంది ఓటర్లున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో వీటిలో ఒక్క మెదక్ తప్ప అన్ని స్థానాల్లోనూ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులే గెలుపొందారు. 2019 నాటి లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడ బీఆర్‌ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి గాలి అనిల్‌కుమార్‌పై 3 లక్షల పైచిలుకు ఓట్ల మెజారిటీతో నెగ్గారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్లమెంటు సీటు పరిధిలో బీఆర్ఎస్‌కు 6.68 లక్షలు, కాంగ్రెస్‌కు 4.2 లక్షలు, బీజేపీకి 2.1 లక్షల ఓట్లొచ్చాయి.ఇక అభ్యర్థుల బలాబలాల విషయానికి వస్తే, అధికార పార్టీగా కాంగ్రెస్ మెదక్ పార్లమెంటు సీటును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అభ్యర్థి ఎంపిక మొదలుకుని అన్నీ ఒక ప్లాన్ ప్రకారం ముందుకు సాగుతోంది. బీజేపీ, గులాబీ పార్టీలు రెండు అగ్రవర్ణాల అభ్యర్థులను బరిలో దించగా, కాంగ్రెస్ బీసీ వర్గానికి చెందిన నీలం మధు ముదిరాజ్‌ను బరిలో దించింది. ఈ ఎంపిక ద్వారా తెలంగాణలోని బీసీ వర్గాల్లో ప్రాబల్యమున్న ముదిరాజ్ వర్గానికి తాను ప్రాధాన్యత ఇస్తున్నానని చెప్పకనే చెప్పింది. మాజీ ప్రధాని ఇందిరమ్మ సీటును గెలిచి, సోనియమ్మకు బహుమతిగా ఇస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన, కాంగ్రెస్ హయాంలోనే మెదక్‌కు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, బీహెచ్‌ఈఎల్, బిడిఎల్ వంటి ప్రభుత్వ రంగ సంస్థలు వచ్చాయని, తద్వారా అనేక మందికి ఉపాధి దొరికిందనే పాయింట్‌తో బాటు పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ ఒక్క కొత్త పరిశ్రమనూ తీసుకు రాలేకపోయిందనే వాదనను జనం ముందుంచుతోంది కాంగ్రెస్. రాష్ట్రంలో తామే అధికారంలో ఉన్నందున ఇక్కడ కాంగ్రెస్ గెలిస్తే అభివృద్ధి మరింత సులభమవుతుందని ఆ పార్టీ ప్రచారం చేస్తోంది. దీనికి తోడు అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రకటించిన 6 ప్రధాన హామీలను గుర్తుచేస్తోంది. మరోవైపు నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి మొదలు పలువురు నేతలు కాంగ్రెస్‌లో చేరటం, మెదక్‌లో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, పరిసర సెగ్మెంట్లలో ఆయన తండ్రి హన్మంతరావు, సంగారెడ్డిలో జగ్గారెడ్డి మొదలు అన్ని నియోజక వర్గాల్లో కాంగ్రెస్ నేతలు సమన్వయంతో పనిచేయటంతో గెలుపుపై గట్టి ధీమాను ప్రదర్శిస్తోంది.
Also Read: పైకి షేర్వాణి..లోన పరేషానీ
గతంలో దుబ్బాక ఎమ్మెల్యేగా గెలిచి జనంలో గుర్తింపు తెచ్చుకున్న రఘునందన్ రావు, గత అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాకలో ఓడినా, పార్టీ ఇక్కడ ఎంపీగా అవకాశమిచ్చింది. మెదక్ ప్రాంత ప్రజల ఆకాంక్షలను హస్తిన వరకు చేర్చేందుకు తనకు ఓటేయాలని, ప్రధాని మోదీ ముచ్చటగా మూడోసారి ప్రధాని కాబోతున్న వేళ తనకు అవకాశమిస్తే, అనేక కేంద్ర పథకాలు తీసుకొస్తాననీ, స్థానికంగా ప్రశ్నించే గొంతుకగా నిలుస్తానని ఆయన ఓటర్లను కోరుతున్నారు. ఉద్యమపార్టీగా మొదలై పదేళ్లు అధికారంలో ఉన్న గులాబీ పార్టీకి పోటీకి ఒక్క ఉద్యమకారుడూ దొరకలేదా అంటూ సెటైర్లు వేస్తున్నారు రఘునందన్. ఆ పార్టీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి సిద్ధిపేట జిల్లా కల్టెర్‌గా ఉండగా, ఇక్కడి ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం రైతుల మీద చేయించిన లాఠీ చార్జిని, ఆయన స్థానికేతరుడనే అంశాన్ని జనంలోకి తీసుకుపోతున్నారు. యువత, మోదీ ఛరీష్మా, అయోధ్య, ఆర్టికల్ 370 వంటి అంశాలతో బాటు స్థానిక అంశాలనూ ఆయన ప్రచారం చేస్తున్నారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పొందిన బీఆర్ఎస్ పార్టీ తన కంచుకోటను నిలబెట్టుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. నిజానికి ఇక్కడ అనేక మంది అభ్యర్థులకు ఆ పార్టీ బీఫామ్ ఇవ్వజూపినా, కవిత అరెస్ట్, ఫోన్ ట్యాపింగ్ కారణంగా ఏర్పడిన నిరాశాజనక వాతావరణంలో వారెవరూ ముందుకు రాలేదు. దీంతో తన పార్టీ ఎమ్మెల్సీ, సిద్ధిపేట జిల్లా మాజీ కలెక్టర్, వెంకట్రామరెడ్డి (పివిఆర్)ను అభ్యర్థిగా ప్రకటించింది. కేసీఆర్, హరీష్ రావు ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్, సిద్దిపేట సెగ్మెంట్లు ఈ ఎంపీ పరిధిలోనివే కావటంతో గెలుపు బాధ్యతను హరీష్ భుజాన వేసుకుని పనిచేస్తు్న్నారు. అటు.. వెంకట్రామరెడ్డి కూడా పివిఆర్ ట్రస్టు పేరిట సామాజిక సేవాకార్యక్రమాలను చేస్తూ జనంలోకి వెళుతున్నారు. ఈ స్థానం పరిధిలోని కాంగ్రెస్‌కు ఒకే ఎమ్మెల్యే ఉండటం, హరీశ్ గట్టిగా ప్రచారం చేయటం ఇక్కడి అభ్యర్థికి ప్లస్ పాయింట్లు కాగా, సిద్ధిపేట కలెక్టర్‌గా మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ల నిర్మాణానికి రైతుల నుండి బలవంతంగా వేల ఎకరాల భూములు గుంజుకున్నాడనీ, రైతులను లాఠీలతో కొట్టించారనే అంశం ఆయనకు మైనస్‌గా మారుతోంది.