Which Flag is Flying in Nalgonda : సార్వత్రిక ఎన్నికలకు రంగం సిద్ధమైపోయింది. ఇప్పటికే అన్ని పార్టీలూ బరిలో నిలవబోయే అభ్యర్థుల పేర్లను ప్రకటించే పనిలో ఉన్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ ఇప్పటికే నాలుగు పేర్లను ప్రకటించగా, మరో నాలుగైదు పేర్లను ప్రకటించేందుకు సిద్ధపడుతోంది. బీజేపీ ఇప్పటికే 8 మంది పేర్లను ప్రకటించగా, అటు బీఆర్ఎస్ పార్టీ కూడా 8 మంది పేర్లను ప్రకటించింది. గత శాసన సభ ఎన్నికల్లో గెలిచి, మంచి ఊపు మీదున్న కాంగ్రెస్ పార్టీ 14 సీట్లు గెలుచుకొని సత్తా చాటతానని ప్రకటించి ఇప్పటికే టాప్ గేర్‌లో దూసుకుపోతోంది. తెలంగాణలో బలపడాలని ఆకాంక్షిస్తున్న బీజేపీ 2019 లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన 4 సీట్లకు తోడు మరో రెండు సీట్లైనా గెలిచి మరింత విస్తరించాలని ప్రయత్నిస్తుండగా, గత అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని పరాజయం పాలైన బీఆర్ఎస్ మాత్రం అభ్యర్థులను ఎంపిక చేసేందుకే సతమతమవుతోంది.
ఇక కాంగ్రెస్ ప్రకటించిన నాలుగు స్థానాల్లో ఇప్పడు అందరి దృష్టి నల్గొండ మీద పడింది. దక్షిణ తెలంగాణలోని ఈ స్థానం అనాదిగా కాంగ్రెస్, కమ్యూనిస్టుల కంచుకోటగా ఉంది. 1952 నుంచి ఇప్పటి వరకు ఈ స్థానానికి 17 సార్లు ఎన్నికలు జరగగా కమ్యునిస్టులు, కాంగ్రెస్ చెరో 7 సార్లు ఇక్కడ గెలుపొందగా, రెండు సార్లు టీడీపీ, ఒకసారి మర్రి చెన్నారెడ్డి స్థాపించిన తెలంగాణ ప్రజాసమితి నెగ్గింది. తెలంగాణలో 2014 ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినా ఈ పార్లమెంటు స్థానంలో బీఆర్ఎస్ జెండా పాతలేకపోయింది. 2014, 2019 ఎన్నికల్లో ఇక్కడి ఓటర్లు కాంగ్రెస్ పార్టీకే జైకొట్టారు.
Read More: 15 కోట్లతో పరార్ అయిన ప్రభుత్వ ఉద్యోగి
నల్గొండ లోక్‌సభ నియోజకవర్గంలో దేవరకొండ, హుజూర్ నగర్, కోదాడ, మిర్యాలగూడ, నాగార్జున సాగర్, నల్గొండ, సూర్యాపేట అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 2021 ఓటర్ల జాబితా ప్రకారం ఇక్కడి ఓటర్ల సంఖ్య 15,85,980. ఇక, ఓటరు గణాంకాలను పరిశీలిస్తే ఈ స్థానంలోని మొత్తం ఓటర్లలో 17.5 శాతం ఎస్సీలు, 15.5 ఎస్టీ ఓటర్లు, 7.1 శాతం ముస్లిం ఓటర్లున్నారు. మొత్తం ఓటర్లలో 76.4 శాతం గ్రామీణ ఓటర్లు కాగా, మిగిలిన వారు పట్టణ ఓటర్లు. 2019లో ఇక్కడ 74.13% శాతం పోలింగ్ నమోదు కాగా, కాంగ్రెస్ అభ్యర్థి ఎన్. ఉత్తమకుమార్ రెడ్డి 25,682 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2023 నవంబరులో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ లోక్‌సభ స్థానంలోని ఏడు స్థానాల్లో ఆరింటిని కాంగ్రెస్ పార్టీ గెలుచుకోగా, బీఆర్ఎస్ కేవలం సూర్యాపేట సీటుకే పరిమితమైంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ గెలుపొందిన ఆరుగురు కాంగ్రెస్ అభ్యర్థుల మెజారిటీ ఏకంగా 2,87,438 కావటంతో ఈ సీటులో కాంగ్రెస్ మంచి ఉత్సాహంతో దూసుకుపోతోంది.
ఈ స్థానంలో బీజేపీకి తగిన బలం లేదు. దీంతో ఆ పార్టీ వేరే పార్టీల్లోని అసంతృప్తుల మీద కన్నేసింది. ఈ క్రమంలోనే హుజూర్‌నగర్ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డిని పార్టీలో చేర్చుకుంది. నల్గొండ సీటు ఇస్తాననే స్పష్టమైన హామీతోనే ఆయన బీజేపీలో చేరినట్లు సమాచారం. రేపో మాపో ఆయన పేరును పార్టీ అధికారిక అభ్యర్థిగా ప్రకటించనుందని వార్తలు వస్తున్న వేళ.. ఆయన కార్యకర్తలతో మాట్లాడిన ఆడియో ప్రస్తుతం సంచలనంగా మారింది. బీఆర్ఎస్‌లో పరిస్థితి దిక్కుతోచని విధంగా ఉండటంతో తాను బీజేపీలో చేరుతున్నాను తప్ప తనకు నిజంగా బీజేపీలో చేరడం ఇష్టం లేదని ఆయన ఆ ఆడియోలో చెప్పారు. ‘మీరు పార్టీలో చేరుతున్నారని చెప్పేశాం.. ఇప్పుడు మీరు చేరకపోతే మా పరువు పోతుంది’ అంటూ బీజేపీ రాష్ట్రనేతలు తనకు బలవంతంగా బీజేపీ కండువా కప్పారని, కార్యకర్తలకు చెప్పకుండా ఆ పార్టీలో చేరటం తప్పేనని కూడా ఆయన వ్యాఖ్యానించారు. దీంతో ఇప్పుడు బీజేపీ కార్యకర్తలంతా తలలు పట్టుకున్నారు. రేపు పార్టీ ఈయనను అభ్యర్థిగా ప్రకటిస్తే ఏ ముఖం పెట్టుకుని ప్రచారం చేయాలంటూ ఆది నుంచి బీజేపీ కోసం స్థానికంగా పనిచేస్తున్న నేతలు మండిపడుతున్నారు.
Read More: ఫోన్ ట్యాపింగ్‌పై సిట్ ఏర్పాటుకు ప్రయత్నాలు.. ఆధారాలన్నీ ఇవ్వనున్న ‘స్వేచ్ఛ’
ఇక, బీఆర్ఎస్ పార్టీ తగిన అభ్యర్థి కోసం అన్వేషన కొనసాగిస్తోంది. నిన్నటి వరకు ఇక్కడ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు అమిత్ రెడ్డిని బరిలో దించాలని కేసీఆర్ భావించారు. కానీ, అమిత్ రెడ్డి సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డిని కలవటం, ఆ తర్వాత తాను పోటీ చేయబోవటం లేదని ప్రకటించటంతో ఆ పార్టీ ఇప్పడు మాజీ ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి, నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి సోదరుడు కంచర్ల కృష్ణారెడ్డి పేర్లను పరిశీలిస్తోంది.
ఇక్కడ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ హోం మంత్రి కె. జానారెడ్డి కుమారుడైన రఘువీర్ రెడ్డిని అభ్యర్థిగా కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటించింది. దీంతో ఆయన ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టేశారు. పదేళ్లకు పైగా కాంగ్రెస్ 2014, 2018లో పీసీసీ సభ్యుడిగా పనిచేశారు. 2021 నుంచి పీసీసీ జనరల్ సెక్రటరీగా ఉన్నారు. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన మిర్యాలగూడ అసెంబ్లీ సీటును ఆశించినా పార్టీ దానిని నల్లమోతు భాస్కరరావుకు, ఆర్ కృష్ణయ్యకు కేటాయించినా పార్టీ నిర్ణయాన్ని గౌరవించి పార్టీ గెలుపుకై పనిచేశారు. ఈ ఎన్నికల్లో నల్గొండ ఎంపీ పరిధిలోని 6 స్థానాలు కాంగ్రెస్ చేతిలో ఉండటంతో బాటు ఇద్దరు మంత్రులు ఈ లోక్‌సభ పరిధిలో ఉండటం ఈయన గెలుపుకు కలిసొచ్చే ప్రధాన అంశాలు. దీనికి తోడు కాంగ్రెస్‌లోని నేతలంతా ఐకమత్యంగా పనిచేయటం, ప్రభుత్వం అమలు చేస్తున్న హామీలతో ఈ స్థానానికి జరగనున్న ఎన్నికల్లో గెలుపు ఎవరిదనే ప్రశ్నకు బదులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మెజారిటీ ఎంత వచ్చే అవకాశం ఉందనే భావనే క్షేత్రస్థాయిలో కనిపిస్తోంది.