– ప్రభాకర్ రావు రాకపై సస్పెన్స్
– మే నెలాఖరుకు వస్తారని కొన్నాళ్లుగా ప్రచారం
– గడువు ముగుస్తుండడంతో తీవ్ర ఉత్కంఠ
– ప్రభాకర్ రావు రాకపోతే ఏం జరుగుతుంది?
– రెడ్ కార్నర్ నోటీసులు జారీ అవుతాయా?
– పోలీసుల నెక్స్ట్ ప్లాన్ ఏంటి?
– ప్రజెంట్ సిట్ ఏం చేస్తోంది?
– అసలు, ప్రభాకర్ రావు అమెరికాలో ట్రీట్మెంట్ తీసుకున్నారా?
– 2011లోనే ఆపరేషన్
– బీఆర్ఎస్ అధికారంలో ఉన్నన్నాళ్లూ గుర్తుకురాని ట్రీట్మెంట్
దేవేందర్ రెడ్డి, 9848070809
Prabhakar Rao: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఓవైపు రాజకీయంగా ప్రకంపనలు రేపుతోంది. అంతా డ్రామా అంటూ బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తుండగా, కాంగ్రెస్ నేతలు సీరియస్‌గా రియాక్ట్ అవుతున్నారు. ఇదే సమయంలో నిందితుల కన్ఫెషన్ రిపోర్టుల్లో సంచలన నిజాలు వెలుగుచూడడంతో రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అసలు సూత్రధారి ప్రభాకర్ రావు నగరానికి వచ్చే అంశంపైనా జోరుగా మాట్లాడుకుంటున్నారు. అసలు, ఆయన వస్తారా లేదా? అనే డౌట్ కూడా వ్యక్తం అవుతోంది.
మే నెలాఖరు వరకు గడువు
క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం అమెరికా వెళ్లారు ప్రభాకర్ రావు. ఆరు నెలల వరకే పర్మిషన్ ఉందని, జూన్ 26లోపు తిరిగొస్తానని పోలీస్ అధికారులకు సమాచారం అందించారు. అయితే, కొద్ది రోజుల క్రితం ముందుగానే ఇండియాకు తిరిగొస్తానని హింట్ ఇచ్చారు. మే నెల చివరి వారంలోనే వస్తానన్నట్టుగా మాట్లాడారు. దీనిపై పోలీస్ అధికారులతో ఆయన కుటుంబసభ్యులు సంప్రదింపులు కూడా జరిపారు. అయితే, ఇప్పుడు మే నెల ముగింపు దశకు వచ్చింది. ఇంతవరకూ ప్రభాకర్ రావు రాకపై కన్ఫర్మేషన్ లేదు. దీంతో ఏం జరగనుందనే ఉత్కంఠ నెలకొంది.
ప్రభాకర్ రావు రాకపోతే?
కేసులో కీలకంగా ఉన్న ప్రభాకర్ రావు రాకపోతే పరిస్థితి ఏంటనే చర్చ కూడా జరుగుతోంది. నిజానికి ఈయన రాష్ట్రానికి వస్తేనే అరెస్ట్ అయిన వారికి బెయిల్ వస్తుంది. అసలు సూత్రధారుల పాత్ర బయటపడుతుంది. అంతేకాదు, కేసులో కొత్త విషయాలు బయటకు వచ్చే ఛాన్స్ ఉంది. అలా కాకుండా, ఆయన రాకపోతే మరింత కాంప్లికేట్ అయ్యే ఛాన్స్ ఉందనేది పోలీస్ వర్గాల వాదన. నిజానికి ప్రభాకర్ రావుకు క్యాన్సర్‌కు సంబంధించిన ఆపరేషన్ 2011లోనే జరిగింది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నాన్నాళ్లూ తర్వాత ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకున్నది లేదు. కానీ, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెలుగు చూశాక, దానినే సాకుగా చూపించి కేసు నుంచి తప్పించుకునేందుకు అమెరికా డ్రామా ఆడుతున్నారనే ప్రచారం జరుగుతోంది.
దుబాయ్ కేంద్రంగా పావులు
అమెరికాలో ట్రీట్మెంట్ అంటూ వెళ్లిన ప్రభాకర్ రావు, దుబాయ్ కేంద్రంగా చక్రం తిప్పే ప్రయత్నం చేశారు. తనకు టచ్‌లో ఉండే నాయకులతో సంప్రదింపులు జరిపారు. అలాగే, నిందితుల కుటుంబసభ్యులతో ఫోన్‌లో మాట్లాడడం చేశారు. ఈ వివారాలన్నీ గతంలోనే ‘స్వేచ్ఛ’ ఎక్స్‌క్లూజివ్‌గా బయటపెట్టింది. నగరానికి వస్తే ఏం జరుగుతుంది? రాకుండా లండన్ చెక్కేస్తే ఏం జరుగుతుంది? అనే అంశాలపై ప్రభాకర్ రావు మంతనాలు జరిపిన్నట్టు వివరించింది.
నోటీసులతోనే రప్పిస్తారా?
లోక్ సభ ఎన్నికలు ముగియడంతో దర్యాప్తు అధికారుల ఫుల్ ఫోకస్ ఫోన్ ట్యాపింగ్ కేసుపైనే ఉంది. ప్రభాకర్ రావును నగరానికి తీసుకొచ్చే దానిపై దృష్టి సారించారు. ఇప్పటికే ఆయనపై నాంపల్లి కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. రెడ్ కార్నర్ నోటీసులకు సంబంధించి సెక్షన్ 73 సీఆర్పీసీ కింద ఆదేశాలిచ్చింది. దీంతో ప్రభాకర్ రావును రప్పించేందుకు పోలీసులు ఇమ్మిగ్రేషన్, ఇంటర్ పోల్‌కు సమాచారం చేరవేశారు. రెడ్ కార్నర్‌పై చర్చించారు. ఇప్పటికే లుకౌట్ సర్క్యులర్ ఉండడంతో ఎయిర్ పోర్టులోనే ప్రభాకర్ రావును అదుపులోకి తీసుకుంటారు. తర్వాత పోలీసులకు అప్పగిస్తారు.
సిట్ ఏం చేస్తోంది?
కేసులో ఎవర్ని పలకరించినా ప్రభాకర్ రావు చెప్తేనే చేశామని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన వస్తే గానీ, కేసులో కీలక అడుగు పడదు. ఓవైపు ప్రభాకర్ రావును రప్పించే ప్రయత్నాలు చేస్తూనే, ఇంకోవైపు ఆయనతో క్లోజ్‌గా ఉన్న అధికారులు, ఇతర పోలీసులపై ఫోకస్ చేశారు దర్యాప్తు అధికారులు. ఒక్కొక్కరుగా వారిని విచారిస్తూ వివరాలు సేకరిస్తున్నారు. అయితే, ప్రభాకర్ రావు వస్తేనే, కేసు ఓ కొలిక్కి వస్తుంది. మే నెల పూర్తవుతుండగా, ఆయన వస్తారా లేదా? అనేది హాట్ టాపిక్‌గా మారింది.