– రహస్య ఎజెండా అమలుకే 400 సీట్లు
– రిజర్వేషన్లపై మోదీ మౌనం దేనికని ప్రశ్న
– బీసీల జనగణన చారిత్రక అవసరం
– ఆరునూరైనా పంద్రాగస్టులోగా రుణమాఫీ చేసి తీరతా
– 5 సీట్లను మోదీకి తాకట్టు పెట్టిన కేసీఆర్
– ఈటల, మల్లారెడ్డి ముచ్చటే అందుకు సాక్ష్యం
– మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, స్వేచ్ఛ: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తే.. భారత రాజ్యాంగం ఇచ్చిన రిజర్వేషన్లన్నీ రద్దుచేయటం ఖాయమని ఆయన హెచ్చరించారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పలు అంశాలపై బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల వైఖరిని ఎండగట్టారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. శతాబ్ద కాలంలో దేశాన్ని హిందూరాష్ట్రంగా మారుస్తామనీ, రిజర్వేషన్లు లేని దేశాన్ని ఆవిష్కరిస్తామని 1925లో తన ఆవిర్భావ దినోత్సవం నాడు ఆర్ఎస్ఎస్ ప్రతినబూనిందనీ, అందుకు అనుగుణంగానే ఆ సంస్థ శతాబ్ది వేడుకల నాటికి 2025లో ఆయా మార్పులకు మోదీ, అమిత్ షా ప్రణాళికలు రచిస్తున్నారని ఆరోపించారు.
వారు చెబుతున్నట్లుగా నిజంగా 400 ఎంపీ సీట్లు గెలిస్తే, రాజ్యాంగాన్ని మార్చేందుకు తప్పక ప్రయత్నిస్తారని, కాంగ్రెస్ ఇచ్చిన రిజర్వేషన్లన్నీ తొలగించి తీరతారని ఆయన జోస్యం చెప్పారు. గతంలో వీపీ సింగ్ మండల్ కమిషన్ నివేదిక మేరకు దేశవ్యాప్తంగా ఉన్న ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించటానికి ప్రయత్నించిన సందర్భంలో బీజేపీ దానిని వ్యతిరేకించిందని సీఎం గుర్తుచేశారు. రిజర్వేషన్ల తొలగింపు ద్వారా బీజేపీ.. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలపై నేరుగాసర్జికల్ స్ట్రైక్ చేయబోతోందని చెప్పుకొచ్చారు. దేశ జనాభా దామాషా ప్రకారం బీసీ, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ కోటాకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని, బీజేపీ కుట్రలను తిప్పికొట్టి, ఆయా వర్గాలకు ఉన్న రిజర్వేషన్లను కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ పోరాడుతోందని పేర్కొన్నారు. దేశ జనాభాలో తమ వాటాకు తగినట్లుగా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు రిజర్వేషన్లు కోరుతున్నారని, వారి న్యాయమైన కోరిక పట్ల కాంగ్రెస్ సానుభూతితో నిర్ణయాలు తీసుకుంటోందని వివరించారు. కేంద్రంలో తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే దేశవ్యాప్తంగా కులగణన చేస్తామనీ, బీసీ జనాభాకు తగినట్లుగా వారికి రిజర్వేషన్లు కల్పించి తీరతామని స్పష్టం చేశారు. బీసీల జనగణన ఒక చారిత్రక అవసరమనీ, అదే జరిగితే తన పునాదులు కదిలిపోతాయని బీజేపీ భయపడుతోందని ఎద్దేవా చేశారు.
Also Read: నల్లధనం..బీజేపీని నడిపించే ఇంధనం
మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షా దేశంలోని దర్యాప్తు సంస్థలను తమ పనిముట్లుగా వాడుకుని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఫైరయ్యారు. విపక్షాలను భయభ్రాంతులను చేసి 400 సీట్లు గెలిస్తే తమ అజెండాను అమలు చేయటానికి ఉన్న అన్ని అడ్డంకులూ తొలగిపోతాయని బీజేపీ భావిస్తోందన్నారు. బీజేపీ ఒక ప్రణాళిక ప్రకారం రాజ్యాంగ ప్రాథమిక సూత్రాలపై దాడి చేస్తోందని, కార్పొరేట్ పెట్టుబడిదారులతో కలిసి దేశ వనరులను దోపిడీ చేస్తోందన్నారు. కాంగ్రెస్ ఈ అంశంపై ఇన్ని ప్రశ్నలు వేస్తున్నా, ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా లేదా ఆ పార్టీ నేతలెవరూ రిజర్వేషన్లపై ఆయా వర్గాలకు భరోసా ఇవ్వటం లేదన్నారు.
రాజ్యాంగాన్ని రద్దు చేయాలని గతంలో కేసీఆర్ మాట్లాడారని కూడా సీఎం మండిపడ్డారు. గతంలో కేసీఆర్ ప్రకటించిన మైనారిటీ రిజర్వేషన్‌ను 4 నుంచి 12 శాతానికి పెంచుతానని కేసీఆర్ గతంలో వాగ్దానం చేశారనీ, కానీ తాజాగా అమిత్ షా తెలంగాణ వచ్చి మరీ ఆ రిజర్వేషన్లనే రద్దు చేస్తానంటే కేసీఆర్ నోరెత్తటం లేదని విమర్శించారు. బీజేపీ ఇంత దుర్మార్గంగా మాట్లాడుతున్నా తెలంగాణలో విపక్షనేత కేసీఆర్ నోరెత్తటం లేదని, కేసీఆర్ ఏ భావజాలం కోసం పని చేస్తున్నారనేది స్పష్టంగా ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. తన కుమార్తె కోసం ఆయన ఇప్పటికే 5 లోక్‌సభ స్థానాలను బీజేపీకి వదిలేశారని ఆరోపించారు. మల్కాజ్‌గిరి నుంచి బీజేపీ అభ్యర్థిగా ఉన్న ఈటల రాజేందర్‌ను మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ‘అన్నా.. నువ్వే గెలుస్తున్నవ్’ అన్నాడంటే ఇది దేనికి సంకేతమని నిలదీశారు. ఒకవేళ తాను ఆరోపిస్తున్నట్లు బీజేపీ-బీఆర్ఎస్ మధ్య ఎలాంటి అంతర్గత అవగాహన లేకపోతే, మల్లారెడ్డిని ఇంకా పార్టీలో ఎలా కొనసాగిస్తున్నారని ప్రశ్నించారు.
Also Read: ప్రజాద్రోహులకు గుండు సున్నాయే..
మల్కాజ్‌గిరిలో బీజేపీ తరపున పోటీచేస్తున్న ఈటల రాజేందర్ మీదా సీఎం ప్రశ్నలు కురిపించారు. తాను రైతు రుణమాఫీ చేయటానికి ప్రయత్నిస్తుంటే.. ‘భూములు అమ్మకుండా చేయాలి’ అంటూ రాజేందర్ వింత డిమాండ్లు చేస్తున్నారని మండిపడ్డారు. ఆయన ఆర్థిక మంత్రిగా ఉండగా కేసీఆర్ ఇష్టారీతిన భూములు అమ్మితే ఈటల ఏనాడూ నోరెత్తలేదని మండిపడ్డారు. తెలంగాణ రైతాంగానికి తాము ఇచ్చిన రూ. 2 లక్షల రైతు రుణమాఫీ హామీని ఎట్టి పరిస్థితిలోనూ నిలబెట్టుకుని తీరతామని, రుణమాఫీ జరగకుండా చూడటమే లక్ష్యంగా బీజేపీ, బీఆర్ఎస్ వితండ వాదనలు చేస్తున్నాయన్నారు. దేవాలయ భూములు కాజేశాడని ఈటల మీద గతంలో కేసీఆర్ ప్రభుత్వం కేసులు పెట్టింది తప్ప ఏ చర్యా తీసుకోలేదనీ, కేసీఆర్ మీద గతంలో ఈటల చేసిన ఆరోపణల మీద ఆయన ఢిల్లీ పెద్దలకు ఎలాంటి ఫిర్యాదూ చేయటం లేదనీ, దీనిని బట్టే వారిద్దరి మధ్యా స్పష్టమైన అవగాహన ఉందని అనుమానం వ్యక్తం చేశారు. సమాజంలో దగా పడిన, వంచనకు గురైన వర్గాల ప్రయోజనాల కోసం కాంగ్రెస్ నిలబడుతుందనీ, రిజర్వేషన్లు అందాలన్నా, సామాజిక, ఆర్థిక ప్రగతి సాధించాలన్నా ఈ ఎన్నికల్లో తెలంగాణ వాసులంతా కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.