Warangal War One Side Politics: తెలంగాణలో పోరాటాల పురిటిగడ్డగా పేరున్న ఓరుగల్లు ఎంపీ సీటును దక్కించుకునేందుకు అన్ని పార్టీలు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. గొప్ప రాజకీయ చైతన్యం ఉన్న ఈ వరంగల్ లోక్‌సభ నియోజక వర్గం పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గం పరిధిలో 18,16, 609 మంది ఓటర్లు ఉన్నారు. 2009లో కాంగ్రెస్, 2014, 2015 ఉప ఎన్నికల్లో ఇక్కడ బీఆర్ఎస్ గెలిచింది. అలాగే 2019 లోనూ బీఆర్ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ భారీ మెజార్టీతో వరుసగా రెండోసారి ఇక్కడ గెలిచారు. వరంగల్ ఎంపీ సీటు పరిధిలో 60 శాతం గ్రామీణ ప్రాంతం కాగా 40 శాతం పట్టణ ప్రాంతం.
ఎస్సీ రిజర్వ్డ్ కేటాయించిన ఈ స్థానం నుండి బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్ స్థానంలో ఈసారి కడియం శ్రీహరి కుమార్తె కావ్య పోటీ చేయనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ.. ఈ సీటులో అభ్యర్థిని గెలిపించే బాధ్యతను మంత్రి కొండా సురేఖకు అప్పగించింది. ఈ స్థానం నుంచి పార్టీ సీనియర్ నేత, పోలీసు ఉద్యోగానికి రాజీనామా చేసి దీర్ఘకాలంగా పార్టీకి సేవలందిస్తున్న దొమ్మాటి సాంబయ్య, ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన మాజీ మంత్రి రాజయ్య, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, అద్దంకి దయాకర్ పోటీ పడుతుండగా, వీరిలో సాంబయ్య అభ్యర్థిత్వం వైపు అధిష్ఠానం మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. సీపీఐ కూడా ఈ సీటు కోసం ప్రయత్నించింది. సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా, జాతీయ కౌన్సిల్ సభ్యుడు రామకృష్ణ పాండా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసి వరంగల్ సీటు గురించి విజ్ఞప్తి చేశారు. ఇక బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షుడు కొండేటి శ్రీధర్, మంద కృష్ణ మాదిగ, చింతా సాంబమూర్తి, మాజీ డీజీపీ కృష్ణ ప్రసాద్ పేర్లను బీజేపీ అధిష్ఠానం పరిశీలించినా, తాజాగా బీఆర్ఎస్ సీటు ఆశించి భంగపడిన మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌ను బరిలో దింపాలని భావిస్తోన్నట్లు సమాచారం.
ఈ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని 7 అసెంబ్లీ సీట్లలో ఒక్క స్టేషన్ ఘనపూర్ నుంచి కడియం శ్రీహరి మాత్రమే బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నారు. పాలకుర్తి నుంచి యశశ్వని రెడ్డి, పరకాల నుంచి రేవూరి ప్రకాష్ రెడ్డి , వరంగల్ వెస్ట్ నుంచి నాయిని రాజేందర్ రెడ్డి , వరంగల్ ఈస్ట్ నుంచి కొండా సురేఖ , వర్ధన్నపేట నుంచి కే.ఆర్ నాగరాజు , భూపాలపల్లి నుంచి గండ్ర సత్యనారాయణ రావు ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మొత్తం 7 అసెంబ్లీ సీట్లలో 6 కాంగ్రెస్ చేతిలో ఉండటంతో ఇక్కడ సీటు దక్కితే చాలు.. గెలుపు ఖాయమనే ధీమాలో కాంగ్రెస్ నేతలు ఉన్నారు. దీనికి తోడు హామీలని వేగంగా అమలు చేస్తూ ఉండటం కూడా ఆ పార్టీకి పాజిటివ్‌గా మారనుంది.
ఇక రానున్న ఎన్నికల్లో ఈ సీటులో కాంగ్రెస్, బీజేపీ ప్రధాన పోటీ దారులుగా నిలవబోతున్నాయని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ గతంలో తాను అందించిన సేవలను గుర్తుచేయటంతో బాటు సీఎం రేవంత్ రెడ్డి పాలన, హామీల అమలు వంటి అంశాల మీద ఆధారపడనుండగా, బీజేపీ మోదీ ప్రభుత్వం విజయాలనే కీలక ప్రచార అస్త్రాలుగా మలచుకోనుంది.