– పార్టీ కార్యక్రమాలకు దూరం
– కేటీఆర్ టూర్ సందర్భంగా పెట్టిన ఫ్లెక్సీల్లోనూ మాయం
– వరంగల్ మేయర్ గుండు సుధారాణి జంప్ అవుతారా?
– బీఆర్ఎస్‌కు కటీఫ్ చెప్పే సమయం వచ్చిందా?
– ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్‌తో భేటీ
Mayor Sudharani joins congress(Political news today telangana): అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత అవస్థలు పడుతోంది బీఆర్ఎస్. ఉదయం ఉంటానన్న లీడర్ సాయంత్రానికి జెండా మార్చేస్తున్నారు. కేసీఆర్ పనైపోయిందనేలా ఒకరి తర్వాత ఒకరు జంప్ అవుతున్నారు. కిందిస్థాయి నుంచి పైస్థాయి ఎంపీల దాకా ఇదే తీరు. ఇదే క్రమంలో వరంగల్ బీఆర్ఎస్‌లో మరోమారు కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇప్పటికే కీలక నేతల జంప్
వరంగల్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత కడియం కావ్య, ఆమె తండ్రి, ఎమ్మెల్యే శ్రీహరి బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. జిల్లా అధ్యక్షుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బీజేపీ గూటిలో వాలారు. కావ్య కాంగ్రెస్ తరఫున ఎంపీగా పోటీ చేస్తుండగా, రమేష్ బీజేపీ గుర్తుతో బరిలో నిలిచారు. ఇప్పటికే అనేకమంది కార్పొరేటర్లు, సీనియర్ నేతలు బీఆర్ఎస్ పార్టీని వీడుతున్నారు.
Also Read:
పార్టీ కార్యక్రమాలకు దూరంగా మేయర్
అధికారం పోయిన తరువాత తీవ్ర గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది బీఆర్ఎస్. ఈ స్థితిలో మరో కొత్త తలనొప్పి మొదలైంది. ఎంపీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గుండు సుధారాణి బీఆర్ఎస్‌లో ఉన్నట్టా లేనట్టా? అనే చర్చ జరుగుతోంది. మంగళవారం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వరంగల్ పర్యటనకు వచ్చారు. మేయర్ పరిధిలోని వర్ధన్నపేట, వరంగల్ తూర్పు నియోజకవర్గాలకు సంబంధించి రెండు సభలు జరిగాయి. కానీ, ఆమె ఎక్కడా కనిపించలేదు. వరంగల్ తూర్పు నియోజకవర్గ బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశానికి కూడా డుమ్మా కొట్టారు. దీంతో వరంగల్‌లో ఇప్పుడిది హాట్ టాపిక్‌గా మారింది.
ఫ్లెక్సీల్లోనూ మిస్సింగ్
సమావేశాల దగ్గర ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లోనూ మేయర్ సుధారాణి ఫోటో కనిపించలేదు. ఇంతకీ ఆమె పార్టీలో ఉంటారా? లేక, జంప్ అవుతారా? అనే డౌట్స్ సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. ఇటీవలే కుమారుడుతో కలిసి సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు సుధారాణి. అప్పటినుంచే ఆమె తీరులో మార్పు వచ్చిందని జిల్లా వ్యాప్తంగా మాట్లాడుకుంటున్నారు. బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్ గూటిలో చేరతారని అనుకుంటున్నారు. అందుకే, పార్టీ కార్యక్రమాలకు కావాలనే దూరంగా ఉంటున్నారని ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే జిల్లాలో బీఆర్ఎస్‌కు తీవ్ర నష్టం కలుగుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.