పార్లమెంటు ఎన్నికల పోలింగ్ దగ్గర పడుతున్న కొద్దీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. అగ్గిపుల్ల, సబ్బు బిళ్ల, కుక్కపిల్ల కాదేది కవితకు అనర్హం అన్నట్టు, కాదేది రాజకీయానికి అనర్హం అన్నట్టుగా పరిస్థితి కనిపిస్తోంది. రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా ఏ ఇష్యూని ఎలా వాడుకుందాం అనే రాజకీయ పక్షాల ఎన్నికల యావ కొనసాగుతోంది. దీనికి రాజకీయ పార్టీలు ఏవీ అతీతం కావు. జరుగుతున్న పరిణామాలను తమకు అనుకూలంగా వాడుకుందాం అన్న తపన ఆయా పార్టీలు కనబరుస్తున్నాయి.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో పెన్షన్ల రాజకీయం కొనసాగుతోంది. వృద్ధాప్య పెన్షన్లు, దివ్యాంగుల పెన్షన్లు ఇతర సామాజిక సంక్షేమ పెన్షన్లు అన్నీ కూడా ఇప్పటివరకు రాష్ట్రంలో వలంటీర్ల వ్యవస్థ ద్వారా ఇంటింటికి ఒకటో తారీఖున అందించారు. అందులో రాజకీయాలు ఉన్నాయని వలంటీర్ల వ్యవస్థ రద్దు చేయాలని ప్రజల వ్యక్తిగత జీవితంలోకి చొరబడుతున్నారని, చివరికి ఆడపిల్లలను అపహరించడానికి వారిని వ్యభిచారంలోకి దింపడానికి అమ్ముకుంటున్నారని అనేక తీవ్రమైన ఆరోపణలను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గతంలో చేశారు. ఈ ఆరోపణలను టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంతకంటే మరింత పదునుగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే వలంటీర్ల వ్యవస్థను రద్దు చేస్తామని ప్రకటించారు. అసలు వలంటీర్ల వ్యవస్థ ఎందుకు అనే ప్రశ్న కూడా చంద్రబాబు నాయుడుతో సహా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వేశారు. మిగతా సంక్షేమ పథకాలకు లేని నిబంధనలు దీనికి ఎందుకని డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద ఆటోవాలా నుంచి మొదలుకొని అనేక సంక్షేమ పథకాల డబ్బులనే వారి వారి అకౌంట్లో ఒక క్లిక్ కొట్టగానే వెళ్లిపోయినప్పుడు పెన్షన్లను కూడా అలా బటన్ నొక్కి ఎందుకు చేయరు అని వారు ప్రశ్నించారు. ఇది వాస్తవమైన ప్రశ్న. కానీ, ప్రస్తుతం ఎన్నికల కోసం ఆ ప్రశ్నలు అన్నింటినీ పక్కనపెట్టి తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వలంటీర్ల వ్యవస్థ తీసివేయమని రద్దు చేయబోమని ఈమధ్య జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి కొత్త రాగం అందుకుంది. ఇది ఏ విధంగా చూడాలి అన్నది ప్రజలు నిర్ణయించుకుంటారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రభుత్వం 2020లో వలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టినప్పుడు తెలుగుదేశం, జనసేన తీసుకున్న స్టాండ్ ప్రస్తుతం ఎన్నికల సందర్భంగా ఎందుకు మారింది అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
ఇక, ఇప్పుడు పెన్షన్ టెన్షన్ ఎందుకు ఏర్పడింది అంటే మొదట ఎన్నికల నిర్వహణ డ్యూటీలో వలంటీర్లను వేయవద్దు అని ఎన్నికల సంఘం ఆదేశించింది. అంతవరకు బాగానే ఉంది. 2024 మార్చి 9న ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే నాటికే ఆ నెల పెన్షన్లను వలంటీర్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసేసింది. ఇక ఏప్రిల్ నెల పెన్షన్ల పంపిణీకి ముందు, అంతకుముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా పనిచేసి అనేక అవమానాలు ఎదుర్కొని తన హైకోర్టు ఉత్తరం ద్వారా తన ఓటును తన గ్రామంలో విజయవంతంగా నమోదు చేయించుకొని, రేపటి ఎన్నికలలో ఆయన ఓటు ఎవరికో బహిరంగ రహస్యమైన నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రస్తుతం ఈ వివాదాల్లో కీలకమైన వ్యక్తిగా మారారు. మొదట ఆయన వలంటీర్ల వ్యవస్థ మీద ప్రశ్నిస్తూ వారి ద్వారా పెన్షన్ల పంపిణీ జరిగితే ఒకరకంగా అధికారిక లంచం ఇచ్చినట్లే అని చెప్పి ఎన్నికల కమిషన్‌కి ఫిర్యాదు చేశారు. అధికార పార్టీకి కొమ్ముగా ఈ వలంటీర్లు రేపు ఎన్నికల సందర్భంగా ఓటర్లకు పెన్షన్ల పంపిణీ ఒక సాకుగా చూపించి ఇంటింటికి వెళ్లి మద్యం డబ్బు పంపిణీ చేసే అవకాశం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ వెంటనే ఎన్నికల కమిషన్ పెన్షన్ల పంపిణీకి వలంటీర్లను ఉపయోగించుకోవద్దు అని ఆదేశాలు ఇవ్వడం చకాచకా జరిగిపోయింది.
ఇంటింటికి వృద్ధులకు, దివ్యాంగులకు, ఇతరులకు పెన్షన్ల పంపిణీ ఎలా జరగాలి అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. దీన్ని సరిదిద్దడానికి అవసరమైన ఏర్పాట్లు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. దాంతో ఏప్రిల్ 3 నుంచి పంపిణీ చేస్తామన్న పెన్షన్లు ఆయా లబ్ధిదారులు గ్రామ సచివాలయానికి ప్రత్యక్షంగా వెళ్లి తీసుకోవాల్సిన అగత్యం ఏర్పడింది. ఎన్నికల సందర్భంగా ప్రతి చర్య ప్రతిచర్యగా మారుతుందని దాన్ని రాజకీయ పార్టీలు అనుకూలంగా ఉపయోగించుకుంటాయని తెలియని సామాన్య జనం రెండు పక్కలా చేరి ఇరు పార్టీల విధానాలను కొందరు విమర్శిస్తున్నారు మరి కొందరు సమర్థిస్తున్నారు. పేదలకు ఇచ్చే పెన్షన్లను అడ్డుకుంటున్నారని వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ మీద ఆరోపిస్తుంటే మీరు ఖజానాలో డబ్బులన్నీ మీకు అనుకూలమైన కాంట్రాక్టర్లకు ఇచ్చేశారు, మీ దగ్గర డబ్బులు లేవు కనుక ఇప్పుడు ఇది సాకుగా చూపించి పెన్షన్లను ఆపుతున్నారు అని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. చివరికి పెన్షన్ పొందే వృద్ధులు గ్రామ సచివాలయాలకు వెళ్లి తీసుకునే క్రమంలో వడదెబ్బ, గుండెపోటు ద్వారా చనిపోగానే ఆ చావులను కూడా తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం వైసీపీ చేస్తోంది. మృతుల శవాల ఊరేగింపు, వారి ఇంటికి వెళ్లి పరామర్శించడం చేస్తూ పెన్షన్లు ఆపడానికి ప్రధానమైన దోషిగా ప్రతిపక్షాలను చూపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామ సచివాలయాల్లో ఉన్న 1, 27,000 మంది సిబ్బంది ద్వారా పెన్షన్లను గతంలో మాదిరిగానే ఇంటింటికి పంపిణీ చేస్తే రెండు కాకపోతే మూడు రోజుల్లో పూర్తవుతుంది. కానీ, ప్రభుత్వం ఆ పని ఎందుకు చేయడం లేదని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. అటువైపు అధికార పక్షం సిద్ధం సభల ద్వారా సాక్షాత్తు ముఖ్యమంత్రి ప్రతిపక్షాలపై పెన్షన్ల పంపిణీ వారే ఆపారని ఆరోపణలు చేస్తున్నారు. మరోవైపు ప్రతిపక్షం ధీటుగా సమాధానం ఇస్తోంది. ఆవులు పోట్లాడుకుంటే లేగ దూడల కాళ్ళు ఇరిగిన చందంగా ప్రజల పరిస్థితి మారింది. చివరికి ఈ సమస్య రాష్ట్ర హైకోర్టు దృష్టికి కొందరు పెన్షన్ పొందేవారు పిటిషన్ రూపంగా తీసుకువెళ్తే న్యాయస్థానం కూడా ఒక మంచి మాట చెప్పింది. దేశమంతా వలంటీర్లు లేకుండానే అధికారుల ద్వారా పెన్షన్లు పంచడానికి లేని ఇబ్బంది ఇక్కడ ఎందుకు వస్తుందని ప్రశ్నిస్తూ ఆ పిటిషన్‌ను కొట్టివేసింది.
సమస్య వర్ణన ఎంతైనా చేయొచ్చు. దీనికి పరిష్కారాలు కనుగొనవలసి ఉంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వేసిన ప్రశ్న నుంచి మనం పరిష్కారాలు సాధించే ప్రయత్నం చేద్దాం. పక్క రాష్ట్రమైన తెలంగాణలో పెన్షన్ల పంపిణీ పోస్ట్ ఆఫీసుల ద్వారా జరుగుతోంది. ఇక్కడ వృద్ధులు, దివ్యాంగులు అవస్థలు పడుతున్నారు. కొందరు మంచి అధికారులు ఉన్నచోట పోస్ట్ ఆఫీసుల ముందు పెన్షన్ పంచే రోజు మంచినీటి సౌకర్యం, టెంట్లు వేసే పరిస్థితి ఉంది. తెలంగాణలో రైతుబంధు లాంటి పథకాల నుంచి మొదలుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రకరకాల సంక్షేమ పథకాలలో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్సాక్షన్ డెబిట్ ద్వారా డబ్బులు వారి వారి ఖాతాల్లో పడుతున్నప్పుడు పెన్షన్ కూడా అలా ఎందుకు వేయకూడదు అని ప్రశ్న వస్తోంది. ఇప్పుడు చేయాల్సిన పని అదే. మరొక రెండు నెలలు మే, జూన్ మొదటి వారం వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది. ఆ ప్రకారంగా మే నెల పెన్షన్లు జూన్ నెల పెన్షన్లు ప్రజలకు అందించడానికి ప్రస్తుతం ఉన్న అధికారులచే ఏర్పాటు చేయాలి. ఇవాళ అడ్వాన్స్ టెక్నాలజీ అమల్లో ఉన్న కాలంలో వచ్చే రెండు నెలల పెన్షన్లను అకౌంట్లలో జమ చేయడానికి అవసరమైన సాంకేతికమైన మార్పులు తీసుకురావాలి. అప్పుడు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. కానీ, ప్రస్తుతం ఎన్నికల కోసం దప్పిక అయినప్పుడే బావి తోడుకున్న చందంగా అటు అధికార పక్షం ఇటు ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్న తీరు బాగాలేదు. ఏదేమైనా సంక్షేమ పథకాలు అన్నీ కూడా లీకేజెస్ లేకుండా ప్రజలకు అందాలంటే ప్రస్తుతమున్న టెక్నాలజీని వాడుకొని వారి వారి బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ చేయడమే సరైన పని. ఇంత సులభమైన పరిష్కారాన్ని క్లిష్టతరం చేస్తున్న రాజకీయ పక్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
బండారు రామ్మోహన రావు
సెల్ నెంబర్: 98660 74027