ప్రజాస్వామ్యంలో ఓటు బ్రహ్మాస్త్రం. కానీ, పోలింగు రోజున ఓటర్లు దానిని వినియోగించుకోవటానికి పార్టీలు ఆశించిన స్థాయిలో ముందుకు రావటం లేదనేది బహిరంగ రహస్యం. అసెంబ్లీ ఎన్నికల్లో జరుగుతున్న ఓటింగుతో పోల్చితే పార్లమెంటు ఎన్నికల ఓటింగ్ శాతం మరింత తక్కువగా ఉంటోంది. ప్రాంతీయ, స్థానిక అంశాలతో పోల్చితే జాతీయ అంశాలకు మన ఓటర్లు అంతగా ప్రాధాన్యం ఇవ్వకపోవటంతో అసెంబ్లీ ఎన్నికల కంటే పార్లమెంటు ఎన్నికల్లో ఓటింగ్ శాతం బాగా పడిపోతోందని ఎన్నికల సంఘం గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో తొలి దశలో 65.5%, రెండో దశలో 63.5 % , మూడవ దశలో 60.48 % పోలింగ్ నమోదైంది. జనాభాకు అనుగుణంగా ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నా, ఓటింగ్ శాతం తగ్గుతూపోతోంది. ముఖ్యంగా పట్టణ ఓటర్లలో ఉదాసీనత అధికమవుతోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో దాదాపు 30 కోట్ల మంది ఓట్ల ప్రక్రియకు దూరంగా ఉండిపోయారని ఈసీ వాపోయింది. అందులో అధిక భాగం పట్టణాలు, నగరాల్లోని పౌరులు, యువత, వలస కార్మికులేనని, ముఖ్యంగా బీహార్, యూపీ, దిల్లీ, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, గుజరాత్, తెలంగాణ, పంజాబ్, రాజస్థాన్, మహారాష్ట్ర, జమ్మూకశ్మీర్, జార్ఖండ్ రాష్ట్రాల్లోని పలు నియోజకవర్గాల్లో తక్కువ ఓటింగ్ నమోదైందని ఈసీ వెల్లడించింది. నగరాల్లో బెంగళూరు, హైదరాబాద్, ముంబయి, దిల్లీ, అహ్మదాబాద్ తక్కువ ఓటింగ్ జాబితాలో నిలిచాయి.
ఎన్నికల్లో ఓటరు నిరాసక్తతకు అనేక కారణాలు కనిపిస్తున్నాయి. 18 ఏళ్లు వయసు కలిగిన ప్రతి వ్యక్తి బాధ్యతగా ఓటు నమోదు చేసుకోవాలి. కానీ మన దేశంలో ఓటింగ్ నమోదకు యువత పెద్దగా ఆసక్తి చూపటం లేదు. ఇటీవల కాలంలో కొంత చైతన్యం పెరిగినా.. ఆశించిన స్థాయిలో అది నెరవేరడం లేదు. నైతిక విలువలు కొరవడిన రాజకీయం, పెచ్చుమీరుతున్న అవినీతి, నేతల రోత ఆరోపణలు, అభివృద్ధి ప్రణాళికలు అమలు కాకపోవటం, యువత, ఉపాధికి సంబంధించిన హామీలను ప్రభుత్వాలు చిత్తశుద్ధితో అమలు చేయకపోవటం, నాయకత్వంలో యువతకు తగిన ప్రాతినిథ్యం లభించకపోవటంతో యువత ఓటింగ్ పట్ల, ఎన్నికల రాజకీయం పట్ల ఆసక్తి చూపించటం లేదని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పౌరులకు పాలనలో భాగస్వామ్యం లేకపోవడమూ ఇలాంటి భావనకు ఊతమిస్తోంది. ఇక, పట్టణ, నగర ప్రాంతాల్లో ఓటర్ల జాబితాలోని లోపాలూ ఓటింగ్ తగ్గటానికి కారణమవుతున్నాయి. ఏటా ఓటర్ల జాబితాలను సవరించి, అప్‌డేట్ చేస్తున్నా అది పారదర్శకంగా, తప్పులు లేని రీతిలో జరగటం లేదు. ఒకే వ్యక్తికి రెండు చోట్ల ఓటుండటం, పేర్లతో తప్పులు రావటం, మరణించినవారు, ఇతర ప్రాంతాలకు వెళ్ళిన వారి పేర్లు అలాగే ఉండటం, పాత చిరునామాలతోనే ఓట్లు కొనసాగటం వంటి లోపాలతో బాటు అర్హులైన ఓటర్ల పేర్లు అందులోనుంచి గల్లంతవుతున్నాయి. ఓటరు నమోదుకు, తప్పుల సవరణకు ఆన్‌లైన్ వ్యవస్థ అందుబాటులో ఉన్నా, అది సమర్థవంతంగా పనిచేయటం లేదనేది కాదనిలేని వాస్తవం. ఇక, పట్టణ నియోజకవర్గాల్లో బోగస్ ఓటర్ల సంఖ్య అధికంగా ఉంటోందని పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి.
Also Read: Rahul Gandhi: హస్తం.. పేదల నేస్తం!
పురుష, స్త్రీ ఓటర్ల విషయానికి వస్తే, ఓటింగ్‌లో స్త్రీల శాతం తొలినాళ్లలో బాగా తక్కువగా ఉండేది. 1962లో పురుషుల ఓటింగ్ 60 % కాగా, మహిళల ఓటింగ్ 44%. అంటే 16 శాతం తేడా. అయితే, 2014 ఎన్నికల నాటికి ఈ అంతరం 4 శాతానికి తగ్గింది. 2019 ఎన్నికలలో తొలిసారి అది ప్లస్ వన్‌కు చేరింది. అంటే పురుషుల కంటే మహిళల ఓటింగ్ ఒక శాతం పెరిగింది. 2019లో 70మంది మహిళలు లోక్‌సభకు ఎన్నికయ్యారు. అత్యధిక సంఖ్యలో మహిళలు ఎంపికైంది కూడా గత ఎన్నికల్లోనే. ఓటింగు విషయంలో జెండర్ గ్యాప్ తగ్గటం ఒక శుభపరిణామంగా చెప్పవచ్చు. ఏ వర్గాలు ఓటింగ్‌కు దూరంగా ఉంటాయో ఆ వర్గాల సమస్యలను పాలకులు నిర్లక్ష్యంచేస్తారనేది తెలిసిన సంగతే. కనుక మహిళలు మరింతగా ముందుకుసాగాలంటే ప్రతి మహిళా ఓటు వేయాల్సిన అవసరం ఉంది. మరోవైపు, దేశంలో సంపన్నులు, ఎగువ మధ్యతరగతి ఓటర్ల శాతం కూడా తక్కువగానే ఉంది. తాము చెల్లించే పన్నులతో ప్రభుత్వాలు పేదలకు ఉచిత పథకాలు అందించటమే గాక, అందులో కాజేసిన డబ్బుతో ఎన్నికల్లో పేదలకు మద్యం, డబ్బు పంచి గెలుస్తున్నారనే అసంతృప్తి సంపన్న, ఎగువ మధ్యతరగతి, ఉద్యోగ వర్గాల్లో ఉంది. పైగా, ఏ ప్రభుత్వాలూ తమ సమస్యలను పట్టించుకోవనే అసహనమూ వారిలో కనిపిస్తోంది. దీంతో ఏ ప్రభుత్వం వచ్చినా, తమకు ఒరిగేదేమీ లేదనే భావన ఈ వర్గాల్లో పెరుగుతూ పోతోంది.
పట్టణ, నగర ప్రాంతాల్లో చాలామంది ‘నేనొక్కడినీ ఓటేయకపోతే ఏమవుతుందిలే..’ అనే అనాసక్త ధోరణితో పోలింగ్ రోజున ఇల్లు కదలటానికి బద్దకిస్తున్నారు. వారు తెలుసుకోవాల్సిన వాస్తవం ఏమిటంటే.. మన ప్రజాస్వామ్యంలో ఒక్క ఓటుతో చాలా మార్పు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే, మన దేశంలో ఎన్నికలు.. ‘ఫస్ట్ పాస్ట్ ది పోస్ట్’ విధానంలో జరుగుతాయి. అంటే, పోటీ చేసిన వారిలో అత్యధిక ఓట్లు పొందిన రెండవ అభ్యర్థికంటే ఒక్క ఓటు అదనంగా పొందిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు. అంటే.. ఎన్నికలో 99,998 ఓట్లు వచ్చిన వ్యక్తి ఓడిపోతే, 99,999 ఓట్లు వచ్చిన వాడు గెలుస్తాడన్న మాట. ఆ ఒక్క ఓటూ మీదే అయ్యే అవకాశాన్ని కొట్టిపారేయలేము. మీ ఒక్క ఓటులో గెలిచిన ఆ ఎమ్మెల్యే రేపటి రోజు ముఖ్యమంత్రీ కావచ్చు. మీ ఒక్క ఓటుతో గెలిచిన ఎంపీ ప్రధానీ కావచ్చు. 1999 ఏప్రిల్ 17న లోక్‌సభలో జరిగిన విశ్వాస పరీక్షలో ప్రధానిగా ఉన్న అటల్ బిహారీ వాజ్‌పేయి కేవలం ఒకే ఒక్క ఓటుతో ఓడిపోవటంతో, ప్రధాని పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అలాగే, 2008 రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో నాథ్‌ద్వారా సెగ్మెంట్ నుంచి పోటీచేసిన నాటి రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు, పార్టీ గెలిస్తే ముఖ్యమంత్రి రేసులో ముందంజలో ఉన్న సీపీ జోషి, తన సమీప బీజేపీ అభ్యర్థి కల్యాణ్ సింగ్ చౌహాన్ చేతిలో ఒక్క ఓటు తేడాతో ఓడారు. ఈ ఎన్నికల్లో సీపీ జోషికి 62,216 ఓట్లు పోల్‌కాగా.. జోషికి 62,215 ఓట్లు వచ్చాయి. దేశవ్యాప్తంగా ఈ ఓటమి గురించి చర్చ జరిగింది. జోషి ఓటమితో రెండవ సారి అశోక్ గెహ్లాట్‌కి ముఖ్యమంత్రి పీఠం దక్కింది. ఈ ఎన్నికలో మరో విచిత్రం ఏమిటంటే.. ఆ పోలింగ్ రోజున సీపీ జోషి తల్లి, సోదరి, ఆయన కారు డ్రైవర్ కూడా ఓటేయలేదు. అంతెందుకు.. 1989 పార్లమెంటు ఎన్నికల్లో అనకాపల్లి లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి కొణతాల రామకృష్ణ కేవలం 9 ఓట్ల తేడాతో నెగ్గారు. ఈ మూడు ఉదాహరణలు ఒక ఓటు విలువ ఎంత ప్రభావం చూపగలదో మనకు చెప్పకనే చెబుతున్నాయి.
Also Read: నవనీత్ కౌర్‌కు షాక్.. షాద్‌నగర్ పీఎస్‌లో కేసు నమోదు
మనం దేనికైనా ఒక వంద రూపాయలు ఖర్చు పెట్టేముందు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తాం. మరి.. మన దేశ వార్షిక జీడీపీ (స్థూల జాతీయోత్పత్తి) విలువ.. 3 వందల లక్షల కోట్ల రూపాయలు. 5 సంవత్సరాలు పాలించే ప్రధాని 15 వందల లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థను నియంత్రిస్తాడు. ఇంత ప్రజాధనాన్ని బాధ్యత గల మనిషి చేతిలో పెట్టాలంటే ఆ వ్యక్తి ఎలాంటి వాడో ఆలోచించి, ఓటు రూపంలో మన తప్పక మన నిర్ణయాన్ని తెలపాల్సి ఉంది. ముఖ్యంగా ప్రధాన ప్రత్యర్థులలో ఎవరి గెలుపోటములైనా ఒక్క శాతం ఓట్లతో మారిపోయే అవకాశమున్న మన ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటూ విలువైనదేనని నమ్మి తీరాలి. కనుక ఓటు విలువ తెలుసుకుని, ఎవరిని ఎన్నుకుంటే మేలు జరుగుతుందో ముందు ఓటరు గుర్తిస్తే ప్రజలకు సుపరిపాలన అందుతుంది. తద్వారా ప్రజాస్వామ్యం ఫలప్రదం అవుతుంది. చివరగా.. ‘నేను నా దేశ ప్రజల చేతికి కత్తి ఇవ్వలేదు. ఓటు హక్కును ఆయుధంగా ఇచ్చాను. పోరాడి రాజులవుతారో.. అమ్ముకొని బానిసలవుతారో అది వారి చేతుల్లోనే ఉంది’ అన్న డా. బాబా సాహెబ్ అంబేద్కర్ మాటలను ఈ ఎన్నికల వేళ మరోసారి గుర్తుకు తెచ్చుకోవాలి. కనుక రేపటి మన భవిష్యత్ మన చేతిలో ఉండాలన్నా, పాలకపక్షాన్ని నిలదీయాలన్నా ముందు మనం మన బాధ్యతగా ఓటు వేసి తీరాలి. ఓటు అనే రెండు అక్షరాలు దేశ భవిష్యత్‌కు పునాది. ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడ కొనసాగాలంటే స్వేచ్ఛగా, నిర్భయంగా పౌరులు ఎన్నికల క్రతువులో పాల్గొని ఓటుహక్కును వినియోగించుకోవాలి. అప్పుడే మన ప్రజాస్వామ్యం ఫలప్రదమవుతుంది.
నెక్కంటి అంత్రివేది (సామాజిక కార్యకర్త)