Vamshichand: మహబూబ్‌నగర్ ఎంపీగా అరుణమ్మ ఒక్కసారి గెలవకుంటే నష్టమేమీ లేదని, పాలమూర ప్రజలకు వచ్చే కష్టమేమీ లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అదే కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్‌ను గెలిపించకపోతే పాలమూరు భవిష్యత్తు గందరగోళంలో పడుతుందని తెలిపారు. కాంగ్రెస్ గెలిస్తేనే ముదిరాజులను బీసీ డీ నుంచి బీసీఏలోకి మార్చుకోవచ్చని, వాల్మీకి బోయలు ఎస్టీ జాబితాలో చేర్చాలన్నా, ఏబీసీడీ వర్గీకరణ చేపట్టాలన్నా కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డినే గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. వంశీచంద్ రెడ్డిని గెలిపిస్తే మహబూబ్‌నగర్ అభివృద్ధి బాధ్యతను తాను తీసుకుంటానని సీఎం చెప్పారు. మహబూబ్ నగర్ మక్తల్‌లో నిర్వహించిన జన జాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు.
తెలంగాణలో 68 శాతం కృష్ణా నదీ జలాలు ఉంటే అందులో 52 శాతం ఈ ప్రాంతం నుంచే నదిలో చేరుతాయని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. కళ్ల ముందు కష్ణమ్మ బిరబిరా పరుగులు పెడుతున్నా.. కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి ఇక్కడి ప్రజలదని అన్నారు. పదేళ్లు కేసీఆర్ అధికారంలో ఉండి పాలమూరుకు నీళ్లు గురించి ఏం చేయలేదని మండిపడ్డారు. పాలమూరు ఎత్తిపోతలను కేసీఆర్ తన ధన దాహానికి ఉపయోగించుకున్నారు తప్పా.. ఈ ప్రాంతానికి నీళ్లు ఇవ్వలేదని ఆగ్రహించారు. మక్తల్-నారాయణ-కొడంగల్ ఎత్తిపోతలను పూర్తి చేయలేదని తెలిపారు.
Also Read: త్వరలో.. బీఆర్ఎస్‌కు వీఆర్ఎస్
నరేంద్ర మోదీపైనా సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఢిల్లీ నుంచి మోదీ తెలంగాణపై దండయాత్రకు బయల్దేరితే.. ఆయనకు ఇక్కడి నుంచి ఇంటి దొంగలు మద్దతు ఇస్తూ కత్తి పట్టుకుని తిరుగుతున్నారని పరోక్షంగా డీకే అరుణపై విమర్శలు చేశారు. కాంగ్రెస్‌ను ఓడించాలని కుట్ర చేస్తున్నారని అన్నారు. అరుణమ్మను గెలిపిస్తే.. మాజీ ఎమ్మెల్యే మళ్లీ ఊర్ల మీద పడతాడని, ఇసుక దోపిడీకి పాల్పడుతాడని హెచ్చరించారు. బీజేపీ రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు రద్దు చేయాలని కుట్ర చేస్తున్నదని, బీజేపీకి వేసే ప్రతి ఓటు రిజర్వేషన్ల రద్దుకు మద్దతు ఇచ్చినట్టే అవుతుందని తెలిపారు. బీజేపీ మతాల మధ్య చిచ్చుపెట్టాలని చూస్తున్నదని ఆగ్రహించారు. మతాల మధ్య ఘర్షణలతో పెట్టుబడులు రావని, యువతకు ఉపాధి కరువవుతుందని అన్నారు. యూపీలో ఎంతో మంది రాజకీయ ఉద్ధండులు ఉన్నా అక్కడ పెట్టుబడులు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. ఇందుకు మతకలహాలు కారణం కాదా? అని అడిగారు. అరుణమ్మకు మొదటి నుంచి కాంగ్రెస్ అండగా నిలబడిందని, ఇప్పుడు నీడనిచ్చిన చెట్టునే నరకాలని ఢిల్లీ నుంచి గొడ్డలి పట్టుకుని బయల్దేరారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. అరుణమ్మను తాను పగబట్టలేదని, కాంగ్రెస్‌పైనే ఆమె పగబట్టిందని అన్నారు.
‘నేను మీరు.. వేర్వేరు కాదు. నేనే మీరు, మీరే నేను. ఈ ఎన్నికల్లో మన పాలమూరు ఆత్మగౌరవాన్ని గెలిపించుకుందాం. నా బలం మీరే, బలగం మీరే. నా ప్రాణం మీరే. నా చివరి రక్తపు బొట్టు వరకు పాలమూరు ప్రజలకు రుణపడి ఉంటాను. తెలంగాణ పౌరుషాన్ని, పాలమూరు పౌరుషాన్ని మోదీకి రుచి చూపించాలి’ అని రేవంత్ రెడ్డి అన్నారు.