Telangana: విజయశాంతి చేసిన ఓ ట్వీట్‌పై సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతున్నది. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు అభ్యంతరం తెలుపుతూ ట్వీట్ చేశారు. కిషన్ రెడ్డి బీఆర్ఎస్ పై ఘాటుగా విమర్శలు చేశారు. ఆ విమర్శలను ప్రస్తావిస్తూ రాములమ్మ కిషన్ రెడ్డిని టార్గెట్ చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ అనే పార్టీ ఇక ఉండదు అని అంటున్న కిషన్ రెడ్డి అభిప్రాయం సమంజసం కాదని పేర్కొన్నారు.
ప్రాంతీయ భావోద్వేగాలు, ప్రజా మనోభావాలను వారి ఆత్మాభిమానం వైపు నడిపిస్తూ జీవించడం దక్షిణాది ప్రజలు సహజ విధానం అని, అనాదిగా ఇలాగే వస్తున్నదని తెలిపారు. ఇది అర్థం చేసుకోవలని సూచించారు. దక్షిణాదిలో దశాబ్దాలుగా కరుణానిధి, ఎంజీఆర్, ఎన్టీఆర్, రామకృష్ణ హెగ్దే, జయలలితల నుంచి ఇప్పటి బీఆర్ఎస్, వైసీపీ వరకూ రాజకీయ పరిణామాలను విశ్లేషిస్తే సమాధానం లభిస్తుందని వివరించారు. ఇదే ఎప్పటికైనా వాస్తవం అని స్పష్టం చేశారు. ఈ దక్షిణాది స్వీయ గౌరవ అస్తిత్వ సత్యాన్ని కాంగ్రెస్ అర్థం చేసుకున్నట్టు బీజేపీ కనీసం ఆలోచన కూడా చేయలేదని విమర్శించారు. ఇది కిషన్ రెడ్డి ప్రకటనలో ప్రస్ఫుటమవుతున్నదని తెలిపారు.
ఈ ట్వీట్‌లో విజయశాంతి.. ఒక దక్షిణాది నాయకురాలిగా స్పందించారు. దక్షిణాది రాష్ట్రాల సంస్కృతిని, చరిత్రను రిప్రెజెంట్ చేస్తూ ట్వీట్ చేశారు. ప్రధాన లక్ష్యం కిషన్ రెడ్డి ఉన్నారు. కిషన్ రెడ్డి వ్యాఖ్యల్లోని తప్పిదాన్ని గుర్తిస్తూ అనివార్యంగా బీఆర్ఎస్ పార్టీని ప్రస్తావించాల్సి వచ్చింది. అదే సమయంలో ఆమె దక్షిణాది ప్రజలను కాంగ్రెస్ సరిగ్గా అర్థం చేసుకుందని కితాబిచ్చారు. దక్షిణాదిలో అస్తిత్వాన్ని ప్రకటించి ప్రాంతీయ పార్టీలు ఎప్పటికీ కొనసాగుతాయని సూచనప్రాయంగా చెబుతూనే ఇక్కడి పరిస్థితులను కాంగ్రెస్ సరిగ్గా ఆకళింపు చేసుకుందని, బీజేపీ మాత్రం ఈ దిశగా కనీసం ఆలోచనలు కూడా చేయడం లేదని ఫైర్ అయ్యారు.
Also Read: గాజా యుద్ధాన్ని కూడా ఆపాను
రాములమ్మ ట్వీట్ పై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. బీఆర్ఎస్ పార్టీని ప్రస్తావించడం మూలంగా.. మళ్లీ ఆమె బీఆర్ఎస్‌లోకి వెళ్లుతున్నారా? అని ప్రశ్నిస్తున్నారు. కొందరు బీఆర్ఎస్ అభిమానులైతే ఆమె గులాబీ గూటికి రావాలని కోరారు. ఇక బీజేపీ అనుకూలురు ఆమె వ్యాఖ్యలను విమర్శిస్తున్నారు. విజయశాంతి చేసిన వ్యాఖ్యల్లో తప్పేమీ లేదని, ఆమె లేవనెత్తిన విషయాలను బీజేపీ అర్థం చేసుకుంటే మంచిదనే రీతిలో కాంగ్రెస్ శ్రేణులు ట్వీట్లు పెడుతున్నాయి.
1998లో రాజకీయాల్లోకి వచ్చిన విజయశాంతి తొలుత బీజేపీలో చేరారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తల్లి తెలంగాణ పార్టీని స్థాపించారు. ఉద్యమం తీవ్రరూపం దాలుస్తున్న సమయంలో పార్టీని టీఆర్ఎస్‌లో విలీనం చేశారు. టీఆర్ఎస్ పార్టీ టికెట్ పై మెదక్ నుంచి ఎంపీగానూ గెలిచారు. ఆ తర్వాత 2020లో బీజేపీలో చేరిన ఆమె పార్టీలోని అంతర్గత రాజకీయాలతో మనలేకపోయారు. కాంగ్రెస్ కార్యక్రమాలు, ఉద్దేశాలను పరిశీలించి ప్రజా సేవలకు ఇదే సరైన పార్టీ అని నిర్ణయించుకుని హస్తం గూటిలో చేరారు.