– కీలక స్థానాల్లో సొంత మనుషుల నియామకం
– పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆశీస్సులతోనే వీసీ కుర్చీ?
– పీహెచ్‌డీ అడ్మిషన్లు, టీచింగ్ స్టాఫ్ బదిలీల్లో అక్రమాలు
– అవినీతి, అక్రమాలపై విచారణకు రంగం సిద్ధం
– కాకతీయ వీసీపై విచారణపై విద్యార్థి సంఘాల హర్షం
Vigilance Enquiry On Disputes Vice Chancellor: వివాదాలకు కేరాఫ్‌గా మారిన కాకతీయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ తాటికొండ రమేష్ మీద విజిలెన్స్ విచారణకు తెలంగాణ ప్రభుత్వం శనివారం ఆదేశించింది. అవినీతి, ఆశ్రిత పక్షపాతం, నిరంకుశ ధోరణి ఆరోపణలు ఎదుర్కొంటూ చాలాకాలంగా అనేక వివాదాలకు కేంద్రబిందువుగా నిలిచిన వీసీ వైఖరిపై వర్సిటీలోని విద్యార్థి సంఘాలు, సిబ్బంది యూనియన్లు గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటి నుంచే గవర్నర్, మంత్రులు, విపక్ష నేతలకు ఫిర్యాదులు చేస్తూ వచ్చాయి. అయినా, వీసీ పనితీరు, వైఖరిలో ఎలాంటి మార్పు రాకపోగా, కేంపస్‌లో వాతావరణం దెబ్బతింటూ పోవటంతో తాజాగా ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది.
ఆదినుంచి వివాదాలే..
2021, మే 21న రమేష్ కాకతీయ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్‌గా నియమితులయ్యారు. నాటి నుంచి యూనివర్సిటీలోని రిజిస్టార్, అసిస్టెంట్ రిజిస్టార్లను, రిటైర్డ్ ప్రొఫెసర్లను తనకు అనుకూలమైన స్థానాల్లో, ముఖ్యమైన పోస్టుల్లో పెట్టి అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణను విద్యార్థి సంఘాలు ఆదినుంచీ చేస్తూ వచ్చాయి. యూనివర్సిటీలో కీలకమైన నాలుగు కార్యాలయాలకు కిష్టయ్య ఒక్కడినే అసిస్టెంట్ రిజిస్ట్రార్‌గా వీసీ రమేష్ నియమించారనే ఆరోపణలున్నాయి. న్యాక్ నిధులతో వర్సిటీలోని రోడ్లు, హాస్టళ్లు, ఇతర బిల్డింగ్‌ల కోసం రూ.10 కోట్లు కేటాయించారు. వీటిలో కమీషన్ల కోసమే బిల్డింగ్ డివిజన్, పబ్లికేషన్స్ సెల్, హాస్టల్ ఆఫీస్‌తోపాటు యూనివర్సిటీ ఆడిట్ ఆఫీస్‌కు కూడా కిష్టయ్యనే అసిస్టెంట్ రిజిస్ట్రార్‌గా నియమించారు. ఇవిగాక, ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల విద్యార్థుల ట్యూషన్ ఫీజులు, ఇతర రుసుముల స్వీకరణలో జరిగిన రూ.3 కోట్ల కుంభకోణంపై ఏఆర్ కిష్టయ్య, ప్రిన్సిపాల్ బన్నా అయిలయ్యపై కమిటీ విచారణ చేస్తున్న సయమంలోనే వీసీ రమేష్.. కిష్టయ్యను యూనివర్సిటీ క్యాంపస్‌కు మార్చారు. న్యాక్ కోసం కేటాయించిన రూ.10 కోట్ల బిల్లుల్లో చేతివాటం కోసమే కిష్టయ్యను క్యాంపస్‌కు వీసీ బదిలీ చేయించారని గతంలో ఆరోపణలూ వచ్చాయి. గత జనవరిలో వర్సిటీ ఆడిట్ విభాగంలో అసిస్టెంట్ రిజిస్ట్రార్‌గా ఉన్న కిష్టయ్య ఓ పాల కాంట్రాక్టర్ నుంచి శుక్రవారం రూ.50వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. వర్సిటీ హాస్టళ్లకు పాలు సరఫరా చేసే దానిలోనే లంచాలు డిమాండ్ చేయగా, కీలక అభివృద్ధి పనుల విషయంలో ఎంత అవినీతి జరిగిందోనని విద్యార్థి సంఘాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. కిష్టయ్య పాల్పడిన ప్రతి అవినీతి వెనక వీసీ రమేష్ హస్తముందని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి.
అక్రమాలకు కేరాఫ్..
కాకతీయ విశ్వవిద్యాలయం వీసీగా రమేష్ నియామకమే దొడ్డి దారిన జరిగిందని, ఇందులో నాటి బీఆర్ఎస్ పెద్దల హస్తం ఉందనేది కేంపస్‌లో అందరికీ తెలిసిన సత్యమే. రమేష్ ఎక్కువ అనుభవం, అర్హత ఉన్న ఎందరో అధ్యాపకులుండగా, వీసీ పదవి రమేష్‌నే వరించటం వెనక కూడా రాజకీయ ప్రోద్బలం ఉందని, బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి ఆశీస్సులతో రమేష్ నేరుగా వీసీగా నియమితులయ్యారని వారు చెబుతున్నారు. ఈయన వీసీ కాగానే అక్రమంగా సిబ్బందిని బదిలీ చేయటం, గతంలో తొలగించిన అధ్యాపకులను తిరిగి విధుల్లోకి చేర్చుకోవటం, నకిలీ ప్రాజెక్టుల ఆమోదంపై వంటి అనేక నిర్ణయాలు చకచకా జరిగిపోవటం వెనక స్పష్టమైన ప్రణాళికే ఉందని వర్సిటీ వర్గాలు ఆదినుంచీ అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. అవినీతి ఆరోపణలు చేశాయి. పీహెచ్‌డీ అడ్మిషన్ల వ్యవహారంలోనూ ఆయన తన అనుకూలమైన వారికే సీటు ఇప్పించారనీ, ఇందులోనూ అవినీతి జరిగిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ విషయంలో విద్యార్థి సంఘాలు 2 నెలల పాటు తీవ్ర నిరసనలు, ఆందోళనలు చేశాయి. వీరి ఆందోళనకు అప్పటి ప్రతిపక్ష పార్టీ నేతలు రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి, సహా అనేక రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు సంఘీభావం తెలిపారు.
ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించి, వీసీ రమేష్ మీద విజిలెన్స్ విచారణ జరపాలని నిర్ణయించింది. ఆయనపై వచ్చిన ఆరోపణల మీద విచారణ చేసి, తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. దీనిపై విద్యార్థి, బోధన, బోధనేతర సిబ్బంది యూనియన్లు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. తీగ లాగితే డొంక కదిలినట్లు యూనివర్సిటీ వ్యవహారాలపై విజిలెన్స్ విచారణతో మరిన్ని అక్రమాలు బయటపడే అవకాశమందని ఈ వర్గాలు భావిస్తున్నాయి.