Vigilance DG: రాష్ట్ర పోలీసు శాఖలో ఉగాది పర్వదినాన విషాదచాయలు ఏర్పడ్డాయి. సీనియర్ ఐపీఎస్ అధికారి, విజిలెన్స్ డీజీ రాజీవ్ రతన్ గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. మంగళవారం ఉదయం ఆయనకు ఛాతి నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఏఐజీ హాస్పిటల్‌కు తరలించారు. కానీ, చికిత్స పొందుతూనే పరిస్థితులు విషమించి ఆయన కన్నుమూశారు.
ఆయన మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి రాజీవ్ రతన్ మరణంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ఆయన అందించిన విశిష్ట సేవలను గుర్తు చేశారు. నిజాయితీగా, సమర్థంగా రాష్ట్రానికి సేవలు అందించిన అధికారులను తెలంగాణ సమాజం ఎన్నటికీ మరిచిపోదని అన్నారు. రాజీవ్ రతన్ మరణానికి సంతాపం తెలిపిన సీఎం.. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Also Read: ప్రశాంత్ కిశోర్ ఇలా అయిపోయాడేంటీ?
రాజీవ్ రతన్ ప్రస్తుతం తెలంగాణ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ జనరల్‌గా పని చేస్తున్నారు. 1991 ఐపీఎస్ బ్యాంచ్‌కు చెందిన రాజీవ్ రతన్‌కు పోలీసు శాఖలో మంచి పేరు ఉన్నది. సమర్థవంతమైన అధికారిగా ప్రశంసలు అందుకున్నారు. ఇటీవల మేడిగడ్డ ప్రాజెక్టుపై ప్రభుత్వం నియమించిన విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విచారణ కమిటీకి ఆయనే సారథిగా వ్యవహరించారు.
అంతేకాదు, గతంలో కరీంనగర్ ఎస్పీగా, ఫైర్ సర్వీసెస్ డీజీగానూ పని చేశారు. హైదరాబాద్ రీజియన్ ఐజీగా, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీగానూ పలుహోదాల్లో పని చేశారు. గతేడాది డీజీగా మహేందర్ రెడ్డి పదవీ విరమణ చేసినప్పుడు ఆ పదవి కోసం అధికారుల ఎంపిక జరుగుతుండగా రాజీవ్ రతన్ పేరు కూడా వినిపించింది. అయితే.. ఆయనను డీజీపీగా నియమించకున్నా.. విజిలెన్స్ డీజీగా ప్రమోషన్ పొందారు.