– కేసీఆర్ బస్సు పైన గులాబీ.. లోపల కాషాయం
– మోదీతో కలిసి నాటకాలు చేస్తున్నారు
– కారు ఎప్పుడో షెడ్డుకు వెళ్లింది
– బస్సు టైర్లు పంక్చర్ కాకుండా చూసుకోండి
– కేసీఆర్‌పై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆగ్రహం
MLA Adi Srinivas on KCR(Telangana politics) : రాష్ట్ర ప్రజలకు మాజీ సీఎం కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. కేసీఆర్ బస్సు యాత్ర చేపట్టిన నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వంద ఎలుకలను తిన్న పిల్లి తీర్థయాత్రలకు బయలుదేరినట్టుగా కేసీఆర్ బస్సు యాత్ర మొదలుపెట్టారని విమర్శించారు. పదేళ్ల పాపాలకు ప్రాయశ్చిత్తంగా ప్రజల వద్దరకు బయలురేరారని సెటైర్లు వేశారు. అధికార మదంతో పదేళ్లు ప్రగతి భవన్, ఫాంహౌస్ గేట్లు దాటనందుకు చేతులు జోడించి ప్రజలను క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా సంబండ వర్గాలను మోసం చేసినందుకు వారి పాదాల మీద పడాలన్నారు. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు తప్ప పదేళ్లలో ఏ నాడు జిల్లా పర్యటనలకు వెళ్లని కేసీఆర్‌కు ఇప్పుడు జనం గుర్తుకు వచ్చారా అని అడిగారు ఆది శ్రీనివాస్. ఓట్లతో జనం వాతలు పెడితే తప్ప వారు యాదికి రాలేదా అని ప్రశ్నించారు. ఓడించి ఇంట్లో కూర్చో పెడితే తప్ప సమస్యలు కళ్లకు కనిపించలేదని, ప్రజాపాలన చూసి ఓర్వలేక జనాన్ని రెచ్చగొట్టడానికి చేతి కర్ర పట్టుకుని మరీ బస్సు ఎక్కారంటూ చురకలంటించారు.
అమలవుతున్న గ్యారెంటీలు, నిమిషం కూడా ఆగని కరెంటు, ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్న తెలంగాణ ఆడబిడ్డలను కళ్లతో చూడు అంటూ హితవు పలికారు. ‘‘500 వందలకు గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 10 లక్షల ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు, కళకళలాడుతున్న స్వయం సహాయక మహిళలను పలుకరించు. నీ ఐదేళ్ల కాలంలో రుణమాఫీ కాని రైతులతో మాట్లాడు. పదేళ్లలో డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం ఎదురుచూసిన జనాన్ని కలువు. దళిత బంధు పేరుతో దగా చేసిన దళిత బిడ్డలను పలుకరించు. బీసీ బంధు అంటూ పచ్చి మోసం చేసిన బడుగు బలహీన వర్గాలతో మాట్లాడు. గొర్రెల పేరుతో మోసం చేసిన యాదవ సోదరులను, చేపల పేరుతో దగా చేసిన బెస్త, ముదిరాజ్ బిడ్డలను పలుకరించు. ఫీజు రీఎంబర్స్ మెంట్ రాని విద్యార్థులు, ఉద్యోగాలు రాని నిరుద్యోగులను కలువు. కూలిన మేడిగడ్డను చూడు. అవినీతి కంపు కొడుతున్న మిషన్ భగీరథ నీళ్లు తాగు. తెలంగాణ ప్రజలకు కూతురు లిక్కర్ స్టోరీ చెప్పు. కొడుకు ట్యాపింగ్ కథలు వినిపించు. అల్లుడు ఫాంహౌస్, సంతోష్ కబ్జా వ్యవహారాలు, మీ గులాబీ పార్టీ నాయకుల అక్రమాలను బస్సు యాత్రలో వివరించు’’ అంటూ కేసీఆర్‌పై సెటైర్లు వేశారు ఆది శ్రీనివాస్.
బస్సు యాత్ర చేయడానికి సిగ్గుండాలని, అధికారంలో ఉన్నపుడు తిరగడానికి బస్సే దొరకలేదా? అని అడిగారు. తెలంగాణలో ఉనికి కాపాడుకోవడానికి కపట బుద్ధితో ఇప్పుడు యాత్ర అంటూ బయలుదేరారని మండిపడ్డారు. ‘‘సచ్చిన పార్టీని బతికించుకోవడానికే నీ ఆరాటం అని ప్రజలకు తెలుసు. ఎంపీ ఎన్నికల్లో ఒకటో అరో సీట్లు గెలిపించుకోవడానికే నీ బస్సు బయలుదేరిందని తెలంగాణ జనానికి బాగా తెలుసు. కేసీఆర్, నీ బస్సు లోపల కాషాయం, పైకి మాత్రం గులాబీ రంగు. నీవి పచ్చి ఊసరవెల్లి రాజకీయాలు.
బీజీపీతో కుమ్మక్కై కాంగ్రెస్‌ను ఓడించాలన్నదే నీ ఆరాటం. కేసీఆర్, మోదీ తెరచాటు రాజకీయాలు తెలంగాణ ప్రజలకు బాగా తెలుసు. అసెంబ్లీ ఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెట్టినా మీకు సిగ్గు రాలేదు. కేసీఆర్, నీ బస్సు టైర్లకు జనం పంక్చర్ చేసి పంపిస్తారు జాగ్రత్త. నీ కారును అసెంబ్లీ ఎన్నికల్లో జనం షెడ్డుకు పంపించారు మరిచిపోకు. నీ గులాబీ కమలం బస్సు యాత్ర పైన జనం రాళ్లు వేయకుండా చూసుకో. ఎంపీ ఎన్నికల తర్వాత కేసీఆర్ బస్సు ఫాంహౌస్ గేట్ కూడా దాటదన్న విషయాన్ని తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి’’ అని అన్నారు ఆది శ్రీనివాస్.