Uttam Kumar Reddy
తెలంగాణ

Uttam Kumar Reddy | ఉర్సు ఉత్సవాల్లో మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన

నల్లగొండ బ్యూరో, స్వేచ్ఛ : జాన్‌పహాడ్ జవహర్ ఎత్తిపోతల పథకం సామర్ధ్యం పెంచనున్నామని తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) వెల్లడించారు. హుజుర్‌నగర్ నియోజకవర్గం పాలకీడు మండలం జానపహాడ్ దర్గా ఉర్సు ఉత్సవాల్లో పాల్గొనేందుకు హాజరైన మంత్రి ఉత్తమ్ అనంతరం జరిగిన బహిరంగ సమావేశంలో మాట్లాడారు. ప్రస్తుతం 5,650 ఎకరాల సామర్ధ్యంతో రూపొందించిన ఈ ఎత్తిపోతల పథకం సామర్థ్యాన్ని 10 వేల ఎకరాలకు పెంచనున్నామన్నారు. బెట్టే తండా ఎత్తిపోతల పథకానికి రూ.33 కోట్లు మంజూరు చేయడంతో పాటు జాన్‌పహాడ్ హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి రూ.390 కోట్లు మంజూరు చేశామని తెలిపారు.

మారుమూల ప్రాంతాల రహదారుల నిర్మాణంతో పాటు అంతర్గత రహదారుల నిర్మాణానికి ప్రాధాన్యతనిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. అందులో భాగంగానే బెట్టే తండా నుంచి శూన్యపహాడ్ వరకు రూ.3.5 కోట్ల పంచాయతీ రాజ్ నిధులతో రహదారి నిర్మిస్తున్నామన్నారు. గరిడేపల్లి-అలింగాపూర్ వయా మఠంపల్లి మీదుగా రూ.30 కోట్ల ఆర్ అండ్ బీ నిధులతో డబుల్ రోడ్డు, పాలకీడు-ఆలింగపూర్ డబుల్ రోడ్డుకు రూ.2 కోట్లు, మూసీఒడ్డు నుంచి సింగారం వరకు రూ.1.8 కోట్లు, రాఘవపురం నుంచి అలింగాపురం ఎత్తిపోతల పధకం వరకు కోటి రూపాయలతో మెటల్ రోడ్ నిర్మాణంతో పాటు రూ.7.80 కోట్లతో కొత్తగా ఏర్పాటైన పాలకీడు మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం, రూ.1.40 కోట్లతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మిస్తున్నట్లు ఉత్తమ్ తెలిపారు.

జాన్‌పహాడ్ ఉర్సు షురూ..

జానపహాడ్ దర్గా హిందూ, ముస్లింల ఆరాధ్య దైవం అని, మత సామరస్యానికి ప్రతీక అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) అన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం జాన్ పహాడ్ సైదులు బాబా దర్గా ఉర్సు ఉత్సవాల ప్రధాన ఘట్టం అయిన గంధం ఊరేగింపు కార్యక్రమంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డితో కలిసి మంత్రి ఉత్తమ్ ముజావర్ జానీ బాబా ఇంటి వద్ద నుంచి సందల్ ఖానా వరకు పవిత్ర గంధాన్ని ఎత్తుకుని ఉరేగింపులో పాల్గొన్నారు. అనంతరం దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

అనంతరం స్థానిక నాయకులు ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. జాన్ పహాడ్ సైదులు బాబాను దర్శించుకోవడం నా అదృష్టం అన్నారు. మత సామరస్యానికి ప్రతీక ఈ జాన్ పహాడ్ దర్గా అని, ముస్లిం లతో పాటు హిందువులు కూడా అదే స్థాయిలో దర్శించుకుంటారన్నారు. ప్రజలందరూ పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని ప్రార్డించానని, మరోసారి ప్రజలకు సేవ చేసే అవకాశం మా ప్రభుత్వానికి అవకాశం ఇవ్వాలని ప్రార్ధించానని తెలిపారు. పాలకవీడు మండలంలో ఒక్క సంవత్సరంలోనే రూ.400 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టానని, జాన్ పహాడ్ లో రూ.1.30 కోట్లతో రోడ్లు, టాయిలెట్లు లాంటి ఎన్నో మౌళిక వసతులు ఏర్పాటు చేశామని తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనివాసులు, డీఎస్పీ శ్రీధర్ రెడ్డి, నేరేడుచర్ల మార్కెట్ కమిటీ చైర్మన్ బెల్లకొండ విజయలక్ష్మినర్సింహారావు, వక్ఫ్ బోర్డు చైర్మన్ అజ్మతుల్లా హుస్సేని, మాజీ ఎంపిపి గోపాల్, జడ్పీటీసీ మోటిలాల్, ముజవర్ జానీ బాబా, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.