Friday, November 8, 2024

Exclusive

PM Modi: ఫెడరల్ స్ఫూర్తికి తూట్లు పొడుస్తున్న కేంద్రం..

Federal: ‘మన గుజరాత్ కేంద్రానికి ఏటా రూ. 60 వేల కోట్లు పన్నుల రూపంలో పంపుతోంది. కానీ, బదులుగా మనకు కేంద్రం ఇచ్చే పన్నుల వాటా మాత్రం 8 నుంచి 12 వేల కోట్ల రూపాయలే. ఇలాగైతే మనం రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుంది. గుజరాతీలు ఏమైనా అడుక్కుతినే వాళ్లా? ఢిల్లీ పాలకుల ముందు భిక్షాపాత్ర పట్టుకుని నిధులివ్వాలని మనం వారిని వేడుకోవాలా?’ అంటూ 2008లో నాటి గుజరాత్ సీఎం హోదాలో నరేంద్ర మోదీ నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ మీద నిప్పులు చెరిగారు. అయితే, 2024 ఫిబ్రవరి 7వ తేదీన తమ రాష్ట్రాలకు నిధుల విషయంలో అన్యాయంగా జరిగిందన్న కర్ణాటక కాంగ్రెస్ ఎంపీ డీ.కే సురేష్ వాదనపై ప్రధాని నరేంద్ర మోదీ రాజ్యసభలో మండి పడ్డారు. ‘మా పన్నులు.. మా డబ్బు అంటున్నారు. అసలు ఇదేం భాష. ప్రభుత్వ నిధుల విషయంలో విభజన రాజకీయాలు ప్రమాదకరం. జాతీయ నిధులపై రాష్ట్రాలు రాజకీయం చేయడం సరికాదు’ అంటూ గొప్ప ప్రవచనం ఇచ్చారు. సమస్య తనదైనప్పుడు ఒకలా.. అదే ఇబ్బంది వేరొకరిదైతే రూటు మార్చే ప్రధాని మోదీ వైఖరికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే.

2001 – 2014 మధ్యకాలంలో గుజరాత్ సీఎంగా ఉన్న మోదీ, 2014లో దేశానికి ప్రధాని అయ్యారు. నాటి నుంచి నిధుల బదిలీ విషయంలో ఆయన విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలతో బాటు ఎన్డీయే కూటమిలోని ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల నిధుల విషయంలోనూ వివక్ష చూపుతూ వచ్చారు. ఆయన హయాంలో ప్లానింగ్ కమిషన్ రద్దు, నీతి ఆయోగ్ ఏర్పాటు వంటి నిర్ణయాల్లో అఖిలపక్ష సమావేశాలు నిర్వహించకుండానే నిర్ణయాలు జరిగిపోయాయి. ఈ పదేళ్ల కాలంలో దేశ ఆర్థిక ప్రగతిని పట్టాలెక్కించేందుకు మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఏమీ చేయలేకపోయింది. అయితేనేం.. విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలను ఆర్థిక చక్రబంధంలో ఇరికించి, అక్కడి అభివృద్ధిని అడ్డుకుంటూ, అక్కడికి పెట్టుబడులు పెట్టేందుకు బడా పారిశ్రామికవేత్తలెవరినీ రాకుండా చేసే కళలో ఈ ప్రభుత్వం ఆరితేరింది. అంతేకాదు.. సదరు విపక్ష రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల వేళ.. అక్కడి పాలకులు ఏమీ చేయటం లేదని ఆరోపించటం దేశ ప్రధానికి ఒక అలవాటుగా మారింది.

కేరళలో వామపక్ష ఫ్రంట్, తమిళనాడులో డిఎంకె, బెంగాల్‌లో మమతా బెనర్జీ నేతృత్వంలో తృణమూల్ కాంగ్రెస్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలలో కాంగ్రెస్, జార్ఖండ్ రాష్ట్రంలో జెఎంఎం సంకీర్ణం.. ఇలా ప్రతి విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో కేంద్ర పాలకులు ఇలాంటి వ్యూహాలనే అమలు చేస్తూ వచ్చారు. ఒకవైపు పన్నుల వాటాలో తమకు అన్యాయం జరుగుతోందని ఈ రాష్ట్రాలు పదేపదే మొత్తుకుంటుంటే.. ఆర్ధిక సంఘం సిఫార్సుల మేరకే రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తున్నామని, ఇందులో ఎలాంటి వివక్షకు తావులేదని, తమ ప్రమేయం కూడా ఏమీ ఉండదనే పాటను కేంద్రం పదేళ్ల నుంచీ పాడుతూనే ఉంది. అయితే, విపక్ష, స్వపక్ష రాష్ట్రాలకు చేసే కేటాయింపుల గణాంకాలు మాత్రం వీరి కునీతిని బయటపెడుతూనే వచ్చాయి. పన్నుల పంపిణీ, సహాయ నిధులు ఇవ్వకుండా కేంద్రం ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తోందంటూ గత ఫిబ్రవరిలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, కేరళ సీఎం పినరయి విజయన్ ఢిల్లీలో ఆందోళనకు దిగి ఇదే మాట అడిగినా, కేంద్రం కనీసం వారిని పిలిచి మాట్లాడే ప్రయత్నమూ చేయలేదు.

రాష్ట్రాలు అప్పుల ప్రస్తావన తెచ్చినప్పుడల్లా కేంద్రం ఎఫ్‌ఆర్‌బీఎం (ఫైనాన్షియల్‌ రెస్పాన్సిబిలిటీ అండ్‌ బడ్జెట్‌ మేనేజ్‌మెంట్‌) చట్టాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అప్పులను నియంత్రించే లక్ష్యంతో 2003లో ఈ చట్టం తెచ్చారు. కేంద్ర, రాష్ర్టాల ఆదాయ, వ్యయాలు, అప్పులు పారదర్శకంగా జరిగేలా చూడటం దీని లక్ష్యం. రెవెన్యూ లోటు, ద్రవ్యలోటు, ప్రాథమిక లోటు, పన్నులు, పన్నేతర ఆదాయలోటు ఏ స్థాయిలో ఉండాలో లక్ష్యాలు పెట్టారు. ముఖ్యంగా రాష్ర్టాలు తీసుకొనే రుణాలను కేంద్రం నియంత్రణలోకి తెచ్చారు. ఈ చట్టం అమల్లోకి వచ్చిన తొలి 5 ఏళ్ల నాటికి (2008-09) రెవెన్యూ లోటు (ఆదాయం, ఖర్చు సమానంగా ఉండే స్థితి)కి సున్నాకి తీసుకురావాలని, ద్రవ్యలోటును 3 శాతానికి తగ్గించాలని, జీడీపీలో అప్పులను 9.5 శాతానికి తీసుకురావాలని నిర్ణయించారు. అయితే 2009 నాటికి ఈ లక్ష్యాలను చేరుకోలేకపోయారు. దీంతో చట్టంలో మార్పులు చేసి మొదట 2012 వరకు, ఆ తర్వాత 2015 వరకు పొడిగించినా రెవెన్యూలోటు మాత్రం జీరో కాకపోగా, అంతకంతకూ పెరుగుతూనే వచ్చింది. అయితే నాటి యూపీఏ ప్రభుత్వం ఇష్టారీతిన అప్పులు చేయకుండా నియంత్రణ పాటించింది. ప్రభుత్వ బాండ్లను ఆర్బీఐ కొనుగోలు చేయడం నిషేధించటం ద్వారా ఆర్‌బీఐ వద్ద ఉన్న నిధులపై ఎలాంటి ప్రభావం పడకుండా చూడగలిగింది.

Also Read: పైకి గులాబీ.. లోన కమలం

మోదీ ప్రధాని అయ్యాక ఎఫ్‌ఆర్బీఎం చట్టంలో మార్పుల కోసం కేంద్రం 2016లో ఎన్.కె సింగ్‌ కమిటీని నియమించింది. ఈ కమిటీ ద్రవ్యలోటును 2020 మార్చి 31 నాటికి 3 శాతానికి తగ్గించాలని, 2021 నాటికి 2.8 శాతానికి, 2023 నాటికి 2.5 శాతానికి తగ్గించాలని నిర్దేశించింది. రెవెన్యూ లోటును 0.8 శాతానికి తగ్గించాలని స్పష్టంచేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రుణాలు కలిపి జీడీపీలో 60% (కేంద్ర రుణాలు 40%, రాష్ర్టాల రుణాలు 20%) మించకూడదని స్పష్టంచేసింది. 2017 నాటికి రుణాలు జీడీపీలో 70 శాతంగా ఉన్నాయి. ఈ మేరకు కేంద్రం 2018లో ఎఫ్‌ఆర్బీఎం చట్టంలో మార్పులు చేసింది. ఈ మార్పు ప్రకారం.. కేంద్రం ద్రవ్యలోటు లక్ష్యాలను 0.5% సవరించుకోవచ్చు. పైగా.. ప్రభుత్వ బాండ్ల వేలంలో ఆర్బీఐ నేరుగా పాల్గొని, కొనుగోలు చేయొచ్చు. తద్వారా ఆర్బీఐ వద్ద ఉన్న నిల్వలను కేంద్రం తన ఇష్టారీతిన వాడుకొనేందుకు అవకాశమిచ్చింది. ఎఫ్‌ఆర్బీఎం చట్టంలో తనకు అనుకూలంగా చేర్చిన నిబంధనను కేంద్రం 2020 నుంచి అమల్లోకి తెచ్చింది. 2020 నాటికి ద్రవ్యలోటును 3%కి తగ్గించాల్సి ఉండగా దానిని 3.8 శాతానికి పెంచింది. 2021 నాటికి ద్రవ్యలోటు లక్ష్యం 2.8% కాగా.. 3.5%కి పెంచుకొన్నది. ఈ లక్ష్యాన్నీ చేరుకోలేదు సరికదా.. మరోసారి 2026 దాకా పొడిగించుకుంది. ఈ ఆర్థిక నిర్వహణను బట్టి కేంద్రం ఎప్పటికీ తాను అనుకొన్న లక్ష్యాలను చేరలేదని అర్థమవుతోంది.

మరోవైపు అదే సమయంలో తమ రాష్ట్రాల్లోని అభివృద్ధి పథకాల కోసం రాష్ట్రాలు తీసుకునే అప్పుల విషయంలో ఎఫ్‌ఆర్‌బీఎం షరతులు పెట్టి రాష్ట్రాల చేతులు కట్టేస్తు్న్నారు. ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం తేవడంతో రుణ పరిమితిని పెంచుకొనే స్వేచ్ఛ రాష్ర్టాలకు లేకుండా పోయింది. రూపాయి అదనంగా తీసుకోవాలన్నా అనుమతి కోసం కేంద్రం వద్ద అడుక్కోవాల్సిన పరిస్థితి. ఒకవైపు తనకు నిధులు కావాలన్నప్పుడు ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిని ఎంత మేరకు పెంచుకోవాలో నిర్ణయించుకుని, ఫైనాన్స్ బిల్లు రూపంలో పార్లమెంటులో పెట్టి ఆమోదించుకుంటూ, రాష్ట్రాల దగ్గరకొచ్చే సరికి తాను చెప్పిన సంస్కరణలు అమలు చేస్తేనే అదనపు రుణానికి అవకాశం ఇస్తామనే షరతులను కేంద్రం ముందుకు తీసుకొస్తోంది. చివరకు కొవిడ్ సమయంలో చేతిలో చిల్లిగవ్వ లేదని రాష్ట్రాలు గగ్గోలు పెట్టినా, కేంద్ర పాలకుల గుండె కరగలేదు.

మరోవైపు.. రాష్ర్టాలు మూలధన వ్యయం కోసం కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న రుణాలను బడ్జెటేతర అప్పులుగా పరిగణించి, వాటిని రాష్ట్ర రుణాల్లో కలిపేయటం కూడా రాష్ట్రాలకు తలనొప్పిగా మారింది. ఉదాహరణకు తెలంగాణ ప్రభుత్వం గతంలో కాళేశ్వరం ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌ కార్పొరేషన్‌, తెలంగాణ డ్రింకింగ్‌ వాటర్‌ సప్లయ్‌ కార్పొరేషన్‌, తెలంగాణ స్టేట్‌ వాటర్‌ రిసోర్సెస్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ద్వారా నిధులు సేకరించి, ఆ ప్రాజెక్టుల పనులు చేపట్టింది. అయితే, ఈ పనులు పూర్తయిన తర్వాత.. వాటిమీద వచ్చే ఆదాయం లేదా ఆ ప్రాజెక్టు వల్ల పరోక్షంగా రాష్ట్ర ఖజానాకు ఆదాయం సమకూరితే గానీ రాష్ట్ర ప్రభుత్వం దానికోసం తెచ్చిన అప్పును తీర్చటం సాధ్యం కాదు. అయితే, కేంద్ర ప్రభుత్వం మాత్రం నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ అప్పులు తీసుకుంటుంటే మౌనంగా ఉండి, ఆ ప్రాజెక్టులపై పావలా ఆదాయం లేదని తెలిసినా, వాటన్నిటినీ రాష్ట్రపు అప్పుల్లో కలిపి లెక్కగట్టింది. దురదృష్టవశాత్తూ గత తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రాజెక్టులు సఫలం కాకపోగా, భారీ ఖర్చు పెట్టి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ఉనికే నేడు ప్రశ్నార్థకంగా మారింది. దీంతో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నేడు ఆర్థికంగా గడ్డు పరిస్థితిని ఎదుర్కోవాల్సిన దుస్థితి ఎదురైంది.

దేశమంటే.. రాష్ట్రాల సమాహారమనే వాస్తవాన్ని విస్మరిస్తూ, రాజ్యాంగపు ఫెడరల్ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్రాలకు నిధులు, పన్నుల వాటాల బదలాయింపులో కేంద్రం చూపుతున్న తీవ్ర వివక్షను, నిరంకుశ వైఖరిని తెలంగాణ సమాజం తిరస్కరించాల్సిన సమయం వచ్చింది. కేంద్రంలోని పాలకులు రాజకీయ ప్రయోజనాల కోసం దేశ ప్రయోజనాలను దెబ్బతీస్తున్న తీరును, వారి సంకుచిత విధానాల గురించి ఈ లోక్‌సభ ఎన్నికల వేళ మేధావులు, విద్యావంతులు కళ్లముందు జరుగుతున్న ఈ అన్యాయాన్ని ఎలుగెత్తి చాటాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

నెక్కంటి అంత్రివేది
సామాజిక కార్యకర్త
92480 24498

Publisher : Swetcha Daily

Latest

Pawan Kalyan: మనం OG అంటే.. ప్రజలు ‘క్యాజీ’ అంటారు

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పు రావడం వెనుక కీలక పాత్ర...

CM Revanth Reddy: రాజకీయాలకు అతీతం… అభివృద్దే మా లక్ష్యం

- బిజీబిజీగా సీఎం హస్తిన పర్యటన - ప్రధానిని కలిసిన సీఎం రేవంత్,...

CM Revanth Reddy: కేసీఆర్‌పై ప్రేమ తగ్గలేదా?

- కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహించినప్పుడు ఈటల ఏం చేశారు? - ఆయనపై ఇంకా...

Amrapali Kata: ఆమ్రపాలి ఆకస్మిక తనిఖీలు

GHMC: మంత్రులు, ఉన్నతాధికారులు, వివిధ శాఖల బాధ్యులు పనిపై శ్రద్ధ పెంచాలని,...

Telangana BJP: ఇద్దరు సీఎంలు కలవాలనే కోరుకుంటున్నాం.. కానీ!?

NVSS Prabhakar: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్...

Don't miss

Pawan Kalyan: మనం OG అంటే.. ప్రజలు ‘క్యాజీ’ అంటారు

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పు రావడం వెనుక కీలక పాత్ర...

CM Revanth Reddy: రాజకీయాలకు అతీతం… అభివృద్దే మా లక్ష్యం

- బిజీబిజీగా సీఎం హస్తిన పర్యటన - ప్రధానిని కలిసిన సీఎం రేవంత్,...

CM Revanth Reddy: కేసీఆర్‌పై ప్రేమ తగ్గలేదా?

- కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహించినప్పుడు ఈటల ఏం చేశారు? - ఆయనపై ఇంకా...

Amrapali Kata: ఆమ్రపాలి ఆకస్మిక తనిఖీలు

GHMC: మంత్రులు, ఉన్నతాధికారులు, వివిధ శాఖల బాధ్యులు పనిపై శ్రద్ధ పెంచాలని,...

Telangana BJP: ఇద్దరు సీఎంలు కలవాలనే కోరుకుంటున్నాం.. కానీ!?

NVSS Prabhakar: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్...

Plastic: ప్లాస్టిక్‌పై పోరాటం, నేటి అవసరం..

Fight Against Plastic, todays Need:పర్యావరణాన్ని కోలుకోని రీతిలో దెబ్బతీస్తున్న ప్రమాదకరమైన అంశాల్లో ప్లాస్టిక్ వినియోగం ఒకటి. గతంలో పట్టణాలకే పరిమితమైన ప్లాస్టిక్‌ వినియోగం నేడు పల్లెలకూ పాకింది. టీ షాపులు, పండ్ల...

TS Governance: పాలనపై ముద్రకు రేవంత్ ముందడుగు

CM Revanth Steps Forward To Impress Upon The Regime: తెలంగాణ శాసనసభ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ విజయం సాధించి రేపటికి నిండా ఏడు నెలలు పూర్తవుతాయి. ప్రభుత్వం ఏర్పడి, మంత్రులంతా...

Fuel Sources: ప్రత్యామ్నాయ ఇంధన వనరులే శరణ్యం

Alternative Energy Sources Are The Refuge: ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న పారిశ్రామికీకరణ, ఆధునిక జీవన విధానం కారణంగా మానవుని ఇంధన అవసరాలు నానాటికీ పెరుగుతున్నాయి. అయితే, అవసరాలే ప్రాతిపదికగా యథేచ్ఛగా ఇంధన వనరులను...