K Annamalai: నరేంద్ర మోదీ ఈ రోజు సాయంత్రం ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతోపాటు 30 మంది మంత్రులు ప్రమాణం చేస్తారు. ఎవరికి మంత్రి పదవి దక్కుతుంది? ఎవరికి ఏ పోర్ట్‌ఫోలియో లభిస్తుంది? అనే ఆసక్తి ఇంకా కొనసాగుతున్నది. ప్రధానిగా ప్రమాణం చేయడానికి ముందు మోదీ కాబోయే మంత్రులకు తేనీటి విందు ఇవ్వనున్నారు. దీంతో పలువురి పేర్లు స్పష్టమైపోయాయి. తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లు, ఆంధ్రప్రదేశ్ నుంచి పెమ్మసాని చంద్రశేఖర్, రామ్మోహన్ నాయుడులకూ బెర్త్‌లు కన్ఫామ్ అయ్యాయి. వీళ్లంతా ఒక ఎత్తు.. తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామళై ఒక ఎత్తు అన్నట్టుగా ఉన్నది. అన్నామళైకు మోదీ తేనీటి విందుకు ఆహ్వానం అందింది.
ఎంపీగా గెలిచిన వారికి కేంద్రమంత్రి వర్గంలో చోట లభించే చాన్స్ ఉంటుంది. ఎంపీగా గెలిచిన సీనియర్ నాయకులు ఈ అవకాశం కోసం ఆశ పడతారు. పార్టీ పెద్దలు లేదా కూటమి పెద్దలు ఎవరికి ఏ శాఖ ఇవ్వాలనే నిర్ణయిస్తారు. కానీ, అన్నామళై ఎంపీగా గెలువలేదు. కోయంబత్తూర్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయినా.. బీజేపీ అధిష్టానం ఆయనకు కేంద్రమంత్రి పదవి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వచ్చాయి. తమిళనాడులో బీజేపీకి స్థానం లేదు. కానీ, అన్నామళైల దూకుడుగా ప్రచారం చేశారు. పార్టీని ప్రజల్లోకి తీసుకునే ప్రయత్నాలు ముమ్మరంగా చేశారు. బీజేపీకి ఇప్పుడిప్పుడే తమిళనాడులో బేస్ ఏర్పడుతున్నది. ఈ నేపథ్యంలోనే అన్నామళైకు కేంద్రమంత్రివర్గంలో స్థానం కల్పించాలని బీజేపీ పెద్దలు నిర్ణయం తీసుకున్నట్టు చర్చ జరిగింది. ఇందులో భాగంగానే పీఎంవో నుంచి అన్నామళైకు ఫోన్ వచ్చింది. ఎంపీగా ఓడిపోయిన అన్నామళైను త్వరలోనే రాజ్యసభకు పంపించి.. ఆయన మంత్రి పదవిని సుస్థిరం చేయాలనీ ప్లాన్ వేశారనే చర్చించారు. మంత్రి పదవి చేపట్టిన ఆరు నెలల్లోపు రాజ్యసభ పదవి దక్కితే చాలు.. ఆయన మంత్రిగా కొనసాగడానికి చాన్స్ ఉంటుంది. తమిళనాడులో 39 లోక్ సభ స్థానాలకు.. 39 స్థానాలను ఇండియా కూటమి గెలుచుకుంది. దక్షిణాదిపై ఆశలు పెట్టుకున్న బీజేపీకి ఇప్పటికీ తమిళనాడు కొరకరాని కొయ్యగానే ఉన్నది. అయితే.. కేంద్ర కేబినెట్ సభ్యుల జాబితా బయటికి వచ్చాక.. అన్నామళై పేరు లేదని స్పష్టమైపోయింది.
నిన్న 11 గంటలపాటు సమావేశం నిర్వహించి మంత్రివర్గ కూర్పుపై మేధోమథనం జరిపారు. ముఖ్యమైన హోం, డిఫెన్స్, ఫైనాన్స్, విదేశాంగ శాఖలను బీజేపీ వద్దే ఉంచుకోవాలని నిర్ణయించారు. అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్‌లు తిరిగి హోం శాఖ, రక్షణ శాఖలను తీసుకోనున్నారు. ఇక రాజ్యసభ సభ్యులైన నిర్మల సీతారామన్, జైశంకర్‌లు ఆర్థిక, విదేశాంగ శాఖలకు బాధ్యతలు తీసుకుంటారు. నితిన్ గడ్కరీ రోడ్డు, రహదారుల మంత్రిగా బాధ్యతలు తీసుకోనున్నారు. అలాగే.. హర్యానా మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టార్, మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, జ్యోతిరాధిత్య సింధియాలకు మంత్రి పోస్టులు దక్కనున్నాయి. వీరితోపాటు శోభ కరంద్లాజే, బీఎల్ వర్మ, నిత్యానంద్ రాయ్‌లూ ప్రమాణం తీసుకునే చాన్స్ ఉన్నది. ఈశాన్య రాష్ట్రాల నుంచి సర్బానంద సోనోవాల్, కిరణ్ రిజిజులతోపాటు మరికొందరికి అవకాశం దక్కనుంది.