school students
Politics

Schools: స్కూల్స్‌లో యూనిఫామ్స్, షూ అమ్మడం నిషేధం

Student Uniforms: కొత్త విద్యా సంవత్సరం ప్రారంభంలో స్కూల్ పిల్లలకు అయ్యే ఖర్చు తడిసిమోపెడవుతుంది. నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్‌, బ్యాగ్‌లతోపాటు కొత్త యూనిఫామ్‌లు, టై-బెల్ట్, షూస్.. ఇలా చాలా వస్తువులను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కానీ, కొన్ని ప్రైవేటు స్కూల్స్ ఈ అవసరాన్ని ఆసరగా తీసుకుని వ్యాపారానికి తెరతీస్తున్నాయి. యూనిఫామ్స్, షూస్, టై-బెల్ట్, నోట్ బుక్స్ సహా విద్యార్థులకు కావాల్సిన వాటిని పాఠశాల యాజమాన్యమే అమ్ముతున్నది. అదీ మార్కెట్ రేట్‌కు అత్యధిక ధరకు అమ్ముతున్నాయి. బయటి మార్కెట్‌లో వాటిని కొనుగోలు చేస్తే యాక్సెప్ట్ చేయరు. దీంతో తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు. తప్పని పరిస్థితుల్లో ఎక్కువ డబ్బులు చెల్లించి తమ పిల్లలకు యూనిఫామ్స్, పుస్తకాలు, ఇతర వాటిని కొనుగోలు చేస్తున్నారు. ఇది తల్లిదండ్రులపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. ముఖ్యంగా పిల్లల భవిష్యత్ లక్ష్యంగా జీవించే దిగువ మధ్య తరగతి కుటుంబాలపై ఇది అధిక భారాన్ని వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.

హైదరాబాద్ జిల్లా పరిధిలోని అన్ని పాఠశాలల్లో యూనిఫామ్స్, షూ, బెల్ట్ వంటి వస్తువులను అమ్మడంపై నిషేధం విధిస్తూ హైదరాబాద్ జిల్లా విద్యా శాఖ నిర్ణయం తీసుకుంది. లాభాపేక్ష లేని, లాభ నష్టాలకు అతీతంగా స్కూల్‌ కౌంటర్‌లో బుక్స్, నోట్ బుక్స్, స్టేషనరీ వస్తువులను విక్రయిస్తే అందుకు అనుమతించాలని నిర్ణయించింది. జిల్లా విద్యా శాఖ అధికారి ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. స్టేట్, సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ సిలబస్‌లు బోధించే ప్రైవేటు స్కూల్ యాజమాన్యం ఇలాంటి వస్తువులను విక్రయించడానికి వీల్లేదని స్పస్టం చేశారు.

ఈ ఆదేశాలను అమలు చేయాలని డిప్యూటీ ఎడ్యుకేషనల్ అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ విషయమై ప్రతి ప్రైవేటు పాఠశాలను పర్యవేక్షించాలని సూచించారు. ఇందుకుగాను మండలస్థాయి కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కోర్టు ఆదేశాలకు లోబడి వాణిజ్యేతర, లాభాపేక్ష లేకుండా పుస్తకాలు, నోట్ బుక్‌లు, స్టేషనరీని స్కూల్ కౌంటర్‌లో విక్రయిస్తే అందుకు అనుమతించాలని, లేదంటే వెంటనే పై అధికారుల దృష్టికి తీసుకురావాలని, అట్టి స్కూల్ యాజమాన్యంపై తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

ఈ ఆదేశాలను వెంటనే అమలు చేయాలని, ఈ నిబంధనలు వెంటనే అమల్లోకి తెచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.