Modi not secured mejority seats
Politics

Kishan Reddy: తెలంగాణ నుంచి ఇద్దరు కేంద్రమంత్రులు వీరే

PM Narendra Modi: నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానమంత్రిగా ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణం చేయిస్తారు. అలాగే.. కేబినెట్‌ సభ్యులతోనూ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు తీసుకోవడం కన్ఫమ్ కానీ.. ఆయన కేబినెట్‌లో చోటు దక్కిన ఎంపీలు ఎవరా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ సారి బీజేపీకి సొంతంగా మెజార్టీ రాకపోవడంతో ఎన్డీయే భాగస్వామ్యాలపై పార్టీ ఆధారపడింది. కూటమి పార్టీలు కూడా మంత్రి బెర్త్ కోసం డిమాండ్లు ముందుపెట్టాయి. కూటమి పార్టీలకు మంత్రి పదవులు గతంలో కంటే ఘనంగా దక్కనున్నాయి. ఈ సారి దక్షిణాదిలో ఎన్డీయే కూటమి ఎక్కువ సీట్లు గెలుచుకుంది. అందుకు తగినట్టుగానే మంత్రి పదవులు కూడా ఎక్కువే రాబోతున్నట్టు తెలుస్తున్నది.

చీఫ్, మాజీ చీఫ్‌లకు చాన్స్

తెలంగాణ నుంచి గత కేంద్ర ప్రభుత్వంలో కిషన్ రెడ్డి మంత్రిగా చేశారు. కానీ, ఈ సారి ఈ సంఖ్య రెండుకు చేరనుంది. ఇందులో ప్రస్తుత బీజేపీ రాష్ట్ర చీఫ్ కిషన్ రెడ్డి, మాజీ చీఫ్ బండి సంజయ్‌కు ఆ అదృష్టం దక్కింది. వీరిద్దరూ ప్రధాని నివాసంలో తేనీటి విందుకు హాజరు అవుతున్నారు. నరేంద్ర మోదీ ప్రధాని ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముందు కేంద్రమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నవారితో తేనీటి విందు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందుకు హాజరుకావడానికి కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఒకే కారులో బయల్దేరి వెళ్లారు. వీరితోపాటు ఏపీ నుంచి రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌లు కూడా ప్రధాని నివాసానిక వెళ్లారు. మొత్తంగా ప్రధానమంత్రితోపాటు 30 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

తెలంగాణలో బీజేపీకి పట్టు సాధించడంలో కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లు కీలక పాత్ర పోషించారు. కిషన్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో బీజేపీ రికార్డు స్థాయిలో ఎంపీ సీట్లు గెలుచుకుంది. గతంలో నాలుగు ఎంపీ సీట్లు గెలవగా.. ఈ సారి రెట్టింపు సంఖ్యలో ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు వరకు పార్టీ అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ కూడా కమలం పార్టీ రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో బలోపేతం కావడానికి కృషి చేశారు. కరీంనగర్ ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేసి ఓడిన బండి సంజయ్.. ఎంపీగా విజయఢంకా మోగించారు. అంతేకాదు, కొన్ని గంటల్లో కేంద్రమంత్రిగా ప్రమణం చేయబోతున్నారు.

తెలంగాణ నుంచి కేంద్రమంత్రి రేసులో సీనియర్ లీడర్ డీకే అరుణ, ఈటల రాజేందర్‌లు కూడా ఉన్నారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డి సహా పలువురు ఆసక్తిని కనబరిచారు.