– హస్తం వ్యూహాలతో చిత్తవుతున్న బీజేపీ గేమ్ ప్లాన్
– చేరికలతో మారిన రాజకీయ సమీకరణాలు
– హస్తానికే మైనారిటీ ఓట్లు దక్కే ఛాన్స్
– కొత్త చర్చకు దారితీసిన రిజర్వేషన్ల రద్దు చర్చ
– తలలు పట్టుకుంటున్న కమలం నేతలు
– ఆదిలాబాద్, కరీంనగర్ సీట్లలో ఎదురుగాలి
BJP: ఈ లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో 10 సీట్లు సాధించి, ఈ ప్రాంతంపై తిరుగులేని ఆధిపత్యాన్ని చాటాలనుకున్న బీజేపీ గేమ్ ప్లాన్ తిరగబడుతోందా? ఎన్నికల తేదీ దగ్గరపడుతున్నా.. అగ్రనేతలు ఆశించిన వేవ్ క్షేత్రస్థాయిలో కనపించటం లేదా? 2019లో గెలిచిన 4 సీట్లలోనూ ఇలాంటి పరిస్థితే ఉందా? ముఖ్యంగా కరీంనగర్, ఆదిలాబాద్ సీట్లలో బీజేపీ గెలుపు ప్రమాదంలో పడిందనే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయా? అంటే అవుననే చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ బలపడటం, మైనారిటీ ఓట్లన్నీ హస్తానికే దక్కే సూచనలు, నానాటికీ హస్తం పార్టీలో పెరుగుతున్న చేరికలు దీనికి ప్రధాన కారణాలని వారు విశ్లేషిస్తున్నారు. రాబోయే వారం రోజులూ ఇదే పరిస్థితి కొనసాగితే తెలంగాణలో కీలకమైన ఈ రెండు సీట్లూ కాంగ్రెస్ ఖాతాలోకి పోవటం ఖాయమని ఆ పార్టీ నేతలు కంగారుపడుతున్నారు. అటు క్షేత్ర స్థాయి పరిస్థితులూ దీననే సూచిస్తున్నాయి.
కరీంనగర్
గత లోక్‌సభ ఎన్నికల్లో కరీంనగర్ స్థానాన్ని బీజేపీ గెలుచుకుంది. సుమారు 17 లక్షల ఓట్లున్న ఈ స్థానంలో ఆ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌కి 4,98,276 ఓట్లు దక్కటంతో ఆయన విజయం సాధించారు. అయితే, ఆ తర్వాత ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కావటంతో తెలంగాణ వ్యాప్తంగా పర్యటనలు, కార్యక్రమాలతో నియోజక వర్గానికి దూరమయ్యారు. ఆ తర్వాత ఊహించని రీతిలో ఆయన రాష్ట్ర అధ్యక్ష పదవిని కోల్పోయి, చాలాకాలం మౌనంగా ఉండిపోయారు. తర్వాత వచ్చిన అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి పోటీచేసినా ఆయనకు పరాజయమే ఎదురైంది. కరీంనగర్ పరిధిలోని 7 అసెంబ్లీ సీట్లలో గత శాసన సభకు 13,76,685 ఓట్లు పోల్ కాగా కాంగ్రెస్‌కు 5,12,352 ఓట్లు, బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ కంటే 5249 ఓట్లు ఎక్కువగా వచ్చాయి. అయితే, ఇక్కడి 7 అసెంబ్లీ సీట్లలో వేములవాడ, హుస్నాబాద్, చొప్పదండి, మానకొండూర్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలవగా, కరీంనగర్, సిరిసిల్ల, హుజురాబాద్ అసెంబ్లీ స్థానాలను బీఆర్ఎస్ దక్కించుకుంది. ఈ ఎన్నికల్లో బీజేపీ గుర్తుకు 2,50,400 ఓట్లు మాత్రమే వచ్చాయి. అంటే 2019లో బండి సంజయ్‌కు ఈ సీటులో వచ్చిన ఓట్లలో సగం తగ్గిపోయాయి. పైగా కరీంనగర్ ఎంపీ పరిధిలోని హుజూరాబాద్ అసెంబ్లీ సీటునూ బీజేపీ కోల్పోయింది.
ఈ సీటులో 7 శాతం మైనారిటీ ఓటర్లు, 19 శాతం ఎస్సీ ఓటర్లు, 2.5 ఎస్టీ ఓటర్లున్నారు. ఇక్కడున్న ముస్లిం ఓటర్లలో మెజారిటీ ఓట్లు ఈసారి కాంగ్రెస్‌కు దక్కే అవకాశం ఉండటంతో బాటు అధికారంలో ఉన్న పార్టీగా, రిజర్వేషన్ల అంశాన్ని జనంలోకి తీసుకుపోయిన పార్టీగా అది కాంగ్రెస్‌కు కలిసొస్తుందనే విశ్లేషణ వినిపిస్తోంది. మాజీ ఎంపీగా, ప్రస్తుత మంత్రిగా పొన్నం ప్రభాకర్ ఇక్కడ పర్యటిస్తూ, క్షేత్రస్థాయిలో తనకున్న పరిచయాలను ఓటుగా మలిచేందుకు ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు వెలమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావటం, అటు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వినోద్ కుమార్ కూడా అదే సామాజిక వర్గం కావటంతో ఈసారి ఈ వర్గం ఓటర్లు రాజేందర్ రావు వైపు మొగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బండి భావోద్వేగ అంశాలకే తప్ప అభివృద్ధి పరంగా ఏమీ చేయలేదనే భావన, ఈ ప్రాంతం గతంలో వామపక్షవాదులకు చిరునామా కావటంతో ఈసారి ఇక్కడ కాంగ్రెస్ గెలుపు ఖాయమనే భావన ఉంది.
Also Read: రోహిత్ వేముల ఆత్మహత్యకు కారణాలు ఇవేనంటా!.. కేసు క్లోజ్.. ‘చచ్చినా వదలని కులం’
ఆదిలాబాద్
ఆదివాసీల అడ్డా అయిన ఈ స్థానంలోనూ ఈసారి బీజేపీకి ఎదురుగాలి వీస్తోంది. గత లోక్‌సభ ఎన్నికల్లో ఈ స్థానంలో బీజేపీ అభ్యర్ధిగా బరిలో దిగి గెలిచిన సోయం బాపూరావు విజయం సాధించారు. నాడు నాడు ఈ సీటులో గోండు వర్సెస్ లంబాడీ అనే సమీకరణాన్ని బీజేపీ వాడుకోవటం వల్ల బీజేపీ విజయం సాధ్యమైంది. కానీ, ఈసారి ఇక్కడ బాపూరావు స్థానంలో మాజీమంత్రి జి. నగేష్ సీటు దక్కించుకున్నారు. అయితే, నేటికీ వీరిద్దరి మధ్య పైకి కనిపిస్తున్నంత సఖ్యత లేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సీటు పరిధిలోని 7 స్థానాల్లో నలుగురు బీజేపీ ఎమ్మెల్యేలు గెలుపొందినా, ఇక్కడ అంతర్గతంగా సాగుతున్న ఆధిపత్యపోరు ఆ పార్టీకి తలనొప్పులు తెస్తోంది. ఈ ఎంపీ సీటు పరిధిలోని 7 సీట్లలో గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఖానాపూర్ సీటును దక్కించుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో సిర్పూర్ కాగజ్ నగర్‌లో బీఆర్ఎస్ తరపున కోనేరు కోనప్ప, నిర్మల్ బరిలో నిలిచి ఓడిన ఇంద్రకరణ్ రెడ్డి ఇప్పటికే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ లెక్కన ఇక్కడ కాంగ్రెస్ బలం మూడు సీట్లకు పెరిగింది.
1952 నుంచి ఇక్కడి లోక్‌సభ ఎన్నికల్లో తొలిసారి ఒక మహిళకు కాంగ్రెస్ పోటీ చేసే అవకాశం ఇవ్వటం, హస్తం అభ్యర్థి ఆత్రం సుగుణ, ఆమె భర్త ఇద్దరూ ప్రభుత్వ టీచర్లే కావటం, సుగుణకు మానవహక్కుల సంఘాల తరపున ప్రజాసమస్యలపై పోరాటాలు చేసిన చరిత్ర ఉండటం ఆమెకు కలిసొచ్చే అంశాలు. ఇక, ఈ సీటులో 11.7 శాతం ముస్లిం ఓట్లు, 15.2 శాతం ఎస్సీ ఓట్లున్నాయి. ఈ వర్గాలు ఆదినుంచీ కాంగ్రెస్‌కు సంప్రదాయ ఓటర్లుగా ఉండటం, కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలో ఉండటం హస్తం విజయాన్ని ధృవీకరిస్తున్నాయి. ఇక్కడి 22 శాతం ఆదివాసీల ఓట్లను ముగ్గురు అభ్యర్థులు చీల్చుకున్నా.. మహిళా అభ్యర్థిగా సుగుణకే మెజారిటీ ఓట్లు వస్తాయనే అంచనా ఉంది. ఇక్కడ లంబాడా వర్గానికి చెందిన మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ బీజేపీ సీటు ఆశించి భంగపడటం, ఆయన వర్గపు 1.5 లక్షల లంబాడా ఓట్లు ఈసారి బీజేపీకి ప్రత్యర్థిగా ఉన్న కాంగ్రెస్‌కు దక్కే ఛాన్స్ అధికంగా ఉంది.
గత వారం రోజులుగా రాజ్యాంగాన్ని మార్చాలని బీజేపీ ప్రయత్నిస్తోందనే కాంగ్రెస్ ప్రచారం, అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో ఢిల్లీ పోలీసులు చేసిన ‘అతి’, కవిత అరెస్టు, ఫోన్ ట్యాపింగ్ కేసు తర్వాత పూర్తిగా చప్పబడిన బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి నేపథ్యంలో నేడు కాంగ్రెస్‌ను ఒక మెరుగైన ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారు. దీనికి తోడు ఈ రెండు నియోజక వర్గా్లలోని రోజురోజుకూ మారుతున్న రాజకీయ సమీకరణాలు దీనినే సూచిస్తున్నాయి.