TSRTC: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ఫీవర్ నడుస్తున్నది. పోలింగ్ తేదికి ముందు వీకెండ్ రావడంతో చాలా మంది సొంతూళ్లకు పోటెత్తుతున్నారు. ముఖ్యంగా రాజధాని నగరంలోని ఏపీ వాసులు పెద్ద సంఖ్యలో ఓటు వేయడానికి స్వగ్రామాలకు వెళ్లుతున్నారు. ప్రయాణికులకు సరిపడా బస్సులను ఏర్పాటు చేయడానికి ఆర్టీసీ కసరత్తులు చేస్తున్నది. ఇప్పటికే చాలా వరకు ప్రైవేటు ట్రావెల్స్‌లు బస్సులు పెట్టి ప్రయాణికులను తరలిస్తున్నది. టీఎస్ఆర్టీసీ కూడా ఇది వరకే 590 స్పెషల్ బస్సులను ఏర్పాటు చేసింది. వీటికితోడు అదనంగా తాజాగా హైదరాబాద్ నుంచి విజయవాడ రూట్‌లో మరో 140 సర్వీసులను ఏర్పాటు చేసినట్టు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఓ ప్రకటనలో వెల్లడించారు.
హైదరాబాద్ నుంచి విజయవాడ రూట్ వైపునకు వెళ్లే ప్రయాణికులు ఈ ప్రత్యేక సర్వీసులను వినియోగించుకోవాలని టీఎస్ఆర్టీసీ కోరింది. తాజాగా 140 సర్వీసులను ఆన్‌లైన్‌లో ముందస్తు రిజర్వేషన్ కోసం పెట్టినట్టు తెలిపింది. ఆయా బస్సుల్లో దాదాపు 3 వేలకు పైగా సీట్లు అందుబాటులో ఉన్నాయని వివరించింది. టికెట్ల ముందస్తు రిజర్వేషన్ కోసం http://tsrtconline.in వెబ్ సైట్‌కు వెళ్లాలని సూచించింది.
Also Read: చిన్న నోటు తీసుకో..పెద్ద నోటు తెచ్చుకో
హైదరాబాద్ నుంచి జిల్లాలకు 1500 ప్రత్యేక బస్సులను నడుపుతున్నదని, జేబీఎస్, ఎంజీబీఎస్, ఉప్పల్, ఎల్బీ నగర్, ఆరాంఘర్, తదితర ప్రాంతాల నుంచి ఈ బస్సులను నడుపుతున్నదని సజ్జనార్ తన ప్రకటనలో పేర్కొన్నారు. ప్రయాణికుల రద్దీని బట్టి ఎప్పటికప్పుడు బస్సులను అందుబాటులో ఉంచాలని క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించినట్టు వివరించారు. ఈ ప్రత్యేక బస్సుల సేవలను వినియోగించుకుని సొంతూళ్లకు వెళ్లి తమ అమూల్యమైన ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు.