– ఉచిత బస్సు పథకంతో భారీగా పెరిగిన ఆక్యుపెన్సీ
– రోజుకు 20 లక్షల మంది ప్రయాణికులు
– బస్సుల సంఖ్యను పెంచాలనే యోచనలో టీఎస్ ఆర్టీసీ
– ప్రస్తుతం నడుస్తున్న బస్సులు 2900
– ఈ సంవత్సరం ఎండింగ్‌కు 3500కు పెంచే కార్యాచరణ
– దశల వారీగా మరో 450 ఎలక్ట్రిక్ బస్సులు
– కొత్త బస్సులతో తప్పనున్న ప్రయాణికుల పాట్లు
TS Rtc income increased after mahalakshmi free bus scheme plan :
ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్ ప్రయాణ సౌకర్యానికి మంచి స్పందన లభిస్తోంది. మహిళల ప్రయాణ ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు అందుబాటులోకి తెచ్చిన ఈ పథకాన్ని.. మహిళలు, బాలికలు, విద్యార్థినులు, థర్డ్ జెండర్లు ఉపయోగించుకుంటున్నారు. అయితే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మహాలక్ష్మి ఉచిత ప్రయాణాలతో ప్రయాణికుల రద్దీ రెట్టింపు అయింది. పెరిగిన ప్రయాణికుల సౌలభ్యం కోసం కొత్త బస్సుల కొనుగోలుపై టీఎస్ ఆర్టీసీ దృష్టిపెట్టింది. రోజువారి ఆర్టీసీ ప్రయాణికుల సంఖ్య దాదాపు 20 లక్షలకు పెరిగింది. గ్రేటర్ జోన్ పరిధిలో ఆర్టీసీ ప్రస్తుతం 2900 బస్సులను నడిపిస్తోంది. ఈ సంవత్సరం చివరి నాటికి గ్రేటర్ జోన్ లో బస్సుల సంఖ్యను 3500కు పెరగాలని టీఎస్ ఆర్టీసీ లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఎటక్ట్రికల్, డీజిల్ బస్సులను పెంచుకునే దిశగా ఆర్టీసీ సంస్థ కసరత్తు చేస్తోంది.
టీఎస్ ఆర్టీసీకి లాభాల పంట
మొన్న జరిగిన ఎన్నికల పుణ్యమా అని టీఎస్ ఆర్టీసీ కి లాభాల పంట పండింది. పొరుగు రాష్ట్రాలలో ఓటు హక్కు ఉన్న హైదరాబాద్ నగర వాసులు భారీ సంఖ్యలో ఓట్లేయడానికి బస్సుల ద్వారా వెళ్లొచ్చారు. దాదాపు 54 లక్షలకు పైగా ప్రయాణించారు. దీనితో టీఎస్ ఆర్టీసీకి రూ.24.22 కోట్ల ఆదాయం వచ్చింది. ఒక పక్క మహిళలకు ఉచిత ప్రయాణ రాయితీని ఇస్తూనే మరో పక్క సంస్థ ఆదాయాన్ని పెంచుకునే మార్గాలను అన్వేషిస్తోంది. టీఎస్ ఆర్టీసీలో గరిష్ఠంగా రోజుకు 55 లక్షల మంది ప్రయాణాలు సాగిస్తున్నారు. మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయంతో ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో సీట్ల భర్తీ నిష్పత్తి (ఆక్యుపెన్సీ రేషియో- ఓఆర్) 95-120 శాతం వరకు నమోదవుతోంది. స్త్రీలకు ఉచితం లేని సూపర్‌లగ్జరీ, డీలక్స్, ఏసీ బస్సుల్లో ఓఆర్ 65-70 శాతం వరకు ఉంటున్నట్లు తెలుస్తోంది. ఈ బస్సుల్లోనూ ఆక్యుపెన్సీ రేషియో శాతం పెంచుకోగలిగితే ఆదాయం పెరుగుతుందని సంస్థ భావిస్తోంది. ఇందుకోసం రూట్ల వారీగా అదనపు ఆదాయానికి ఉన్న అవకాశాల్ని గుర్తించడంపై తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ దృష్టి పెట్టింది. అదేవిధంగా ఆర్టీసీ బస్టాండ్ల దగ్గర ప్రైవేట్ బస్సులు, ప్రైవేట్ వాహనాలు ఆగకుండా చూడటం, డిమాండ్ ఉన్న రూట్లలో డీలక్స్, సూపర్‌లగ్జరీ, ఏసీ సర్వీసుల్ని అధికంగా నడపడం వంటి చర్యలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్-శ్రీశైలం మధ్య గతంలో సూపర్‌లగ్జరీ బస్సులు మాత్రమే ఉండేవి. ఇటీవల ఏసీ బస్సుల్ని సంస్థ ప్రవేశపెట్టింది. దీంతో ఈ మార్గంలో ప్రయాణికులకు కొత్త సౌకర్యంతో పాటు సంస్థకు ఆదాయం పెరిగింది. ఇదే తరహా ప్రయోగాల్ని మరికొన్ని రూట్లలో చేసేందుకు టీఎస్‌ఆర్టీసీ కసరత్తు చేస్తోంది.
ఆదాయ మార్గాలపై అన్వేషణ
ప్రయాణికుల డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని జూన్ 15 నాటికి నగరంలో 150 కొత్త బస్సులు రోడ్లపైకి తీసుకొచ్చే దిశగా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. వీటిలో 125 మెట్రో డీలక్స్ బస్సులు, 25 ఎలక్ర్టిక్ బస్సులు ఉండనున్నట్లు, వీటిని విద్యాసంవత్సరం ప్రారంభం నాటికి అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా అధికారులు పనిచేస్తున్నారు. మరో ఆరు నెలల్లో గ్రేటర్‌లో దశలవారీగా 450 ఎలక్ర్టిక్ బస్సులు తెస్తామని ఇప్పటికే ఆర్టీసీ ఉన్నతాధికారులు ప్రకటించారు. అయితే ఎలక్ర్టిక్ బస్సుల రాక ఆలస్యం అవుతుండడంతో ఈలోపు డీజిల్ బస్సులను సమకూర్చుకోవడంపై టీఎస్ ఆర్టీసీ దృష్టిసారించింది. నగరంలో ప్రస్తుతం 2 వేల 850 బస్సులు తిరుగుతున్నాయి. కానీ 7 వేల 500ల వరకు బస్సులు అవసరం అని ఆర్టీసీ నివేదికలు చెబుతున్నాయి. తిరిగి బస్సులు పెరిగితే మళ్లీ ప్రయాణికులతో పాటు పాస్‌లు పెరుగుతాయని ప్రజా రవాణా నిపుణులు పేర్కొంటున్నారు. బస్సులు తక్కువగా ఉండడంతో చాలామంది వ్యక్తిగత వాహనాలు వినియోగిస్తున్నారు. దీంతో కాలుష్యం, ట్రాఫిక్ సమస్యలు ఎక్కువైనట్లు తెలుస్తుంది.
30 లక్షలకు చేరే చాన్స్
జూన్‌లో వచ్చే 125 మెట్రో డీలక్స్ బస్సుల్లో 2/2 సీటింగ్ సామర్థ్యం అందుబాటులోకి వస్తుందని ఓ ఉన్నతాధికారి తెలిపారు. బస్సుల సంఖ్య పెరిగితే రోజువారీ ప్రయాణికుల సంఖ్య 30 లక్షలకు చేరే అవకాశముంటుందని ఆర్టీసీ భావిస్తోంది. ప్రధానంగా శివారు ప్రాంతాలు విస్తరిస్తున్న నేపథ్యంలో అన్ని ప్రాంతాలను కలుపుతూ ఆర్టీసీ బస్సుల రూట్ మ్యాప్‌లను అందుబాటులోకి తేవాల్సి ఉందన్నారు. ఫలితంగా రోడ్లపై సొంత వాహనాల రద్దీని కొంతమేర తగ్గించే అవకాశాలుంటాయని రవాణా రంగ నిపుణులు చెబుతున్నారు. ప్రయాణికుల డిమాండ్‌కు అనుగుణంగా బస్సులు లేకపోవడంతో గ్రేటర్‌ల ప్రైవేట్ వాహనాల సంఖ్య పెరుగుతున్నదన్నారు.. నగరంలో ఆర్టీసీ బస్సులు సమయానుకూలంగా నడపకపోవడంతో ఉద్యోగులు, విద్యార్థులు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కార్యాలయాల సమయంలో బస్సుల సంఖ్య తక్కువ ఉండడం, రద్దీ ఎక్కువగా ఉండడంతో చాలామంది బస్సులు ఎక్కడం లేదు. ప్రధానంగా రాత్రి సమయాల్లో బస్సుల్లేక ప్రయాణికులు ఆటోలను, క్యాబ్‌లను ఆశ్రయిస్తున్నారు. దీంతో సంస్థ ఆదాయానికి గండిపడుతోంది. సమయానుకూలంగా పీక్ ఆవర్స్‌లలో బస్సులు నడపడంతో పాటు కొత్త మార్గాల్లో కూడా బస్సులను నడిపితే ఆదాయం పెంచుకునే అవకాశముంది.