Trump Objection To TikTok App Ban
అంతర్జాతీయం

Donald Trump : టిక్‌టాక్ పాలిటిక్స్, యాప్ బ్యాన్‌పై ట్రంప్ అభ్యంతరం

Trump Objection To TikTok App Ban : అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆ దేశంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. టిక్‌టాక్ షార్ట్ వీడియోల యాప్‌పై పలు రకాల భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. తాజాగా.. టిక్‌టాక్‌ అమెరికా ప్రతినిధుల సభ పాస్‌ చేయనున్న నిషేధం బిల్లుపై రిపబ్లిక్‌ పార్టీ తరపున అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం అధ్యక్ష అభ్యర్థిగా బరిలో ఉన్న డొనాల్డ్‌ ట్రంప్ అభ్యంతరం వ్యక్తం చేశారు. టిక్‌టాక్‌ లేకపోతే యువత తట్టుకోలేదని.. మెటాకు చెందిన ఫేస్‌బుక్‌ బలోపేతమవుతుందని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

ఫేస్‌బుక్‌ దగ్గర నిజాయితీ లేదని, టిక్‌టాక్‌ నిషేధం మూలంగా ఫేస్‌బుక్‌ లాభపడటం తనకు అస్సలు ఇష్టం లేదని ట్రంప్ స్పష్టం చేశారు. ఈ యాప్‌ని ప్రస్తుతం అమెరికాలో పెద్ద సంఖ్యలో యువత వాడుతోందని.. వారంతా యాప్ లేకపోతే పిచ్చివాళ్లయ్యే అవకాశం ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. టిక్‌టాక్‌లో మంచితో పాటు చెడు కూడా ఉందన్నారు.

Read More : యూఎస్‌ఏలో విషాదం, నీట మునిగి ఫార్‌మోస్ట్‌ గ్రూప్‌ సీఈఓ మృతి

2021లో క్యాపిటల్ భవనంపై దాడి సందర్భంగా ట్రంప్ పెట్టిన పోస్ట్‌లను ఫేస్‌బుక్‌తో పాటు ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి మెటా డిలీట్ చేసింది. దీంతో మెటాపై ట్రంప్ ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. ట్రంప్‌తో పాటు రిపబ్లికన్లంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ట్రంప్ తాజా వ్యాఖ్యల మూలంగా ఫేస్‌బుక్ షేర్లు స్టాక్‌మార్కెట్ల వద్ద తీవ్ర నష్టాలను చవిచూశాయి.

అయితే 2020లో తాను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చైనాకు చెందిన టిక్‌టాక్‌తో పాటు విచాట్‌ని నిషేధించడానికి ట్రంప్ ప్రయత్నించడం గమనార్హం. కోర్టులు జోక్యం చేసుకుని ఈ ప్రయత్నానికి బ్రేకులు వేశాయి. ప్రస్తుతం మళ్లీ అధ్యక్ష ఎన్నికల్లో బరిలో ఉన్న వేళ ట్రంప్ టిక్‌టాక్ నిషేధంపై వ్యాఖ్యలు చేయడం వెనుక మత్లబ్ ఏంటని, తన వెనుక రాజకీయ వ్యూహం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

Read More: దుబాయ్‌ని ముంచెత్తిన వర్షాలు, నదులను తలపిస్తున్న రోడ్లు

ఇక.. అమెరికాలో ప్రస్తుతం 17 కోట్ల మంది టిక్‌టాక్‌ని ఉపయోగిస్తున్నారు. యూఎస్ ప్రతినిధుల సభ బుధవారం టిక్‌టాక్‌పై నిషేధం విధించే కీలక బిల్లును పాస్ చేయనుంది. ఈ బిల్లు పాసైన 165 రోజుల లోపు చైనాకు చెందిన బైట్ డ్యాన్స్ కంపెనీ టిక్‌టాక్‌ని అమ్మేయాల్సి ఉంటుంది. లేదంటే గూగుల్, ఆపిల్‌ ప్లే, స్లోర్లు టిక్‌టాక్‌కి వెబ్ హోస్టింగ్‌ సర్వీస్‌లను నిలిపివేస్తాయి.