Transparency in Replacement of Gauges With Cleaning Itself
Editorial

Telangana : ప్రక్షాళనతోనే కొలువుల భర్తీలో పారదర్శకత

Transparency in Replacement of Gauges With Cleaning Itself :గత తెలంగాణ ఎన్నికల వేళ టీఎస్‌పీఎస్సీ నిర్వహణ లోపాలు, దాని వైఫల్యం కారణంగా నిరుద్యోగ యువత పడిన గోసపై తెలంగాణ సమాజంలో విస్త్రతంగా చర్చ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను భర్తీ చేయాల్సిన ఈ సంస్థ గత పదేళ్ల కాలంలో అడుగడుగునా పారదర్శకత, పనితీరు లోపాలతో కునారిల్లిపోయింది. రాజ్యాంగ ప్రతిపత్తి గల ఈ సంస్థ విషయంలో వెలుగులోకి వచ్చిన అవినీతి అక్రమాలతో నిజంగా కష్టపడిన వారికి సర్కారీ కొలువు దక్కదనే అభిప్రాయం బలపడిపోయింది. అయితే.. ఈ దుస్థితిని దూరం చేసేలా కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే రంగంలోకి దిగి, స్పష్టమైన కార్యాచరణను ప్రకటించటంతో నిరుద్యోగులు ఇక రాబోయే రోజుల్లోనైనా తమకు న్యాయం జరుగుతుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

టీఎస్‌పీస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారాన్ని నిశితంగా పరిశీలిస్తే.. సంస్థ పనితీరు లోపాలు, విధానపరమైన వైఫల్యాలే ఇందుకు కారణాలని అనిపించక మానవు. సంస్థ చైర్మన్‌ మొదలుకుని సభ్యుల వరకూ ఏ ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించలేదనే సంగతి అర్థమవుతుంది. ఏటా క్రమం తప్పకుండా కమిషన్.. గవర్నర్‌కు వార్షిక నివేదికను అందజేయాల్సి ఉంది. ఆ నివేదికలపై గవర్నర్‌ ఏడాదిలో కనీసం రెండు సార్లైనా సమీక్ష చేయాల్సి ఉండగా, గత ప్రభుత్వం, అటు కమిషన్ ఈ నియమాలను పట్టించుకోలేదు. యూపీఎస్సీ గైడ్‌లైన్స్‌ను పాటిస్తూ, పారదర్శకంగా కొలువుల భర్తీ చేయాల్సిన ఈ సంస్థకు ఆ పట్టింపే లేకుండా పోయింది. కమిషన్‌ కార్యకలాపాల్లో అర్హతలేని వ్యక్తులు, తాత్కాలిక, కాంట్రాక్టు ఉద్యోగులు ఇష్టారాజ్యంగా తీసుకున్న నిర్ణయాలకు లక్షలాది నిరుద్యోగుల విలువైన కాలం వృధా అయింది.

పరీక్షల నిర్వహణ లోపాల మీద గతంలో వచ్చిన నివేదికను అప్పటి అధికారులు బుట్టదాఖలు చేశారు. పొరుగు రాష్ట్రాల సర్వీస్‌ కమిషన్‌లలో కనీసం 1,500 మంది శాశ్వత ఉద్యోగులు పనిచేస్తున్నారు. టీఎస్‌పీఎస్సీకి కనీసం 341 మంది ఉద్యోగులు అవసరమున్నా, కేవలం 166 మందినే కేటాయించారు. వీరిలో ప్రస్తుతం పనిచేస్తున్నవారి సంఖ్య 106 మంది. నాలుగో తరగతి ఉద్యోగులతో కలిపి 83 మంది మాత్రమే వీరిలో ప్రభుత్వ ఉద్యోగులు కాగా, మిగిలిన వారంతా ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందే. వీరంతా ఒకే ఏజెన్సీ ద్వారా రిక్రూట్ అయిన వారే కావటంతోనే అక్రమాల పర్వం నిరాటంకంగా సాగిందనే వార్తలూ వచ్చాయి. కమిషన్ కార్యాలయంలో 130 కంప్యూటర్లుండగా, వీటికి ఇంటర్‌నెట్‌ కనెక్షన్‌తో పాటు పెన్‌డ్రైవ్‌ యాక్సెస్‌ కూడా ఉండటం చూసి దర్యాప్తు అధికారులు బిత్తరపోయారు. సాధారణంగా ఇలాంటి విభాగాల్లో కంపూటర్లను ల్యాన్‌ ద్వారా కనెక్ట్‌ చేయటం గానీ, పెన్‌డ్రైవ్‌ యాక్సెస్‌ కూడా ఉండవు. సర్వర్‌ ఏర్పాటు చేసుకుని దాని ఆధారంగానే నెట్‌వర్క్‌ నిర్వహిస్తారు. తద్వారా ఎవరైనా అక్రమాలకు పాల్పడితే వారిని ఈజీగా గుర్తించే వీలుంటుంది. ఇక సిబ్బందిలో మెజారిటీ ఉద్యోగులకు సైబర్‌ దాడులు, కంప్యూటర్‌ సేఫ్టీ, పాస్‌వర్డ్స్, యూజర్‌ ఐడీల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద కనీస అవగాహన లేదు.

పేపరు లీకేజీ తర్వాత జరిగిన దర్యాప్తులో నివ్వెరపోయే నిజాలు వెల్లడయ్యాయి. డబ్బులకు లొంగే సిబ్బంది ఉండడం, వారిపై పై ఏ దశలోనూ అధికారుల పర్యవేక్షణ లేకపోవటం, కమీషన్‌ కార్యాలయానికి నిత్యం బయట వ్యక్తులు వచ్చిపోయారని, వారి డేటా ఏదీ అందుబాటులో లేదని సిబ్బంది చెప్పటం.. ఇలా ఎన్నో లోపాలు బయటపడ్డాయి. పబ్లిక్ సర్వీసు కమిషన్ కార్యకలాపాలు గోప్యంగా నిర్వహిస్తారు. ప్రస్తుతం అంతా కంప్యూటర్‌ ఆధారిత పరిపాలన కావడంతో పటిష్ఠమైన నెట్‌వర్క్‌ అవసరం. కానీ ఈ సంస్థ నెట్‌వర్క్‌ అత్యంత బలహీనంగా ఉందని వెల్లడైంది. ఐటీ- వ్యవస్థ కోసం గత ప్రభుత్వం కేటాయించిన అరకొర నిధులు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల జీతాలకు కేటాయింపులు తగ్గించడంతో.. రాష్ట్ర సాంకేతిక సేవల సంస్థ ఆరుగురి స్థానంలో నలుగురే పనిచేయటం వంటి అంశాలను తెలుసుకుని దర్యాప్తు అధికారులు నోరెళ్ల బెట్టారు. ఇక, కమిషన్ కార్యాలయంలోని రెండవ అంతస్తులోని ‘కాన్ఫిడెన్షియల్‌’ అనే మాటకు అర్థమే లేకుండా పోయింది. చిన్న చిన్న దుకాణాలు, నివాస గృహాల్లోనూ సీసీ కెమెరాలు నిరంతరం పనిచేస్తున్న ఈ రోజుల్లో కమిషన్ కార్యాలయంలోని కాన్ఫిడెన్షియల్‌ సెక్షన్‌ వద్ద సీసీ టీవీ కెమెరాలు, బయోమెట్రిక్‌ నమోదు చేసే వ్యవస్థ గానీ లేకపోవటం విషాదం. బయోమెట్రిక్‌ వ్యవస్థ ఉంటే అక్రమార్కులు పాస్‌వర్డ్‌ దొంగిలించే ప్రమాదం తప్పేదని, ఈ లోపాలపై ముందుగానే మేల్కొని ఉంటే నిరుద్యోగులు గోస పడాల్సిన పరిస్థితి వచ్చేది కాదు.

ఎట్టకేలకు కమిషన్ ప్రక్షాళనకు దిగి కొన్ని విధాన పరమైన నిర్ణయాలను ప్రకటించింది. ఉద్యోగాల భర్తీకి యూపీఎస్సీ తరహాలో నిర్ణీత కాలవ్యవధితో ఏటా జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేయనుంది. ఇందులో భాగంగా ఏటా జనవరి 1న టీఎస్‌పీఎస్సీ, గురుకుల, పోలీసు, వైద్య నియామక బోర్డులు, సంస్థల ఆధ్వర్యంలో జాబ్‌ క్యాలెండర్లు ప్రకటన చేసే ప్రక్రియలో భాగంగా ఒక ముసాయిదా జాబ్ కేలండర్‌ను తయారు చేసి ప్రభుత్వ ఆమోదానికి పంపింది. ఈ ఏడాది నుంచే జాబ్ కేలండర్ అమల్లోకి వచ్చే అవకాశముంది. ఇలా కేలండర్‌ను ప్రకటించటం వల్ల ఏ నెలలో ఏ నోటిఫికేషన్‌ ఇస్తారు? ఏ నెలలో పరీక్షలు జరుగుతాయి? నియామక ప్రక్రియ ఎప్పుడు పూర్తవుతుందన్న అంశాల మీద ఉద్యోగార్ధులు స్పష్టమైన అవగాహనకు రాగలుగుతారు. అలాగే యూపీఎస్సీ తరహాలో, ఎలాంటి రాజకీయ ప్రమేయానికి తావులేకుండా ఈ ఏడాది చివరికల్లా రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేయడానికి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రంగంలోకి దిగటం మీద అటు మేధావులు, విద్యావేత్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

పత్తిపాక శ్రావణ్ కుమార్ (సీనియర్ జర్నలిస్ట్)