– పదేళ్లలో బీజేపీ సాధించిందేంటి?
– మొదటి దశ ఎన్నికలు దగ్గరవుతున్నా మేనిఫెస్టోకు దిక్కులేదు
– కానీ, కాంగ్రెస్ మేనిఫెస్టోను విమర్శిస్తోంది
– రైతుల ఉసురు తీసుకున్న పాపం ఊరికే పోదు
– బీజేపీ కుట్ర పూరిత రాజకీయాలకు చరమగీతం పాడుదాం
– రాష్ట్ర ప్రజలకు సామ రామ్మోహన్ రెడ్డి పిలుపు
Sama Rammohan Reddy Fire on BJP : పదేళ్లలో బీజేపీ చేసిన అభివృద్ధి అంకెలవారీగా చెప్పమంటే చెప్పడం లేదని మండిపడ్డారు కాంగ్రెస్ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి. పదేళ్లు ప్రజలకు చెవిలో పువ్వులు పెట్టడం తప్ప మోడీ చేసిందేమీ లేదన్న ఆయన, పేదలకు అన్నం పెట్టే గుణం లేని బీజేపీ నీతులు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.
మొదటి దశ ఎన్నికలు దగ్గరవుతున్నా బీజేపీ మేనిఫెస్టోకు దిక్కులేదని చమత్కరించారు. సిగ్గు లేకుండా కాంగ్రెస్ మేనిఫెస్టో మీద విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ విభజన చట్టంలోని అంశాల్ని బీజేపీ విశ్మరించిందన్న సామ, తొమ్మిది లక్షల కోట్లు తెలంగాణకు ఇచ్చామని బీజేపీ నేతలు చెబుతున్నారని, ఎక్కడ ఖర్చు పెట్టారని నిలదీశారు. ఏ అభివృద్ధి కోసం ఖర్చు చేశారో బీజేపీ నేతలు చెప్పగలరా అంటూ నిలదీశారు. చివరికి భద్రాద్రి రాములోరి మీద చిన్న చూపు చూస్తున్న వాళ్ల నైతికత ప్రజలు అర్థం చేసుకుంటున్నారని అన్నారు.
మూడు నల్ల చట్టాల వల్ల రైతుల ఉసురు తీసుకున్న పాపం ఊరికే పోదని, మోడీ హయాంలో సంపన్నులే తప్ప మధ్యతరగతి ప్రజలు బతకలేని పరిస్థితులు దాపురించాయని విమర్శించారు. పేద, మధ్యతరగతి ప్రజల కడుపు కొట్టి మోడీ సంపన్నులకు దోచి పెట్టారని అన్నారు. పదేళ్లలో మోడీ ఒక్క ప్రభుత్వ రంగ సంస్థనైన స్థాపించారా అని నిలదీశారు రామ్మోహన్ రెడ్డి. రోజుకొక ప్రభుత్వ రంగ సంస్థను అమ్ముకుంటూ, డ్రామాలు చేస్తున్నారని మండిపడ్డారు.
పదేళ్లలో మోడీ ఇండ్లు తెలంగాణలో ఎన్ని ఇచ్చారో చెప్పాలన్న ఆయన, అబద్ధాలు, విద్వేషాలు, విధ్వంసాలతో బీజేపీ కుట్ర పూరితమైన రాజకీయాలు చేస్తోందని విమర్శలు చేశారు. పదేళ్లలో బీజేపీ పోగ్రెస్ రిపోర్ట్ ఏంటో ప్రజల ముందు ఉంచే దమ్ము ఉందా అంటూ కమలనాథులను ప్రశ్నించారు. స్వార్థం, విద్వేషం తప్ప ప్రజలకు ఉపయోగపడే పాలన లేదన్నారు. మోడీ పాలనను తిప్పికొట్టాల్సిన అవసరం ప్రతి పౌరుడి మీద ఉందని, క్రిటిసిజం తప్ప బీజేపీ నేతలకు సబ్జెక్ లేదని ఎద్దేవ చేశారు. బీజేపీ జిమ్మిక్కులను తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని, ప్రజా పాలనను చూసి ఇతర పార్టీల నుంచి చాలా మంది నేతలు కాంగ్రెస్‌లోకి వస్తున్నారని తెలిపారు. నల్లధనం తెస్తానని చెప్పిన మోడీ పదేళ్లలో ఎంత తెచ్చారో బయట పెట్టాలని డిమాండ్ చేశారు సామ రామ్మోహన్ రెడ్డి.