- ఒక పార్టీలో ఉంటూ ఇంకో పార్టీ నేతలతో సంప్రదింపులు
- గణనీయంగా పెరిగిపోతున్న జంప్ జిలానీల కల్చర్
- పార్టీలను చీల్చి అధికారం జేజిక్కించుకోవడంలో బీజేపీ ఫస్ట్
- హంగ్ వస్తుందంటే చాలు క్యాంపు రాజకీయాలు షురూ
- మద్దతుగా ఉంటే ఎన్ని కేసులున్నా పట్టించుకోని కమలనాథులు
- టచ్‌లో లేకపోతే మాత్రం టార్గెట్.. జైలుకు పంపుతున్న వైనం
టచ్ మీ నాట్ అనే మొక్క ఒకటి ఉంటుంది. తెలుగులో దీనినే అత్తిపత్తి అంటారు. దీనికి ఓ సహజ గుణం ఉంది. ముట్టుకోగానే ముడుచుకుపోతుంది. అయితే, పాలిటిక్స్‌లో మాత్రం నేటి రాజకీయ నేతలు టచ్ చేస్తే చాలు మురిసిపోతున్నారు. క్షణాల్లో కండువాలు మార్చేందుకు ఏమాత్రం వెనకాడటం లేదు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో ఎక్కువగా హాట్ టాపిక్‌గా మారిన పదం టచ్. ఎప్పుడు ఎవరు ఏ పార్టీతో టచ్‌లో ఉంటారో తెలియని పరిస్థితి. టచ్ చుట్టూనే నేటి రాజకీయ చక్రం గిర్రుమని తిరుగుతోంది. ఆ పార్టీ ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారని, లేదు లేదు మీ పార్టీ ఎమ్మెల్యేలే మాతో టచ్‌లో ఉన్నారంటూ మాటల గారడీ కొనసాగిస్తున్నారు నేతలు. అసలేంటీ టచ్ గోల? దాని చుట్టూ జరుగుతున్న రాజకీయం ఏంటి?
జంప్ జిలానీల సీజన్
ఇప్పుడంతా జంప్ జిలానీల సీజన్ నడుస్తోంది. ఎవరు ఎంతకాలం ఆ పార్టీలో ఉంటారో తెలియదు. ఎటువైపు జంప్ చేస్తారో కూడా తెలియదు. మరి కొందరు వేరే పార్టీకి వెళ్లి అక్కడ లొసుగులను రహస్యంగా తమ పార్టీ నేతలకు చేరవేస్తూ కోవర్టులుగా పనిచేస్తుంటారు. రాష్ట్ర ప్రభుత్వాన్నే కూల గొడదామని కొందరు తొడలుగొడుతుంటే… అసలు మీ పార్టీలో ఎమ్మెల్యేలు మిగిలేది చూసుకోండంటూ వార్నింగ్స్ ఇచ్చేవాళ్ళు మరికొందరు. ఈ సవాళ్ళు ప్రతిసవాళ్ళ పర్వంలోకి పాపం ఏ సంబంధం లేని దేవుళ్ళని కూడా లాగేస్తున్నారు. అమ్మతోడు అడ్డంగా అందర్నీ లాగేస్తామనే స్టైల్ ఒక పార్టీది అయితే, దేవుడి మీదొట్టు మీ సంగతి చూస్తామన్న శపథం మరొక పార్టీది. ముఖ్యంగా బీఆర్‌ఎస్, బీజేపీ ఈ మైండ్ గేమ్‌లో దిట్ట. ఇవన్నీ నిశితంగా గమనిస్తున్న కాంగ్రెస్, తమ జోలికి వస్తే మాత్రం మాడి మసైపోతారని వార్నింగ్ ఇస్తోంది.
జాతీయ స్థాయి టచ్ రాజకీయాలు
సర్జికల్ స్ట్రయిక్.. ఈ పదం ప్రధాని నరేంద్ర మోడీకి బాగా ఇష్టం. యుద్ధ విమానాలు మేఘాల్లో దాక్కుంటూ వెళ్లి పొరుగు రాష్ట్రంలో బాంబులు వేసిన వచ్చిన వైనాన్ని ఆయన విశదీకరించిన అంశాన్ని ఎవరూ మర్చిపోలేరు. అదే తరహాలో ఇప్పుడు దేశంలో తమతో టచ్‌లో లేని పార్టీలపై ఈ సర్జికల్ స్ట్రయిక్ చేస్తున్నారు. అన్ని ప్రాంతీయ పార్టీలను బీజేపీ, ప్రధాని టార్గెట్ చేయడం లేదు. తమకు టచ్‌లో ఉండే పార్టీలను దయ తలిచి వదిలేస్తున్నారు. భవిష్యత్‌లో తమతో టచ్‌లోకి వస్తాయని సంకేతాలు పంపుతున్న వారి జోలికి వెళ్లడం లేదు. గత ఎన్నికలలో బీజేపీపై యుద్ధం ప్రకటించి చివరికి తెల్ల జెండా ఎగురవేసింది బీఆర్ఎస్. ఈమధ్య కేసీఆర్ బీజేపీని పల్లెత్తు మాట అనకపోవడమే అందుకు నిదర్శనంగా చెబుతున్నారు ప్రత్యర్థి నేతలు. కవిత అరెస్ట్‌తో కేసీఆర్ కాంప్రమైజ్ అయ్యారనే చర్చలు జరుగుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఏదైనా జరగొచ్చని అంటున్నారు. ఇక, గతంలో ఎన్నో ప్రభుత్వాలను కూల్చి అధికారాన్ని దక్కించుకుంది బీజేపీ. మరోవైపు, ఏపీలో టీడీపీతో పొత్తు ఉన్నా, వైసీపీని కూడా టచ్‌లో పెట్టుకుందనే వాదన ఉంది. ఈ అంశాన్ని అక్కడి కాంగ్రెస్ చీఫ్ షర్మిల పదేపదే వినిపిస్తున్నారు. ఇలాంటి ద్వంద్వ వైఖరి రాష్ట్రానికే ప్రమాదమని చెబుతున్నారు. మొత్తానికి, ఇతర పార్టీలను తన దారికి తెచ్చుకోవడంలో బీజేపీ బిజీగా ఉంటే, ఉనికిని కాపాడుకోవడం కోసం బీఆర్ఎస్ లొంగిపోయిందనే చర్చ జరుగుతోంది. ఇదే సందర్భంలో తమను టచ్ చేస్తే మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కాంగ్రెస్ అంటోంది.